
అమ్మ చేసిన ద్రోహం
ఈ బేటీకి సంబంధించిన ఈ సంఘటన ఇటీవల మేడ్చల్‌లో జరిగింది.
సంతోషికి పద్నాలుగేళ్లు! చక్కని చుక్క. తనకు ఊహ తెలిసినప్పటినుంచే తండ్రిని చూడలేదు. వానాకాలం చదువు. కొన్నాళ్ల కిందట హఠాత్తుగా ఆమెకు ఓ వ్యక్తిని తండ్రిగా పరిచయం చేసింది సంతోషి తల్లి. అందుకు తగ్గట్టే ఇంటి బాధ్యతను తీసుకోవడం, సంతోషి స్కూల్ ఫీజు కట్టడం, తల్లిని, తనను అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం.. ఇవన్నీ ఆ పిల్లను చాలా సంతోషపెట్టాయి. అన్నిటికన్నా తండ్రి అనే భావన సంతోషిని బాగా ఆనందపెట్టింది. రోజులన్నీ అలా గడిచిపోతే.. ఈ రోజు బేటీ బచావోలో సంతోషి చర్చకు వచ్చి ఉండేది కాదు!
ఏం జరిగింది..
‘అమ్మ గుర్తొస్తుంది.. అమ్మను చూడాలి’ అని ఏడుస్తున్న పద్నాలుగేళ్ల అమాయకత్వం ఓ బిడ్డకు తల్లి అయింది. విస్మయం! పుట్టిన బిడ్డకు తండ్రి సంతోషికి తండ్రిగా వాళ్లింట్లోకి వచ్చిన వ్యక్తే! మనసు వికలమై, ఒళ్లు గగుర్పొడిచే విషయం ఏంటంటే.. సంతోషి అలా తల్లి అయ్యే పరిస్థితికి నెట్టిన మనిషి వేరే ఎవరో కాదు సొంత తల్లే! తేరుకొని నిజంలోకి వస్తే.. సంతోషి రెండు నెలల కిందట ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. మగబిడ్డ పుట్టాడు. అనారోగ్యంగా. ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. డెలివరీ అయ్యాక, సంతోషి ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక ఆ అమ్మాయిని కస్తూర్బాగాంధీ ఆశ్రమంలో చేర్పించారు.
తన ఈ దుస్థితికి తల్లే కారణమన్న విషయం ఇప్పటికీ పాపం.. ఆ పాపకు తెలియదు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్లాలి అని ఏడుస్తోంది. ఈ అమ్మాయి మానసికంగా కాస్త కోలుకున్నాక.. కౌన్సిలింగ్ చేసి స్కూల్లో చేర్పించాలనేది ఆశ్రమం వాళ్ల ఆలోచన. పుట్టిన బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ బతికితే శిశువిహార్‌లో చేర్పిస్తారు. తల్లి, ఆమె పరిచయం చేసిన తండ్రి జైల్లో ఉన్నారు. ఆ ఇద్దరు జైల్లో అనుభవించే శిక్షకన్నా సంతోషి అనుభవిస్తున్న వేదనే ఎక్కువ. ఆ అమ్మాయి ఏం పాపం చేసిందని ఈ శిక్ష? సొంత తల్లిని కూడా నమ్మకుండా ఏ బిడ్డ అయినా ఎలా ఉంటుంది? భద్రత కల్పించాల్సిన ఆమె ఒడి, రక్షణ కవచంలా మారాల్సిన ఆమె పరిష్వంగమే బిడ్డనుభక్షిస్తే ఎలా?
ఇప్పుడు ఇలాంటి బిడ్డలకు అండగా నిలబడాల్సింది మనమే! బయట భద్రత ఉంది అనే భరోసా కల్పిద్దాం! మన మగపిల్లలకు అమ్మాయిలను గౌరవించే సంస్కారాన్ని ఉగ్గుపాలతో పడదాం!
(పేరు మార్చాం)