సమానం అంటే సగమని కాదు
షబానా అజ్మీ.. బాలీవుడ్ నటి మాత్రమే కాదు.. సామాజిక రుగ్మతలపై తనదైన గొంతును వినిపించే సోషల్ యాక్టివిస్ట్. మహిళా సమస్యలపై, ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలపై నిరసన గళం వినిపించే రెబల్‌స్టార్. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏకంగా ఐదు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఈమె ఒకరు. ఇటీవల ఓ చర్చావేదికలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన షబానా ‘సిటీప్లస్’తో తన మనోభావాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.
శ్రావణ్ జయ
ప్రస్తుతం మన దేశంలో స్త్రీలపై అత్యాచారం జరగని రాష్ట్రాన్ని చూపించగలరా? ఎప్పుడో ఒకప్పుడు కాదు. ప్రతిరోజూ.. ఇంకా చెప్పాలంటే ప్రతి గంటకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ, మానవ హక్కుల కోసం గతంలో పోరాడాను. నేటి మహిళ స్థితి ఇంకా దీనావస్థలో ఉంది.
గతంలో స్త్రీలపై అత్యాచారం జరిగితే పోలీసుల రికార్డుల్లో మాత్రమే నమోదయ్యేది. నేరం చేసినవారికి శిక్ష పడిన దాఖలాలు కూడా చాలా తక్కువ. అయితే నిర్భయ చట్టం వచ్చాక పెద్ద సంఖ్యలో యువత వీధుల్లోకి రావడం, స్త్రీల ర క్షణ గురించి కొంతమేరకైనా మాట్లాడటం హ ర్షించదగ్గ విషయం. కాని ‘నిర్భయ’, ‘బేటీ బచావో’ లాంటి చట్టాలు వచ్చాక కూడా అకృత్యాలు జరగడం విచారకరం. చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు అదుపులోకి రావు. స్త్రీని గౌరవంగా చూడాలన్న నైతిక ప్రేరణ కలిగించడం ముఖ్యం. అది ప్రతి ఒక్కరూ అనివార్యంగా తెలుసుకోవాలి.
నేటికీ బాల్య వివాహాలు..
స్త్రీ, పురుష విభేదాలు అతి ఎక్కువగా ఉన్న మనదేశంలో సమానత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమైన అంశం. నా తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. నాన్న (కైఫీ అజ్మీ), అమ్మ (షౌకత్ అజ్మీ).. వారిద్దరి భావోద్వేగాలు నాలోనూ ఉన్నాయి. అందుకే నటిగా బిజీగా ఉన్నా కూడా సామాజిక రుగ్మతలపై పోరాటం చేశా. నేటికీ 12 ఏళ్ల బాలికలకు పెళ్లి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం.
ఈ రోజుల్లో కూడా ఆడపిలల్ని కనడంలో అయిష్టత చూపిస్తున్నారు. ఒకవైపు పురిటిలోనే చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే బిడ్డను చంపేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. సమానత్వం అంటే జనాభాలో సగం మహిళలు ఉండటం కాదు.. హక్కుల్లో, అన్నింటా మహిళలకు సగ భాగం ఉండాలి కదా!
ప్రాధాన్యమివ్వని సినిమా...
సినిమాల్లో ఆడవాళ్లను ఆటబొమ్మలుగా చూపించే దౌర్భాగ్యం నుంచి దర్శకనిర్మాతలు బయటికి రావాలి. మన చిత్రాల్లో రానురాను మహిళలకు ఇంపార్టెన్స్ తగ్గుతోంది. ఏదో ఒకటి, రెండు తప్ప అన్ని సినిమాల స్క్రిప్టులు హీరోలను దృష్టిలో పెట్టుకుని రాసేవే. నే ను దాదాపు 120 సినిమాల్లో నటించాను. ప్రతి సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటా. ప్రస్తుతం ‘జబా’్జ అనే సినిమాలో నటిస్తున్నాను. మన సినిమాలు ప్రాక్టికల్‌గా, రియాలిటీ కి దగ్గరగా ఉండాలి. ఇండియన్ సినిమాలో సెన్సారింగ్ అంటే మాటల్ని, దృశ్యాల్ని కట్ చేయడమే. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఇప్పటికీ బ్రిటిష్ సెన్సారింగ్ విధానాన్ని అనుసరిస్తోంది.
కాని సెన్సార్ చేయడం అంటే ‘కట్’ చేయడం మాత్రమే కాదు. ఏదైనా దృశ్యం అభ్యంతరకరంగా కాని, నిబంధనలను ఉల్లఘించే విధంగా కాని ఉంటే కట్ చేయాలి. అలాకాక ప్రేక్షకుల వయసు, విచక్షణ జ్ఞానానికి సంబంధించిన దృశ్యాలు ఉంటే వాటిని కట్ చేయడం కంటే
ఆ చిత్రానికి రేటింగ్ మార్చి ఇవ్వాలి. అమెరికాలో చిత్రాలకు ఇదే తరహాలో సెన్సార్ విధానాన్ని పాటిస్తున్నారు.