రీమిక్స్ రీచార్జ్
‘వయ్యారి భామ’కు సిటీ డీజే స్వరాల జోడింపు
తె లుగు డీజే పృధ్వి మిక్స్ ఆల్బమ్స్‌కు ఊపు
‘యూట్యూబ్’లో తొలి తెలుగు డబ్‌స్టెప్ మిక్స్ హల్‌చల్
పబ్స్.. క్లబ్స్ ఈవెంట్స్‌లో మ్యూజిక్‌ని కదం తొక్కించే డిస్క్ జాకీ (డీజే)లు సిటీకి కొత్తకాదు. అయితే, అంత మాత్రాన డీజేల క్రేజ్ ఎల్లలు దాటదు. సొంతంగా ఆడియో, వీడియో ఆల్బమ్స్ రూపొందించి విడుదల చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. సిటీ డీజేలు ఈ విషయంలో కొంత వెనుకంజలో ఉన్నా.. డీజే పృథ్వి ‘మిక్స్ ట్రాక్’ను కదం తొక్కించాడు. అదీ ఇటీవలే
ఊపందుకున్న ‘డబ్ స్టెప్’ శైలిలో కావడం విశేషం. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
బాలీవుడ్‌లో భళా..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం రీమిక్స్ ఆల్బమ్స్ బాగా పాపులర్. హిందీ పాటల మిక్సింగ్‌తో మొదలైన ట్రెండ్.. తెలుగుకూ విస్తరించింది. అప్పట్లో ఘంటసాల పాటలను రీమిక్స్ చేసి విడుదల చేసిన ఆడియో ఆల్బమ్స్ కొన్ని సూపర్‌హిట్ అయ్యాయి కూడా. అయితే, తర్వాత ఈ ధోరణిలో మార్పు వచ్చింది. పాప్ గాయని స్మిత ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల...’తో పాత పాటలకు కొత్త స్వరాలు సమకూర్చే ట్రెండ్ మళ్లీ పుంజుకుని వరుసగా కొన్ని ఆల్బమ్స్ వచ్చాయి. మళ్లీ కొంత గ్యాప్. తర్వాత హీరో చిరంజీవి హిట్ సాంగ్స్‌ని ‘మెగామిక్స్’ పేరుతో నగరానికే చెందిన డీజే ప్రభు రూపొందించారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆయనే ఇళయరాజా పాటల మిక్స్ ఆడియోను ‘చలాకీ చిన్నది’ పేరుతో విడుదల చేశారు. రానురానాను పూర్తి పాటను నవీకరించే రీమిక్స్‌లూ తగ్గిపోయాయి. పాత పాటకు తమవైన సంగీత ప్రత్యేకతను జత చేసే డీజే మిక్స్‌లూ అరుదైపోయాయి.
అదే సమయంలో హిందీ పాటల మిక్సింగ్ ఎప్పటికప్పడు వైవిధ్య రీతులను సంతరించుకుంటూ ఊపందుకుంటోంది. సినీతారలు కూడా మ్యూజిక్ ఆల్బమ్స్‌పై మోజు పెంచుకునేంతగా బాలీవుడ్‌లో మిక్సింగ్ విజృంభిస్తోంది. అక్కడి ఆల్బమ్స్ విజృంభణకు ముంబై డీజేల క్రియేటివిటీయే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడు హిట్ సాంగ్స్‌కు సొంత ట్రాక్‌లు, మరోవైపు పాత పాటలకు కొత్త సంగీతాన్ని జత చేస్తూ నార్త్‌లో దూసుకుపోతున్నారు డీజేలు. అయితే మన సిటీ డీజేలు కూడా హిందీ, ఇంగ్లిష్ ట్రాక్స్‌నే మిక్సింగ్‌కు ఎంచుకుంటుండటంతో నేటి యువ శ్రోతలకు నిన్నటి పాటలను కొత్త శైలిలో వినే అవకాశం దక్కడం లేదు. మరోపక్క తెలుగు పాటల మిక్స్ ఆల్బమ్స్‌కు సినిమాల్లో రీమిక్స్ పాటల వెల్లువ అడ్డుకట్ట వేసింది. సినీ సంగీత దర్శకులే రీమిక్స్ పాటలకు సై అంటుండడంతో ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించేవారు సెలైంటైపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు పాటల మిక్సింగ్ ట్రెండ్‌కు కాసింత ఊపు నిచ్చేలా సిటీ డీజే పృథ్వీ తాజాగా ఒక పాత పాటకు డీజే మిక్స్ చేశారు.
కిక్ ఇచ్చిన ‘డబ్ స్టెప్’..
ఈ డబ్ స్టెప్ మూలాలు ఇంగ్లాండ్‌లోని సౌత్ లండన్‌లో ఉన్నాయని చెబుతారు. డ్రమ్స్, పెర్క్యుషన్, బాస్ ఫ్రీక్వెన్సీస్ మేళ వింపుతో సాగే ఈ శైలి.. బాగా ప్రయోగాత్మకంగా సాగే రీమిక్స్‌లకు పేరొందింది. మూలాలు మూడు దశాబ్దాల క్రితమే ఉన్నాయని గుర్తించినా, 2010 నుంచి లండన్ నైట్ క్లబ్స్‌లో డబ్ స్టెప్ స్టైల్‌ను డీజేలు బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. పెద్ద పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా అమెరికాలో దీని పాపులారిటీ పెరగడంతో ఇప్పుడిప్పుడే ఆసియా దేశాలకు సైతం విస్తరించింది. డిస్క్ జాకీల రీమిక్స్‌ల ఆధారంగా విజృంభిస్తున్న డబ్‌స్టెప్‌ను సిటీ డీజే పృథ్వీ తన తాజా మిక్సింగ్‌కు వినియోగించడం ఇప్పుడు నగరంలో మరికొందరు డీజేలను ఇన్‌స్పైర్ చేస్తోంది.
‘వయ్యారి భామ’కు వన్నె చిన్నెలు..
పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’లోని ‘వయ్యారి భామా నీ హంస నడక..’ పాట అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. వైవిధ్యమైన సంగీతానికి పెట్టింది పేరైన రమణ గోగుల కూర్చిన ఈ పాట ఇప్పుడు విన్నా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలాంటి పాటనే ఎంచుకున్నాడు సిటీ యంగెస్ట్ అండ్ బెస్ట్ డీజేగా పేరొందిన పృథ్వి. ‘నేను పవన్ కల్యాణ్ అభిమానిని. వయ్యారి భామ పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తమ్ముడు సినిమాలో పవన్ చేసిన కొన్ని హాస్య సన్నివేశాలు, ఆడవారి గొంతును అనుకరిస్తూ మాట్లాడిన మాటలు.. వంటివి ఇప్పటికీ యూత్ సరదా చాట్స్‌లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. అందుకే ఆ పాటను, కొన్ని మాటలను, నా మ్యూజిక్‌ని మిక్స్ చేసి కొత్తగా విడుదల చేశా’నన్నాడు పృథ్వి. రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ పాట.. వేల సంఖ్యలో హిట్స్‌తో వీక్షకుల ఆదరణ పొందిందంటున్నాడీ యంగ్ డీజే స్టార్. త్వరలోనే మరికొన్ని తెలుగు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలని అనుకుంటున్నట్లు పృథ్వీ చెప్పాడు.