
దారితోచని పాదచారి
అదిగో అది రోడ్డు..! ఎవరికి..? వాహనాలకు. ఇదిగో ఇది ఫుట్‌పాత్..! ఎవరికి ? పాదచారులకు. మరి నడిచే వారేరి..? నడిచే వారికి దారేది..? ఈ నగరంలో
ఫుట్‌పాత్‌లుండాలి ఎవరికైనా కనిపించాయా..?
రోడ్లు విస్తరిస్తున్నాయి. వాటి నిండా వాహనాలు నిండిపోతున్నాయి. రహదారులు వెడల్పయ్యే కొద్దీ ఫుట్‌పాత్‌లు చిక్కిపోతున్నాయి. వాహనాలు పెరిగే కొద్దీ పాదచారులూ బక్కచిక్కిపోతున్నారు. దూరం తక్కువే అయినా నడిచే తీరిక లేదు నగరవాసికి. నడిచే తీరిక ఉన్నా రహదారిపై పద్మవ్యూహాన్ని ఛేదించే ఓపిక అంతకన్నా లేదు. తప్పక నడుద్దామనుకుంటే.. ఫుట్‌పాత్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిందే. విక్రమార్కుడిలా అన్వేషణ సాగిస్తే అక్కడక్కడా ఒక్కో సైజులో ఉండీ లేనట్టు ఊరిస్తూ దర్శనమిస్తాయివి.
దారి కాచిన చిక్కులు..
నైలు నది ఉన్నట్టుండి ఎడారిలో మాయమైనట్టు మన సిటీలో ఫుట్‌పాత్‌లు సడన్‌గా మాయమై ఏ దుకాణానికి సంబంధించిన సామగ్రో కాళ్లముందు ప్రత్యక్షమవుతుంది. కాలు తడవకుండా సముద్రాన్నయినా దాటొచ్చేమో కాని.. కాలు రోడ్డు మీద పెట్టకుండా ఫుట్‌పాత్ మీద నడవలేమన్నది ‘నగర సత్యం’. అడుగడుగునా ఆక్రమణలు, కబ్జాలు సారీ అలా అంటే వారికి కోపమొస్తుందేమో ! ఏదో జస్ట్ ఖాళీగాఉందని వాడుకుంటున్నారు. కేవలం దుకాణాదారులేనా.. గృహస్తులు, అపార్ట్‌మెంట్‌వాసులూ తక్కువేం కాదు. మొక్కల పెంపకం పేరుతో ఫుట్‌పాత్‌లను అందంగా వాడేసుకుంటున్నారు. అడగటానికి మీరొస్తారా..! నేనొస్తానా..!! అందుకే అవి అందంగా చెలామణీ అయిపోతున్నాయి.
ఇదీ రహదారే..
ఇక అక్కడక్కడ కనిపించే ఫుట్‌పాత్‌లని ముఖ్యంగా మెయిన్ రోడ్‌పై ఫుట్‌పాత్‌లను యమ దర్జాగా వాడుకునే బైక్‌వీరుల గురించి చెప్పాలి. సిగ్నల్ పడినా ట్రాఫిక్‌లో కొన్ని బైకుల వేగం ఆగదు. ఫుట్‌పాత్ కనిపిస్తే చాలు వాటిపైకి ఎక్కేస్తాయి. వారి కోసమే ఫుట్‌పాత్ ఉందన్నట్టు రేసింగ్‌లో దూసుకెళ్లినట్టు ముందుకెళ్తారు. ఫుట్‌పాత్‌లు ఇలా కూడా వాడొచ్చన్నమాట అని విస్తుపోవడం మన వంతు. ఆపడానికి మీరొచ్చారా..! నేనొచ్చానా..!! అందుకే వాళ్లు ఫుట్‌పాత్‌లను సైతం ‘మా దారి రహదారి’ అని డిక్లేర్ చేస్తున్నారు.
మార్గదర్శులెవరు..?
‘కంచే చేను మేస్తే’ అన్న చందంగా ప్రభుత్వం వల్ల కలిగే నష్టాల గురించి ఎవరి దగ్గర మొర పెట్టుకోవాలో చెప్పండి. రోడ్డుతో పాటు ఫుట్‌పాత్‌లకూ ఇంత బడ్జెట్ ఉంటుంది. కానీ రోడ్డొకరిది.. ఫుట్‌పాత్ ఒకరిది. నారు పోసిన వాడు నీరు పోయక మానడు. కాని, రోడ్డు పోసిన వాడు ఫుట్‌పాత్ మాత్రం వేయడు. అది వేరే డిపార్ట్‌మెంట్ పని కనుక. పోనీ ఎట్టకేలకు ఫుట్‌పాత్ తయారైనా.. మరో డిపార్ట్‌మెంట్ అర్జెంట్‌గా తవ్వి తీరుతుంది. అలా తవ్వింది పూడ్చడానికి మరో బడ్జెట్‌కాలం పడుతుంది. ‘మా తాతలు గోతులు తవ్వారు.. మేం నీతులు చెబుతున్నాం’ అంటూ చూసే వారే కానీ నిజంగా ఫుట్‌పాత్‌ల గురించి ఆలోచించే డిపార్ట్‌మెంట్లేవి.
ఓ బాటటౌటటడ
నడకదారి మనందరి హక్కు. అందమైన రోడ్లతో పాటు సరైన ఫుట్‌పాత్‌లు మన నగరానికి నిజమైన అవసరం. మనం వాడనిదే, అడగనిదే ఆ అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావు. ఓ పక్క కొన్ని చోట్ల నిజంగానే ఫుట్‌పాత్‌లు అందంగా ఉన్నా, వాటిని ఉపయోగించే పాదచారులు ఏరి..? ఫుట్‌పాత్‌లు ఉన్నా కూడా రోడ్డు మీద వాహనాల మధ్యలో నడిచే వారు మనలో చాలామందే ఉన్నారు. అలవాటులో పొరపాటుగా ఫుట్‌పాత్ మరచిపోయి మరీ వాహనాలతో పోటీపడుతున్నారు. ఈ సారి ఫుట్‌పాత్ కనిపిస్తే పండుగ చేసుకోండి. దానిపై దర్జాగా నడవండి. ఏదైనా అడ్డొస్తే ధైర్యంగా అడగండి. నడవడం మన హక్కు. ఫుట్‌పాత్ మన అధికారం.