
పాదచారీ... నీకు కొత్తదారి
సాక్షి, సిటీ బ్యూరో: రయ్ రయ్‌మంటూ ఒకదాని వెంట ఒకటిగా దూసుకు వచ్చే వాహనాలు... రోడ్డు మీద కాలు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు...ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకు వస్తుందో... ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలసిపోతాయో తెలియని భయానక వాతావరణం... ఇది నగర వాసులకు అనుభవైక వేద్యం. ఇలా రోడ్డు దాటే క్రమంలో ఏడాది వ్యవధిలో సుమారు 40 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ దుస్థితి నుంచి నగర వాసులను బయట పడేసేందుకు జీహెచ్‌ఎంసీ ముందుకు వచ్చింది. నగరంలో సుమారు పది ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీ(ఫుట్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీని కోసం గతంలోనే సర్వేలు పూర్తయ్యాయి. దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతుందని ఏడాది క్రితం సంబంధిత అధికారులు అంచనాలు వేశారు. కానీ పనులుప్రారంభించలేదు. కొత్తవి చేపట్టలేదు సరికదా, మెట్రో రైలు పనులకు అడ్డుగా ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎఫ్‌ఓబీలను తొలగించారు.
దీంతో పాదచారుల సమస్యలు మరింత పెరిగాయి. తాజాగా మరోసారి ఈ అంశంపైజీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. పాదచారులు రోడ్లు దాటేందుకు పడుతున్న అవస్థలను తొలగించేందుకు రద్దీ ప్రాంతాల్లో అవసరమైనన్ని ఎఫ్‌ఓబీలు నిర్మించేందుకు సిద్ధమైంది. ఇలా సుమారు 50 ఎఫ్‌ఓబీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మరోసారి సర్వే చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో పోలీసు, అస్కి అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో లిఫ్టులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ వ్యవధి పట్టడంతో పాటు ఒక చోటు నుంచి మరోచోటుకు మార్చే అవకాశం కూడా ఉండటంతో వీటి వైపుమొగ్గు చూపారు. పాదచారులకు ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు లిఫ్ట్ సదుపాయం ఉండేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. మెట్రో రైలు మార్గాల్లో వంతెనకు ఎగువ భాగంలో గానీ, దిగువ భాగంలో గానీ వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఖర్చుకు వెనుకాడేది లేదని, ప్రజావసరాల దృష్ట్యా స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన వెంటనే ఈ పనులు చేపడతామన్నారు.