సాక్షి, సిటీబ్యూరో: పాదచారుల సౌకర్యాలపై బల్దియా దృష్టి పెట్టింది. ఇప్పటికే నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించగా.. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అంతర్గత రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలిదశలో జోన్‌కు కనీసం 10 కి.మీ చొప్పున ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు వివిధ ప్రాంతాల్లో మార్గాలను ఎంపిక చేశారు. గ్రేటర్‌లో దాదాపు 9100 కి.మీ మేర రోడ్లు ఉండగా, వీటిలో 900 కి.మీ మేర ప్రధాన రహదారులు ఉన్నాయి. ఇందులోసుమారు 700 కి.మీ.కు పైగా బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణాంచే ముఖ్యమైన మార్గాలు కావడంతో వీటి నిర్వహణను ‘యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్’ (ఏఎంసీ)కి ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికయ్యే కాంట్రాక్ట్ ఏజెన్సీయే ఆయా రోడ్ల నిర్వహణతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ కూడా చూడాల్సి ఉంటుంది. అయితే, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత మార్గాల్లోనూ రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని ఇటీవల మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫుట్‌పాత్‌లు నిర్మించాల్సిన మారాలను స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గుర్తించారు. త్వరలోనే అంచనాలు, ఇతర ముఖ్యమైన పనులు పూర్తిచేసి ఫుట్‌పాత్‌ల పనులకు టెండర్లు పిలిచేందుకు చర్యలు ప్రారంభించారు. శేరిలింగంపల్లి జోన్‌లో నిర్మించే ఫుట్‌పాత్‌లకు రీసైకిల్డ్ ప్లాస్టిక్ టైల్స్ వినియోగించాలని నిర్ణయించారు.
ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొన్ని..
అంతర్గత రోడ్లలో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని హిమాయత్‌నగర్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, రాంగోపాల్‌పేట, బేగంపేట, చార్మినార్ జోన్ పరిధిలోని మూసారంబాగ్, ఐఎస్ సదన్, రామ్నాస్‌పురా, ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎల్‌బీనగర్ జోన్‌లోని కాప్రా, చిల్కానగర్, నాగోల్, బీఎన్‌రెడ్డి కాలనీ, హస్తినాపురం, ఆర్కేపురం తదితర వార్డులు ఉన్నాయి. వీటితోపాటు కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌లోని గౌతంనగర్–ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్, మంజీరా పైప్‌లైన్ రోడ్–ఇందూ విల్లాస్, కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఎల్లమ్మబండ–జన్మభూమి కాలనీ, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుచిత్రారోడ్–బ్యాంక్‌కాలనీ కమ్యూనిటీహాల్, గాంధీ విగ్రహం–వెంకటేశ్వరస్వామి గుడి, గాజులరామారం సర్కిల్ పరిధిలోని ఉషోదయకాలనీ, శేరిలింగంపల్లి జోన్‌లోని దీప్తిశ్రీనగర్, కాకతీయహిల్స్ తదితర ప్రాంతాలు ఉన్నాయి.
నడిచేందుకు వీలుగా నిర్మాణం
గ్రేటర్ నగరంలో 9100 కి.మీ రహదారులు ఉన్నప్పటికీ 500 కి.మీ మించి ఫుట్‌ఫాత్‌లు లేవు. దీంతో పలు సందర్భాల్లో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణనష్టం కూడా జరుగుతోంది. ప్రధాన రహదారుల పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తుండడంతో అంతర్గత రహదారుల్లో రద్దీ ఉండే మార్గాల్లో ప్రజలు నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థల సదుపాయాన్ని బట్టి వీటిని నిర్మించనున్నారు. అర్బన్ రోడ్ స్టాండర్ట్స్ మేరకు ఫుట్‌పాత్‌ల వెడల్పు రోడ్డు వెడల్పులో కనీసం పది శాతం ఉండాలి. అంటే 60 అడుగుల రోడ్డుంటే కనీసం 6 అడుగుల వెడల్పుతో ఫుట్‌ఫాత్ ఉండాలని ఇంజినీర్లు చెబుతున్నారు. కానీ నగరంలోని పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యం కాదు. దీంతో తక్కువ స్థలమున్న ప్రాంతాల్లోనూ కనీసం 1.2 మీటర్ల వెడల్పుకు తగ్గకుండా ఫుట్‌పాత్‌లు నిర్మించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కనీసం ఈ వెడల్పు కూడా లేకపోతే పాదచారులు నడిచే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment