
నాట్యలాస్యం
ఆదివాసీలకు ఆలవాలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో అడుగడుగునా జానపదలాస్యం కనిపిస్తుంది. మణిపూర్‌లో వికసించి, జానపద వైభవానికి ప్రతీకలుగా నిలిచిన ‘వసంత్ రాస్, పుంగ్ చోలమ్’.. నాట్యాలకు హైదరాబాద్ వేదిక కానుంది. శిల్పారామంలోని అంఫీ థియేటర్‌లో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ జంట నృత్యాలు కనువిందు చేయనున్నాయి. ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మణిపురి డ్యాన్స్ అకాడమీకి చెందిన 20 మంది కళాకారులు వీటిని ప్రదర్శించనున్నారు.
రాసలీల రేయిలోని..
బృందావన శ్రీకృష్ణుడి రాసలీలను కీర్తిస్తూ సాగే నాట్యం వసంత్‌రాస్. మణిపూర్‌లో వసంత రుతువు ఆగమనం తర్వాత చైత్ర మాసంలో జానపదులు జరిపే ఉత్సవాల్లో వసంత రాస్ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాధాకృష్ణుల ఆనందకేళి, కృష్ణునితో గోపికల వినోదవల్లరి.. ఇలా భాషలోన రాయలేని.. రాసలీల రేయిని.. ఈ రూపకంలో కళ్లముందుంచుతారు కళాకారులు.
ఢమరుకం మోగ..
హోలీ వేళలో.. మణిపూర్ పల్లెల్లో పుంగ్ చోలమ్ కన్నులవిందుగా సాగుతుంది. మృదంగాలు చేతబూనిన కళాకారుల లాస్య విన్యాసం చూసి తరించాల్సిందే. పాదరసంలా పాదాలను కదుపుతూ.. గాలిలో ఎగురుతూ.. చేసే నృత్యం అద్భుతంగా సాగుతుంది.
ఫోన్: 9849298275, 9391047632