కిడ్స్ కిష్కింద
ఓన్లీ యాక్షన్.. నో కట్.. 140 సన్నివేశాలు.. 25 పాటలు..12 గంటల నిర్విరామ ప్రదర్శన.. 250 మంది ఆర్టిస్టులు సింగిల్ టేక్‌లో అదరగొట్టారు. అలాగని వీళ్లంతా రంగస్థలంపై రాటుదేలిన నటశేఖరులేమీ కాదు, ఇంకా స్కూలేజ్ కూడా దాటని బాలబాలికలే.. రంగస్థలంపై తొలిసారి అడుగుపెట్టినవారే. అయితేనేం, ఇటీవల రవీంద్రభారతిని కిష్కిందపురం అగ్రహారంగా మార్చేశారు. తమ అద్వితీయ నటనతో ఈ రుద్రాంశ జన్మ వృత్తాంతం మొదలుకొని..
ఆంజనేయ యానాన్ని తు.చ తప్పకుండా కళ్ల ముందుంచారు.
త్రిగుళ్ల నాగరాజు
ఆంజనేయుడు వానరశ్రేష్టుడే కాదు, పిల్లలకు ఇష్టదైవం కూడా. ఈ వాయునందనుడి లీలలు పిల్లలకు భలే పసందుగా ఉంటాయి. ఆ కపిరాజు కుప్పిగంతులు, తోకతో చేసే విన్యాసాలు, కండలు తిరిగిన శరీరం, ధైర్యసాహసాలు.. ఇవన్నీ చిన్నారుల్లో అంజనీపుత్రుడి పై ప్రత్యేకమైన భక్తికి
కారణాలు. అందుకే తన శ్రీ ఆంజనేయం ప్రాజెక్ట్‌కు
నటీనటులుగా బాలబాలికలను ఎంచుకున్నానంటారు ఈ నాటక రూపకర్త దీనబాంధవ.
శ్రీ ఆంజనేయం..
దీనబాంధవ స్వగ్రామం యాదగిరిగుట్ట. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఎం.ఏ సంస్కృతం, ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్) పట్టా పొందారు. ప్రస్తుతం 101.9 ఎఫ్‌ఎంలో రేడియో జాకీగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లు పలు పాఠశాలల్లో థియేటర్ ఆర్ట్స్ టీచర్‌గా కూడా పనిచేశారు. తెలుగు నాటక వైభవాన్ని మరోసారి దశదిశలా చాటాలనే సంకల్పంతో 12 గంటల నిర్విరామ నాటకాన్ని ప్రదర్శించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తను ఎంతగానో ఆరాధించే ఆంజనేయుడి చరిత్రనే కథావస్తువుగా ఎంచుకున్నారు.
45 రోజుల శిక్షణ..
ఆంజనేయుడి చరిత్రనంతా క్రోడీకరించి.. కొన్ని నెలలు
కష్టపడి 12 గంటలకు సరిపడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. తానే స్వయంగా 25 పాటలూ రాశారు. స్నేహితుడు ఫణి
నారాయణ వీటికి స్వర రచన చేశారు. 250 మంది చిన్నారులను పాత్రధారులుగా ఎంచుకున్నారు. వారికి 45 రోజుల పాటు స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత రెండు గంటల శిక్షణ నిచ్చేవారు. ఈ ప్రక్రియలో దీనబాంధవకు అతడి స్నేహితులు తిరుమలేశ్, సురేష్, ముస్తఫా,
రాజ్‌కుమార్‌లు సహాయం చేశారు. నాటకంలోని పాటలకు దీనబాంధవ భార్య వల్లివసంతం, ఆమె స్నేహితురాలు హారతి డ్యాన్స్ కంపోజ్ చేశారు.
సీన్ బై సీన్..
తనను కైలాసం దగ్గర అడ్డుకున్న నందిని రావణుడు అవమానించడం.. ప్రతిగా నంది ‘వానరుల వల్లే లంక నాశనమవుతుంద’ని శపించడంతో నాటకం మొదలవుతుంది. తర్వాత శివపార్వతుల కేళీ ఫలాన్ని వాయుదేవుడు అంజనీదేవికి ప్రసాదంగా అందివ్వడం.. ఆంజనేయుడి జననం.. విద్యాభ్యాసం.. వాలి సుగ్రీవుల కథ.. రామసుగ్రీవుల మైత్రి.. వాలి వధ, వానరసేన సీతాన్వేషణ, ఆంజనేయుడి సముద్ర లంఘనం, లంకిణి గర్వహరణం.. సీతమ్మ దర్శనం.. లంకాదహనం.. అహిరావణ, మహిరావణుల కథ.. ఆంజనేయుడి మానస పుత్రులు మకరధ్వజుడు, మత్స్యవల్లభుల వృత్తాంతం.. రావణ సంహారం.. రామ పట్టాభిషేకం.. ఇలా రామయణ ంలోని ఎన్నో ఘట్టాలు కళ్ల ముందుంచారు బాలనటులు. అంతేనా, ద్వాపరయుగంలో భీమాంజనేయ సంవాదం, కృష్ణాంజనేయ యుద్ధం, నారద, తుంబురల గర్వభంగం.. కలియుగానికి వచ్చేసరికి యాదగిరిగుట్ట క్షేత్రానికి స్వామి క్షేత్రపాలకుడైన విధం, త్యాగరాయస్వామిని హనుమ అనుగ్రహించిన కథ.. ఇలా ఎన్నో గాథలను ప్రదర్శించారీ చిన్నారి నటులు.
ఆఫ్టర్ సమ్మర్..
పన్నెండు గంటల నిర్విరామ నాటక యజ్ఞంలో నగరంలోని సువిద్య పాఠశాలకు చెందిన చిన్నారులు మొదటి ఆరు గంటలు పాలుపంచుకున్నారు. తర్వాతి మూడు గంటల పోర్షన్‌ను శ్రీ మేధ స్కూల్ విద్యార్థులు, చివరి మూడు గంటల భాగాన్ని సూపర్ ట్విన్ సిటీస్ పాఠశాల విద్యార్థులు అభినయించారు. ఈ మెగా నాటకం తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈసారి గిన్నిస్ రికార్డ్ సృష్టించడమే లక్ష్యంగా జూన్‌లో 260 మంది చిన్నారులతో 13 గంటల నాటకానికి సమాయత్తమవుతున్నారు దీనబాంధవ. అందుకోసం ఈ వేసవిలో ప్రత్యేక శిబిరాన్ని కూడా నిర్వహిస్తానని చెబుతున్నారు.