No cut
-
కేంద్ర ఉద్యోగుల వేతనాల్లో కోత అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలపై మంత్రి ట్విట్టర్లో స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. వేతనాల్లో కోత ఉంటుందంటూ ఒక వర్గం మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం. అవి నిరాధార వార్తలు’అని పేర్కొన్నారు. కేంద్ర ఉద్యోగుల పెంచిన డీఏ అమలును వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. వేతనాల్లో కూడా కోత పెడుతుందంటూ వస్తున్న వార్తలపై ఆమె పై విధంగా స్పందించారు. -
‘హెచ్1బీ’ కోటాలో కోత లేదు
వాషింగ్టన్: విదేశీ కంపెనీలు సేకరించే సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని కోరే దేశాలకు జారీచేస్తున్న హెచ్1బీ వీసాల్లో ఎలాంటి కోత విధించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. డేటా ప్రవాహంపై భారత్‌తో అమెరికా జరుపుతున్న చర్చలకు, హెచ్1బీ వీసాల జారీపై ట్రంప్ యంత్రాంగం చేస్తున్న సమీక్షలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. విదేశీ కంపెనీలు భారత్‌లో సేకరించిన సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని కేంద్రం గతంలోనే సూచించింది. దీంతో అమెరికా కంపెనీలపై ఇలాంటి నిబంధనలు విధించే దేశాలకు జారీచేస్తున్న హెచ్1బీ వీసాల్లో 10–15 శాతం కోత విధించాలని అగ్రరాజ్యం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వీటిని ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా హెచ్1బీ సహా అన్ని వర్క్ వీసా ప్రోగ్రామ్‌లను ప్రభుత్వం సమీక్షిస్తోందని ఆయన తెలిపారు. ‘ఈ సమీక్షలు ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుని నిర్వహించడం లేదు. భారత్‌తో జరుగుతున్న చర్చలకు, హెచ్1బీ సమీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. దేశాల సరిహద్దును దాటి సమాచారం స్వేచ్ఛగా ప్రయాణించాల్సిన అవసరంపై అమెరికా భారత్‌తో చర్చిస్తోంది’ అని వెల్లడించారు. డేటాను గ్లోబల్ సర్వర్లలో కాకుండా స్థానికంగా భద్రపరచాల్సివస్తే వ్యయాలు పెరుగుతాయని విదేశీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. అత్యంత నైపుణ్యవంతులైన విదేశీయులు తమదేశంలో పనిచేసేందుకు వీలుగా ఏటా హెచ్1బీ వీసాలను అమెరికా జారీచేస్తోంది. మరోవైపు అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని పలువురు ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రస్తుత ఇమిగ్రేషన్ చట్టానికి సవరణ చేస్తేనే ఇది సాధ్యమనీ, అయితే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు, సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇది జరగడం కష్టమేనని వ్యాఖ్యానించారు. భారత్‌కు జారీచేస్తున్న హెచ్1బీ కోటాలో కోత విధిస్తే నిపుణుల రాక తగ్గి అంతిమంగా అమెరికాయే నష్టపోతుందని హెచ్చరించారు. -
కోతలుండవ్..
గద్వాల అర్బన్ : ఒకవైపు నిరంతర సరఫరా, మరోవైపు వేసవి దృష్ట్యా విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. దీంతో ట్రాన్స్‌కో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే మరమ్మతు నిమిత్తం నిధులు మంజూరయ్యాయి. ఇక వేసవితోపాటు వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ విద్యుత్ సరఫరాకు డోకా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తోంది. దీంతో ఆ నెలలో విద్యుత్ వినియోగం రెండింతలు పెరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు గ్రా మాల్లో పర్యటించి ఆటోమెటిక్ స్టార్లర్ల తొలగింపుపై రైతులకు అవగా హన కల్పించారు. బోర్లలోనూ నీటిమట్టం తగ్గిపోవడంతో క్రమేణా వినియోగం తగ్గింది. మార్చి నుంచి వేసవి ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికేగాక ప్రజలు సైతం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంతో డి మాండ్ పెరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై భారం పడి ఓల్టేజీ తగ్గింది. ట్రాన్స్‌కో అధికారులు అప్రమత్తత అప్రమత్తమైన అధికారులు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల బిగింపు, కెపాసిటర్ బ్యాంకుల కొనుగోలుకు రూ.ఆరు కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో 33/11కేవీ సబ్స్టేషన్లు 45అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా, వేసవి దృష్ట్యా వీటిలోని 38చోట్ల ట్రాన్స్ఫార్మర్లపై అధిక భారం పడటంతో కెపాసిటర్ బ్యాంకులు అమర్చనున్నారు. ఒక్కోటి రూ.12లక్షలు (2ఎంబీఏఆర్ సామర్థ్యం) ఉంటుంది. వీటి ఏర్పాటుతో ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గడమేగాక లోఓల్టేజీ సమస్య తీరుంది. రూ.మూడు కోట్లతో అదనపు పవర్ ట్రాన్స్ఫ్మార్లను అమర్చనున్నారు. ముఖ్యం గా నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, మల్లాపురంతండా, మారమునగాల, ఉత్తనూరు, మానవపాడు, జమ్మిచేడు, రాజోళి తదితర ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. అలాగే చింతలకుంట సబ్‌స్టేషన్‌లో రెండు ట్రాన్స్ఫార్మర్లు 5ఎంఎల్వీ 8ఎంఎల్వీ, మాన్‌దొడ్డిలో 3.15 నుంచి 5ఎంఎల్వీగా సామర్థ్యం పెంచనున్నారు. మిగతా చోట్ల సింగిల్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో డబుల్ పెంచనున్నారు. ప్రస్తు త వేసవితోపాటు వచ్చే జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్‌లోనూ విద్యుత్ సరఫరాకు డోకా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్ స్తంభాలు, వైర్ల మరమ్మతు, కొత్త పరికరాలు అమర్చాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు. అంచనాలు పంపించాం వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా, వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో విద్యుత్ విని యో గం అమాంతం పెరిగింది. దీంతో కొన్ని సబ్స్టేషన్లలోని ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కెపాసిటర్ బ్యాంకులు, అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్లకు నిధులు వచ్చాయి. పనుల అంచనా తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే ఈ పనులు తప్పక చేపడతాం. – సీహెచ్ చక్రపాణి, ట్రాన్స్‌కో ఎస్ఈ, గద్వాల -
కిడ్స్ కిష్కింద
ఓన్లీ యాక్షన్.. నో కట్.. 140 సన్నివేశాలు.. 25 పాటలు..12 గంటల నిర్విరామ ప్రదర్శన.. 250 మంది ఆర్టిస్టులు సింగిల్ టేక్‌లో అదరగొట్టారు. అలాగని వీళ్లంతా రంగస్థలంపై రాటుదేలిన నటశేఖరులేమీ కాదు, ఇంకా స్కూలేజ్ కూడా దాటని బాలబాలికలే.. రంగస్థలంపై తొలిసారి అడుగుపెట్టినవారే. అయితేనేం, ఇటీవల రవీంద్రభారతిని కిష్కిందపురం అగ్రహారంగా మార్చేశారు. తమ అద్వితీయ నటనతో ఈ రుద్రాంశ జన్మ వృత్తాంతం మొదలుకొని.. ఆంజనేయ యానాన్ని తు.చ తప్పకుండా కళ్ల ముందుంచారు. త్రిగుళ్ల నాగరాజు ఆంజనేయుడు వానరశ్రేష్టుడే కాదు, పిల్లలకు ఇష్టదైవం కూడా. ఈ వాయునందనుడి లీలలు పిల్లలకు భలే పసందుగా ఉంటాయి. ఆ కపిరాజు కుప్పిగంతులు, తోకతో చేసే విన్యాసాలు, కండలు తిరిగిన శరీరం, ధైర్యసాహసాలు.. ఇవన్నీ చిన్నారుల్లో అంజనీపుత్రుడి పై ప్రత్యేకమైన భక్తికి కారణాలు. అందుకే తన శ్రీ ఆంజనేయం ప్రాజెక్ట్‌కు నటీనటులుగా బాలబాలికలను ఎంచుకున్నానంటారు ఈ నాటక రూపకర్త దీనబాంధవ. శ్రీ ఆంజనేయం.. దీనబాంధవ స్వగ్రామం యాదగిరిగుట్ట. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఎం.ఏ సంస్కృతం, ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్) పట్టా పొందారు. ప్రస్తుతం 101.9 ఎఫ్ఎంలో రేడియో జాకీగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లు పలు పాఠశాలల్లో థియేటర్ ఆర్ట్స్ టీచర్‌గా కూడా పనిచేశారు. తెలుగు నాటక వైభవాన్ని మరోసారి దశదిశలా చాటాలనే సంకల్పంతో 12 గంటల నిర్విరామ నాటకాన్ని ప్రదర్శించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తను ఎంతగానో ఆరాధించే ఆంజనేయుడి చరిత్రనే కథావస్తువుగా ఎంచుకున్నారు. 45 రోజుల శిక్షణ.. ఆంజనేయుడి చరిత్రనంతా క్రోడీకరించి.. కొన్ని నెలలు కష్టపడి 12 గంటలకు సరిపడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. తానే స్వయంగా 25 పాటలూ రాశారు. స్నేహితుడు ఫణి నారాయణ వీటికి స్వర రచన చేశారు. 250 మంది చిన్నారులను పాత్రధారులుగా ఎంచుకున్నారు. వారికి 45 రోజుల పాటు స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత రెండు గంటల శిక్షణ నిచ్చేవారు. ఈ ప్రక్రియలో దీనబాంధవకు అతడి స్నేహితులు తిరుమలేశ్, సురేష్, ముస్తఫా, రాజ్‌కుమార్‌లు సహాయం చేశారు. నాటకంలోని పాటలకు దీనబాంధవ భార్య వల్లివసంతం, ఆమె స్నేహితురాలు హారతి డ్యాన్స్ కంపోజ్ చేశారు. సీన్ బై సీన్.. తనను కైలాసం దగ్గర అడ్డుకున్న నందిని రావణుడు అవమానించడం.. ప్రతిగా నంది ‘వానరుల వల్లే లంక నాశనమవుతుంద’ని శపించడంతో నాటకం మొదలవుతుంది. తర్వాత శివపార్వతుల కేళీ ఫలాన్ని వాయుదేవుడు అంజనీదేవికి ప్రసాదంగా అందివ్వడం.. ఆంజనేయుడి జననం.. విద్యాభ్యాసం.. వాలి సుగ్రీవుల కథ.. రామసుగ్రీవుల మైత్రి.. వాలి వధ, వానరసేన సీతాన్వేషణ, ఆంజనేయుడి సముద్ర లంఘనం, లంకిణి గర్వహరణం.. సీతమ్మ దర్శనం.. లంకాదహనం.. అహిరావణ, మహిరావణుల కథ.. ఆంజనేయుడి మానస పుత్రులు మకరధ్వజుడు, మత్స్యవల్లభుల వృత్తాంతం.. రావణ సంహారం.. రామ పట్టాభిషేకం.. ఇలా రామయణ ంలోని ఎన్నో ఘట్టాలు కళ్ల ముందుంచారు బాలనటులు. అంతేనా, ద్వాపరయుగంలో భీమాంజనేయ సంవాదం, కృష్ణాంజనేయ యుద్ధం, నారద, తుంబురల గర్వభంగం.. కలియుగానికి వచ్చేసరికి యాదగిరిగుట్ట క్షేత్రానికి స్వామి క్షేత్రపాలకుడైన విధం, త్యాగరాయస్వామిని హనుమ అనుగ్రహించిన కథ.. ఇలా ఎన్నో గాథలను ప్రదర్శించారీ చిన్నారి నటులు. ఆఫ్టర్ సమ్మర్.. పన్నెండు గంటల నిర్విరామ నాటక యజ్ఞంలో నగరంలోని సువిద్య పాఠశాలకు చెందిన చిన్నారులు మొదటి ఆరు గంటలు పాలుపంచుకున్నారు. తర్వాతి మూడు గంటల పోర్షన్‌ను శ్రీ మేధ స్కూల్ విద్యార్థులు, చివరి మూడు గంటల భాగాన్ని సూపర్ ట్విన్ సిటీస్ పాఠశాల విద్యార్థులు అభినయించారు. ఈ మెగా నాటకం తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈసారి గిన్నిస్ రికార్డ్ సృష్టించడమే లక్ష్యంగా జూన్‌లో 260 మంది చిన్నారులతో 13 గంటల నాటకానికి సమాయత్తమవుతున్నారు దీనబాంధవ. అందుకోసం ఈ వేసవిలో ప్రత్యేక శిబిరాన్ని కూడా నిర్వహిస్తానని చెబుతున్నారు.