
ప్రిన్సెస్ ఫ్రాక్స్
ఫ్రాక్స్.. అమ్మాయిల బాల్యానికే పరిమితమైన కాస్ట్యూమ్. పెద్దయ్యాక అంటే... సెలబ్రిటీస్ వంటి వారికి మాత్రమే సొంతమైంది. ధరించాలనే కోరిక ఉన్నా... పెద్దవాళ్లని కాదనలేక ఆ ఇష్టాన్ని కష్టంగా వదిలేస్తున్నారు. అయితే చిన్నప్పటి ఆ కుచ్చుల గౌన్‌ను లేటెస్ట్ ట్రెండ్‌గా మార్చారు నగరంలోని డిజై నర్లు. చూడగానే అందరికీ నచ్చి మెచ్చేలా ‘ప్రిన్సెస్ ఫ్రాక్’గా మార్కెట్‌లోకి తెస్తున్నారు!
సిరి
చిన్నప్పుడు కుచ్చులు కుచ్చుల గౌన్ వేసుకుని క్యూట్‌గా మెరిసిపోతుంటే ముద్దాడనివారుండరు. ఆ తరువాత వయసుతోపాటు ఫ్రాక్స్‌తో దూరం కూడా పెరిగిపోతుంది. ‘ఆ ఫ్రాక్ ఎంత బాగుందో కదా! ప్చ్... మనం వేసుకోలేమే?’ అని బాధపడే అమ్మాయిలెంతో మంది. అమ్మాయిలకు ఆ ఆనందాన్ని పంచేందుకు ప్రయత్నిస్తున్నారు డిజైనర్లు. పైనుంచి కిందివరకు సింగిల్ కాస్ట్యూమ్ విత్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తో ఉండే ‘ప్రిన్సెస్ ఫ్రాక్స్’ నగరంలో లేటస్ట్ ట్రెండ్. విదేశాల్లో ఫ్రాక్స్‌కి యమ క్రేజ్. జస్ట్ బోర్న్ బేబీ నుంచి సిక్‌స్టీ ప్లస్ బామ్మ వరకూ ఇది చాలా కామన్ కాస్ట్యూమ్. ఈ ట్రెండ్‌ను మన నగరవాసులు అందిపుచ్చుకున్నారు. అందుకే బర్త్‌డేస్‌లో ఏంజిల్‌లా కనిపించేందుకు సిండ్రిల్లా ఫ్రాక్స్ ధరించేందుకు ఇష్టపడుతున్నారు. ఎంగేజ్‌మెంట్, రిసెప్షన్, గెట్ టు గెదర్స్‌తోపాటు నైట్ పార్టీస్‌లో సైతం వీటికే టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు.
ఈ ప్రిన్సెస్ ఫ్రాక్‌కి గేరా 6 నుంచి 8 మీటర్లు ఉంటుంది. దీంతో కుచ్చులు బాగా వచ్చి ప్రిన్సెస్ లుక్ వస్తుంది. ఈ తరహా ఫ్రాక్స్‌పైన ఓపెన్ ఫ్రీహెయిర్ లేదా ట్రెండోనాట్, చెవులకు మెరిసే యాక్సెసరీస్ పర్ఫెక్ట్ మ్యాచ్. అప్పటికే రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి జువెలరీ అవసరం లేదు. కాళ్లకు మాత్రం కంఫర్ట్‌గా ఉండే వెడ్జెస్ లేదా హీల్స్ వేసుకుంటే ఆరోజు పార్టీకీ మీరే యువరాణి!
- స్వప్న పైడి, డిజైనర్