హయాత్‌ను పంచి, ఆయుష్షు పెంచే అమ్మల నగరమిది!
ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు ఎప్పుడైనా మీ మనసులోకి వస్తోందా? అంతటి వ్యాకులతకు మీరు గురవుతున్నారా? హైదరాబాద్ గడ్డ మీద అలాంటి ఆలోచన వస్తే... మీరు సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో, ఇలాంటి విషయాలకు కౌన్సెలింగ్ చేసే ఇతర నిపుణులనో కలవనక్కరలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ మన నగరంలోనే జరుగుతుంటుంది కదా! వికలాంగులకు ఎంసెట్టో, మరింకో జట్టుకో ఎంపిక జరుగుతుంటుంది కదా! ఫిజికల్లీ చాలెంజ్‌డ్ విద్యార్థులకు కౌన్సెలింగ్ జరిగే చోటుకు వెళ్లండి. ఈ హైదరాబాద్ గడ్డ మీద జరిగే ఆ మహాక్రతువును దర్శించిన వాడెవ్వడూ మళ్లీ ఆత్మహత్యకు పాల్పడడు. ఆత్మహత్య అంశానికీ హైదరాబాద్ నగరానికి సంబంధమేమిటని ఆశ్చర్యపడుతున్నారా?! ఇక చదవండి.
హైదరాబాద్ నగర స్థాపకుడు సుల్తాన్ కులీ కుమార్తె హయాత్‌బక్షీ. ఆమె తండ్రి విలాసవంతుడు. కానీ హయాత్‌బక్షీ భర్త సుల్తాన్ మీర్జా అలాకాదు. విషయంలోలత్వాల పట్ల విముఖుడు. అంతులేనంతగా అంతర్ముఖుడు. భర్తకు అనుగుణంగా నడుచుకునే ఇల్లాలుగా వ్యహరించేదామె. కొడుకు అబ్దుల్లా కుతుబ్‌షాహ్‌కు పన్నెండేళ్ల వయసు వచ్చీరాకముందే భర్త చనిపోయాడు. దాంతో పేరుకు అబ్దుల్లా పాలకుడే అయినా అన్ని పాలనా వ్యవహారాలనూ చక్కబెట్టేది ఆ తల్లి. అబ్దుల్లా తన తాత కులీ లాగే విలాసప్రియుడు. వినోదప్రియుడైన తండ్రి, ఏకాంతప్రియుడైన భర్త, విలాసప్రియుడైన కొడుకు... ఈ మూడు భిన్నమనస్తత్వాల తత్వాలెరిగి ప్రవర్తించిందామె. అందుకే అబ్దుల్లా కుతుబ్‌షాహ్ హయాంలో అరివీరభయంకరుడు, కరుడుగట్టిన వీరుడుగా పేరు పడ్డ ఔరంగజేబు గోల్కొండను ముట్టడించాడు. అబ్దుల్లా మీద ఔరంగజేబు ఆగ్రహించిన సమయమది. ఓటమి తప్పని పరిస్థితులవి. ముప్పయి తొమ్మిదేళ్ల ఔరంగజేబు ముందు దాదాపు రెట్టింపు వయసులో తెల్లని దుస్తులు ధరించి నిలబడిందా తల్లి. తన తెల్లటి కొంగుమాటున కొడుకును కప్పేసింది. తన తెల్లటి కొంగును తెల్లజెండా అనుకొమ్మని ఔరంగజేబుకు విన్నవించింది. రాజ్యాన్ని కబళించకుండా ఉండేలా రాయబారి భూమికను పోషిస్తూ... దౌత్య వ్యవహారాలను నిర్వహించిందా మాత.
అమ్మదనపు కమ్మదనాలనూ, మాతృదేవత గొప్పదనాలను కీర్తిస్తూ, శ్లాఘిస్తూ ఇప్పటికే అనేకానేక పాటలూ, పద్యాలూ, వాక్యాలూ, వ్యాసాలూ విరచితమై ఉన్నాయి. అమ్మప్రేమ గురించి కొత్తగా చెప్పేందుకేమీ లేదు. కానీ... ఒక్కమాట. అమ్మగా హయాత్‌బక్షీ అంశ అంతర్లీనంగా ఈ నగరం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందేమో! వికలాంగులైనాసరే విద్యలో విద్వత్తున్న తల్లులు... తమ పద్దెనిమిదీ, ఇరవైయ్యేళ్ల చిన్నారులను పిల్లలను పసిపాపాయిల్లా ఎత్తుకుని ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంస్థల మెట్లు అవలీలగా, అలవోకగా ఎక్కేస్తుంటారు. తమ బిడ్డలనూ కష్టాల మెట్లెక్కించి, డిగ్రీల గట్టెకించడానికి యత్నిస్తుంటారు.
తొమ్మిదో నెల తర్వాత బొడ్డు పేగు తెగుతుందనే మాట తప్పని నిరూపితమవుతుందిక్కడ. కంటికి కనపడని పేగుబంధం ఇరవయ్యేళ్ల కొడుకునీ భుజాన మోస్తూ ఉండేలా, చేతుల్లో ఎత్తుకునే ఉండేలా, భారం తెలియకుండా చేసేలా కట్టిపడేసి ఉందని ఇట్టే అర్థమైపోతుంటుంది మనకు. ఉర్దూలో హయాత్ అంటే ఆయుష్షు. బఖష్‌నా... అంటే ఉదారంగా పంచడం.
తన ఆయుష్షునూ ఔదార్యంతో పంచేసే, ఇదుగో అంటూ ఇచ్చేసే అమ్మ హయాత్‌బక్షీ లాంటి అమ్మలెందరో నడయాడే ఈ నగరంలో ఆ కౌన్సెలింగ్ ప్రక్రియను చూశాక... అన్ని అవయవాలూ సవ్యంగా, దివ్యంగా ఉన్న ఎవ్వడూ ఆత్మహత్యకు తలపెట్టడు. తప్పక బతుకుతాడు. ఎలాగైనా బతికేస్తాడు.