ఫీ‘జులుం’.. ప్రైవేటు స్కూళ్ల దండయాత్ర  | Private Schools Increased Fees For 2018 Education Year In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 8 2018 9:08 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Private Schools Increased Fees For 2018 Education Year In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఎల్బీనగర్‌ సహారా ఎస్టేట్‌కు చెందిన రంగారెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఆయనకు వచ్చే నెల జీతం రూ.35 వేలు. ఉప్పల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతున్న తన కుమారుడి కోసం చెల్లించిన ఫీజు రూ.45 వేలు. పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం, షూస్‌.. ఇలా అన్నీ కలిపి మరో రూ.12 వేలు చెల్లించాడు. ఇవి కాకుండా ఇంటి నుంచి ఉప్పల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ కోసం బస్సు ఫీజు రూ.24000. ఇలా తన మూడో తరగతి కొడుకు కోసం జూన్‌ నెలలో వెచ్చించిన మొత్తం రూ.లక్షకు పైనే. తనకు వస్తున్న జీతానికి, పిల్లాడికి చెల్లించిన ఫీజుకు పొంతనే లేదు. ఇక ఇంటి అద్దె, నిత్యావసరాలు, బైక్‌లో పెట్రోల్, ఇతర ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఇది ఒక్క రంగారెడ్డి ఆవేదన మాత్రమే కాదు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లక్షలాది మంది మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల సమస్య.  

జూన్‌ వచ్చిందంటే స్కూలుకు వెళ్లే పిల్లలున్న ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోయే పరిస్థితి. వేసవి సెలవుల్లో పిల్లలతో ఆనందంగా గడిపిన క్షణాలు జూన్‌ వచ్చే సరికి ఆవిరై పోతున్నాయి. ఏటా పెరుతున్న ఫీజులతో మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. కొద్దోగొప్పో సంపాదన ఉన్న కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే.. తక్కువ వేతనాలతో కాలం గడిపై అసంఘటిత కార్మికులు, చిరుద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇద్దరు పిల్లలున్న తల్లిదడ్రులు పిల్లల చదువుల కోసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గ్రేటర్‌ పరిధిలో ఆరువేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో 1200 పైగా సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఆయా స్కూళ్లలో చదువు కుంటున్న లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఆయా యాజమాన్యాలు ఫీజుల పేరిట దండయాత్ర మొదలెట్టాయి.  

హైదరాబాద్‌లోనే అత్యధిక ఫీజులు 
సీబీఎస్‌ఈ స్కూళ్లలో సగటు వార్షిక ఫీజులో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా ఎక్కువ. చెన్నైలో రూ.40 వేలు ఉంటే, బెంగళూరులో రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంది. న్యూఢిల్లీలో రూ.60 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సీబీఎస్‌ ఈ పాఠశాలల్లో ఏకంగా రూ.60 వేల నుంచి రూ.4.50 లక్షలకు పైగా ఉండడం గమనార్హం. నిజానికి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే స్కూలు భవనాల అద్దెలు, ఉపాధ్యాయుల వేతనాలు తక్కువ. వాటితో పోలిస్తే ఫీజులు కూడా తక్కువగా ఉండాలి. కానీ దేశరాజధాని ఢిల్లీ కంటే ఎక్కువగా వసూలు చేస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

అటకెక్కిన ప్రొ.తిరుపతిరావు కమిటీ సూచనలు 
అడ్డగోలు ఫీజుల పెంపుపై ప్రభుత్వం 2016లో ఉస్మానియా మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యాబోధన ఆధారంగా ఆయా పాఠశాలలను ‘ఎ,బి,సి’ గ్రేడ్లుగా విభజించి 2017లో కమిటీ నివేదిక సమర్పించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల మేరకు ఏటా పది శాతం ఫీజులు పెంచుకోచవ్చని సూచించింది. అయితే కార్పొరేట్‌ యాజమాన్యాలకు ఇది కూడా మింగుడుపడలేదు. కోర్టును ఆశ్రయించి అమలు ఆదేశాలను నిలుపదల చేయించి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.  

అవి ఫక్తూ వ్యాపార కేంద్రాలు 
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏ స్కూలైనా ఐదు శాతం కంటే ఎక్కువ లాభాలు పొందడానికి వీల్లేదు. స్కూళ్లను ఏర్పాటు చేసిన సమయంలోనే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, సామాజిక సేవే లక్ష్యంగా స్కూళ్లను స్థాపిస్తున్నట్లు అఫిడవిట్‌ సమర్పిస్తాయి. కానీ వాస్తవంలో మాత్రం ఫక్తూ వ్యాపార కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులో 50 శాతం ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. కానీ ఏ ఒక్క యాజమాన్యం 20 శాతానికి మించి వేతనాలుగా వెచ్చించడం లేదు. కానీ విద్యార్థుల నుంచి ఏటా 20 నుంచి 35 శాతం ఫీజులు పెంచుతూనే ఉన్నాయి. నిజానికి ఫీజులు పెంచాలంటే జీఓ నెంబర్‌ 42 ప్రకారం జిల్లా ఫీజుల క్రమబద్ధీకరణ కమిటీ అనుమతి తీసుకోవాలి. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫాంలను తమ వద్దే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. పాఠశాల ఆవరణలోనే స్టేషనరీ కౌంటర్లు తెరిచినా పట్టించుకున్న నాధుడే కరువయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement