సాక్షి, హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ అని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమన్న భాగ్యరెడ్డివర్మ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి విద్యాసంస్థను నెలకొల్పనున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, ఆది–హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యరెడ్డివర్మ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు.
మంత్రి ఈటల ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈనాటి తెలంగాణ గడ్డకు ఉన్న ప్రశ్నించే తత్త్వం, పోరాడే మనసత్త్వం ఆనాడు భాగ్యరెడ్డివర్మ వేసిన బీజాలేనని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని.. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు, ఆశయాల సాధన కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ 15 ఏళ్ల క్రితమే భాగ్యరెడ్డి వర్మ గురించి తమకు చెప్పేవారని గుర్తుచేశారు.
ఆ పాఠశాలను స్ఫూర్తిగా నిలుపుకొందాం..
అప్పట్లో హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో భాగ్యరెడ్డివర్మ నెలకొల్పిన పాఠశాలను నిలుపుకోవాల్సి ఉందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందని ఈటల చెప్పారు. భాగ్యరెడ్డివర్మ పేరుతో ఓ విద్యాసంస్థ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని.. ఆ దిశగా చర్యలు కూడా మొదలయ్యాయని తెలిపారు. చైతన్యానికి ప్రతీక అయిన భాగ్యరెడ్డివర్మ గురించి రేపటి తరానికి తెలిసేలా ఆయన విగ్రహాలు నెలకొల్పాల్సి ఉందన్నారు. ఇక భాగ్యరెడ్డివర్మ గురించి సీఎం కేసీఆర్ తరచూ గుర్తు చేస్తుంటారని.. భాగ్యరెడ్డివర్మ కోరుకున్న సమాజాన్ని నిర్మించే పనిలో తమ ప్రభుత్వం ఉందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. భాగ్యరెడ్డివర్మ స్థాపించిన పాఠశాలను చారిత్రక సంపదగా నిలబెట్టుకోవాలనే ఆలోచన ఉందన్నారు. గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో భాగ్యరెడ్డివర్మ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని, ఆయన పేరు మీద లైబ్రరీల నిర్మాణం జరిగేలా చూస్తానని ఎంపీ బాల్క సుమన్ చెప్పారు.
ఆవుల బాలనాథంకు పురస్కారం
కార్యక్రమంలో మంత్రుల చేతుల మీదుగా ప్రముఖ సామాజిక కార్యకర్త ఆవుల బాలనాథంకు భాగ్యరెడ్డివర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రొఫెసర్ ఇ.సుధారాణి సంకలనం చేసిన ‘భాగ్యరెడ్డివర్మ రచనలు, సంపాదకీయాలు– నివేదికలు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భాగ్యరెడ్డి వర్మను స్మరించుకున్న సీఎం
దళిత జనోద్ధరణ కోసం ఉద్యమాలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన భాగ్యరెడ్డి వర్మను 130వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎంతో ఉద్యమించారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని సీఎం గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment