ఇన్నోవేషన్+ ఇంక్యుబేషన్= స్టార్ట్‌అప్ | Hyderabad is the IT capital of the world | Sakshi
Sakshi News home page

ఇన్నోవేషన్+ ఇంక్యుబేషన్= స్టార్ట్‌అప్

Published Sat, Jul 5 2014 12:08 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఇన్నోవేషన్+ ఇంక్యుబేషన్= స్టార్ట్‌అప్ - Sakshi

ఇన్నోవేషన్+ ఇంక్యుబేషన్= స్టార్ట్‌అప్

ఇంక్యుబేషన్ సెంటర్‌గా భాగ్యనగరం  రాబోయే రెండు నెలల్లో 2000 స్టార్ట్‌అప్స్‌మైఖేల్ డెల్.. ప్రఖ్యాత కంపెనీ డెల్ కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు.. ఆలోచనకు అంకురార్పణ జరిగింది.. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్‌లో..! విద్యార్థిగా ఉన్నప్పుడే కేవలం 1000 డాలర్ల స్టార్ట్ అప్ క్యాపిటల్‌తో ప్రారంభమైంది..  ఇప్పుడు అతని ఆస్తి.. 18.6 బిలియన్ల డాలర్లు!!
 
మార్క్ జుకర్‌బర్గ్.. ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు..

ఎందుకంటే.. అతను ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికిపైగా యూజర్స్ కలిగిన సోషల్ నెట్‌వర్క్ ‘ఫేస్‌బుక్’ సృష్టికర్త..
 ఫేస్‌బుక్ ఆలోచన మొగ్గతొడిగింది.. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలోనే! విద్యార్థిగా తోటి స్నేహితులతో చిట్‌చాట్ కోసం.. చిన్న తరగతి గదిలో మొదలైన ఫేస్‌బుక్ ప్రస్థానం.. ఇప్పుడు కొన్ని బిలియన్ల డాలర్లకు చేరుకుంది!!
 
 గూగుల్ గురించి తెలిసిందే కదా!
 గూగుల్ ఇప్పుడు మన నిత్యావసరం.. అత్యవసరం కూడా..
 ఈ విప్లవాత్మక ఆలోచన చేసింది ఎవరో తెలుసా.. ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్..అనే స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థులు!!
 
 మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..

 * హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగా తన మదిలో మెరిసిన ఆలోచనకు పదునుపెట్టి.. ప్రపంచంలో అపర కుబేరుడిగా ఎదిగారు..
 * ఇప్పుడాయన ఆస్తుల విలువ 79.1 బిలియన్ల డాలర్లు..!
 
 ఇవి.. విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకత కార్యరూపం దాల్చితే.. ఎంతటి విజయాలు సొంతమవుతాయో చెప్పేందుకు కొన్ని నిదర్శనాలు మాత్రమే!!
 
అపారమైన మానవ వనరులు.. సృజనాత్మకతకు ఢోకాలేని మేధస్సు... ఇలాంటి మేధస్సుకు అవకాశం కల్పిస్తే.. సృజనాత్మక ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తారు. ఉద్యోగాల కోసం పరుగులు పెట్టే పరిస్థితులు ఉండవు. కాలేజీ క్యాంపస్‌లే కొత్త కంపెనీల ఏర్పాటుకు వేదికలుగా మారితే.. విద్యార్థులనే యజమానులుగా తీర్చిదిద్దితే.. ఈ ఆలోచనకు రూపమే.. స్టార్ట్‌అప్. అందుకు చేయూతే.. ఇంక్యుబేషన్!
 నేటి తరం యువత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడితే చాలనే ధోరణిలో లేరు. ఎంప్లాయ్‌గా ఉండే కంటే ఎంప్లాయర్‌గా మారడానికే మొగ్గు చూపుతున్నారు. 

సొంతంగా సంస్థను ప్రారంభించి లాభాల బాటలో నడవాలనుకుంటున్నారు.  ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికీ సై అంటున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకునే యువతకు నేడు సరైనదారి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్టార్ట్‌అప్స్. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి తమకు తామే బాస్‌లుగా ఎదగాలనుకునేవారికి హైదరాబాద్‌లో మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఎన్నో సంస్థలు చేయూతనందిస్తున్నాయి. ప్రస్తుతం భాగ్యనగరం దాదాపు 2000కు పైగా స్టార్ట్‌అప్స్‌తో కళకళలాడుతోంది.
 
ఇంక్యుబేషన్ అంటే: ఆలోచన మీదైతే.. దారి చూపే నేస్తం.. ఇంక్యుబేషన్. కొత్తగా కంపెనీని ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు తోడ్పాటును అందించే ఫ్లాట్‌ఫాం.. ఇంక్యుబేషన్. దీనికి అవసరమైన ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్‌టీ), ఇంక్యుబేషన్ కేంద్రాలను నెలకొల్పే విద్యాసంస్థలు భరిస్తాయి. సాంకేతిక నైపుణ్యం, సంస్థ ఏర్పాటుకు అవసరమైన ప్రాజెక్టు సిద్ధంగా ఉన్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. వారి ఉత్పత్తులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తారు.
 
ఇంక్యుబేషన్‌తో ప్రయోజనం:

కంపెనీకి అవసరమైన మౌలిక వసతులు, కార్యాలయం, కంప్యూటర్స్, విద్యుత్, ప్రింటర్, ఇంటర్నెట్, ల్యాబ్ తదితర సౌకర్యాలను ఉచితంగా సమకూరుస్తారు. కంపెనీ తరపున కో-ఫౌండర్ ఉండాలనేది ప్రధాన నిబంధన. లాంచింగ్ అనంతరం నామమాత్రపు అద్దె చెల్లించి కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చు. స్టార్ట్‌అప్స్ కంపెనీల ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించినట్లయితే.. ఇంక్యుబేషన్ కమిటీలు మరోమారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. కమిటీ ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన నిధుల నుంచి కంపెనీ స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఆర్థిక సహకారం అందజేస్తారు.
 
ఇంక్యుబేషన్ విధానంతో కంపెనీ కార్యాలయాలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించాల్సిన బాధ తప్పుతుందని అంటున్నాడు స్టార్ట్‌అప్ కంపెనీ యజమాని మహేందర్. అంతేకాకుండా సాంకేతికత, మానవ వనరులను కూడా ఆయా క్యాంపస్‌లే కల్పిస్తున్నాయని తెలిపాడు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతామనే భయం ఉండదంటున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్‌ను తయారుచేసే పరిజ్ఞానం తమ వద్ద ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేకపోవటం వల్ల ఏడాది పాటు ఎదురు చూశామని చెప్పాడు. ప్రస్తుతం అవకాశం రాగానే స్టార్ట్‌అప్‌తో మరో నలుగురికి ఉద్యోగం ఇచ్చానంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
 
విద్యా సంస్థల చేయూత: ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలనుకునేవారికి నాస్కామ్, ఎంఎస్‌ఎంఈ వంటి సంస్థలతోపాటు వివిధ విద్యా సంస్థలు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. మన భాగ్యనగరంలో కొలువుదీరిన పలు ప్రముఖ విద్యా సంస్థలు విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు నడిపించడానికి ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇవి అందించే మౌలిక వసతులను ఉపయో గించుకుని కంపెనీని ఏర్పాటు చేయొచ్చు. ఎంతో మందికి ఉపాధి కల్పించొచ్చు.
 
సిటీలో:  సిటీలో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) - గచ్చిబౌలీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్) పిలానీ - శామీర్‌పేట, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) - గచ్చిబౌలీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - గచ్చిబౌలీ, డాక్టర్ బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) వంటివి తమ ప్రాంగణాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. మరికొన్ని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఈ దారిలో ఉన్నాయి.
 
ఐఎస్‌బీ ప్రోత్సాహం: గచ్చిబౌలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) స్టార్ట్‌అప్స్‌లకు మరింత వెన్నుదన్నుగా ఉండేందుకు వీలుగా ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 50 ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒక్కోదాని నుంచి 20 చొప్పున మొత్తం 1000 స్టార్ట్‌అప్స్‌లను ప్రోత్సహించనుంది.
 
బిట్స్‌పిలానీలో..: గతేడాది ఆగస్టులో శామీర్‌పేటలోని బిట్స్‌పిలానీలో స్టార్ట్‌అప్‌ల ప్రోత్సాహంలో భాగంగా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇక్కడ 20 కంపెనీలున్నాయి. రూ.12.5 కోట్లతో మొదలైన ఇంక్యుబేషన్ సెంటర్‌లో విద్యార్థులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని బిట్స్ పిలానీ డెరైక్టర్ ప్రొఫెసర్ వి.ఎస్.రావు తెలిపారు. మరిన్ని కంపెనీలు ముందుకొస్తే  ఆహ్వానిస్తామని చెప్పారు.
 
ఇంక్యుబేషన్‌తో బ్రాండ్ ఇమేజ్: ప్రపంచ పటంలో ఐటీ రాజధానిగా హైదరాబాద్‌కు స్థానం ఉంది. ఈ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అటు వివిధ విద్యా సంస్థలు, నాస్కామ్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండటంతో భవిష్యత్‌లో స్టార్ట్‌అప్స్‌కు మంచి రోజులు రానున్నాయి. ఇప్పటికే మన నగరంలో దాదాపు 2000 వరకు స్టార్ట్‌అప్స్ ఉన్నాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో ఈ సంఖ్య  రెండు వేలకు పెరుగుతుందని నిపుణుల అంచనా. కాబట్టి అవరోధాలను అధిగమించి మంచి వ్యాపార ఆలోచనలతో ముందుకు వచ్చే యువత ఈ అవకాశాలను వినియోగించుకుంటే అత్యుత్తమంగా రాణించొచ్చు.
 
నాస్కామ్ కృషి ఎంతో: కొత్త స్టార్ట్‌అప్స్‌ను ప్రోత్సహించడంలో, అవసరమైన నిధులను అందించడంలో ‘ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)’ కృషి చేస్తోంది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో కొత్త స్టార్ట్‌అప్స్‌ను ఏర్పాటు చేయాలనుకునే యువతకు చేయూతనందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఠీఠీఠీ.10000ట్ట్చట్టఠఞట.ఛిౌఝ అనే వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. స్టార్ట్‌అప్స్‌ను ప్రారంభించాలనుకునే యువత  నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించి.. ఎంపికైన వారికి నిధులు, గెడైన్స్ అందించడం, పరిశ్రమల తో అనుసంధానం కల్పించడం వంటి చర్యలను చేపడుతోంది.
 
 స్టార్ట్‌అప్స్..  పరిగణించాల్సిన అంశాలు

* స్టార్ట్‌అప్స్ ఏర్పాటు చేయాలనుకునే యువతకు ముందుగా అమితమైన ఆసక్తి.. సరైన ఆలోచన, మార్కెటింగ్ అవకాశాలపై దూరదృష్టి ఉండాలి. .
* అవకాశాలు, ఆలోచనలపై స్పష్టమైన అవగాహన వచ్చాక.. సంబంధిత వ్యాపారానికి సంబంధించి బిజినెస్ ప్లాన్, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి.
* పాజెక్ట్ రిపోర్ట్ రూపొందించుకున్నాక.. పెట్టుబడులపై దృష్టిపెట్టాలి. ఇన్వెస్టర్లను సంతృప్తిపరిచే విధంగా వ్యాపార ఆలోచనలను వివరించాలి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతిఏటా ఐడియా చాలెంజ్ పేరుతో పోటీలు నిర్వహించి.. టాప్ టెన్‌లో నిలిచిన వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.  ఐఐఎంలు, ఐఐటీలు కూడా ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. వీటిని ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలి.
పెట్టుబడులు లభించాక చక్కటి బృందాన్ని ఎంపిక చేసుకోవాలి. స్టార్ట్‌అప్ విజయవంతంగా నడవాలంటే.. సరైన టీం తప్పనిసరి.
*మంచి బృందం లభించాక తమ వినియోగదారులెవరో గుర్తించాలి. వారిని ఆకర్షించేలా తమ ఉత్పత్తులు, సేవల గురించి తెలియజేయాలి.
* భవిష్యత్‌లో ఆ రంగంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా .. దీర్ఘకాలిక లక్ష్యాలను రూపొందించుకోవాలి.
 
 రూ.100 కోట్లతోమరో ఇంక్యుబేషన్ కేంద్రం
 ‘‘గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్‌పెన్యూర్‌షిప్ కేంద్రం ఉంది. ప్రస్తుతం 140 వరకు స్టార్ట్‌అప్స్ నడుస్తున్నాయి. వీటిని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీ పక్కనే 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు భవనాలను నిర్మించాం. ఇక్కడే 100 కోట్ల రూపాయలతో మరో ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం.

సృజనాత్మకత, మానవ వనరులు ఉంటే చాలు.. కంపెనీ స్థాపనకు అవసరమైన ఆర్థిక వనరులు, వసతి ఇంక్యుబేషన్ కేంద్రంలో లభిస్తాయి. ప్రస్తుతం ఇక్కడ  ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్, గేమింగ్ వంటి 40కు పైగా స్టార్ట్‌అప్ కంపెనీలు ఉన్నాయి’’
 - రఘు పొద్దుటూరి, మేనేజర్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఐఐఐటీ-హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement