మనసు బాగోలేదా...? | are you in Depression | Sakshi
Sakshi News home page

మనసు బాగోలేదా...?

Published Sun, May 3 2015 12:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

మనసు బాగోలేదా...?

మనసు బాగోలేదా...?

ఇటీవల జర్మనీ విమానం కూలిపోయిన సంఘటన గుర్తుందా? దానికి కారణం ఏమిటో జ్ఞాపకం ఉందా? డిప్రెషన్‌లో ఉన్న కో-పైలట్ ఇందుకు పాల్పడ్డాడని తెలిశాక ప్రపంచం నివ్వెరపోయింది.. ఇంకా ఎందరో తనువు చాలించుకుంటున్నారు. మరికొందరు ఇతరుల ఉసురు తీస్తున్నారు. కారణాలేమైతేనేమి? డిప్రెషన్ (వ్యాకులత)తో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకోవడంపై ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్, థెరపీ వంటి చికిత్సా విధానాలతో డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
 
 ప్రశాంత జీవితాన్ని కోరుకోని వారుండరు. కానీ ఆ ప్రశాంతతే చాలామందికి కరువవుతోంది. ఒంటరితనం, విషాదం, అపార్థం, నిరాశ, ఆందోళన, అసంతృప్తి వంటివి డిప్రెషన్‌కు దారితీస్తాయి. ఇవి వయసుతో పనిలేకుండా అన్ని వయసుల వారికీ వర్తిస్తాయి. విద్యార్థులకైతే ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో చేర్చడంతో అక్కడ ఇమడలేక, సర్దుబాటు చేసుకోలేక, సబ్జెక్ట్ అర్థం కాక సతమతమవుతుంటారు. ఇంకా దూరంగా ఉన్న కాలేజీలకు రోజూ వెళ్లిరావడం, పేరెంట్స్‌కు దూ రంగా ఉండడం, లవ్ ఫెయిల్యూర్స్ కూడా డిప్రెషన్‌కు దోహదపడుతున్నాయి.
 
 ఇక విద్య పూర్తయ్యాక కూడా వ్యాకులతకు లోనయ్యే వారెందరో ఉంటున్నారు. చదువయ్యాక సరైన ఉద్యోగావకాశాలు, విద్యార్హతకు తగిన ఉద్యోగాలు రాక, జీతాలు చాలక కొందరు, అధిక పని, నిద్రలేమి వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. పెళ్లయ్యాక భార్యాభర్తల  నేపథ్యం సమస్యలు, ఫైనాన్షియల్ షేరింగ్ లేకపోవడం, జాబ్ రిలేటెడ్ ప్రోబ్లమ్స్, వివాహేతర సంబంధాలు, టీవీ సీరియళ్ల ప్రభావం డిప్రెషన్‌కు కారణమవుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
 
 ఇక వృద్ధాప్యంలోనూ డిప్రెషన్‌కు లోనవుతున్న వారూ ఉన్నారు. వయసు మీరాక వివిధ కారణాల వల్ల పిల్లలు దూరం కావడం, జీవిత భాగస్వామి మరణించడంతో ఒంటరితనాన్ని భరించలేకపోవడం, అనారోగ్యం వంటి వాటితో వ్యాకులతకు గురవుతున్నారు. పలువురు తమ మనోవేదనను ఇతరులతో పంచుకోకుండా లోలోపలే భరించడంకూడా ఇందుకు ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ వెరసి అం తిమంగా డిప్రెషన్‌కు దారి తీసి ఆత్మహత్యలకు ఆస్కారమిస్తున్నాయి.
 
 ఇలా పేద, మధ్య తరగతి వారే కాదు.. మేధావులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, రచయితలు తనువులు చాలించిన వారిలో ఉండడం విశేషం! మన విశాఖ నగరంలోనూ డిప్రెషన్‌కు గురవుతు న్న వారి సంఖ్య అధికంగా ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో 15శాతం యువతలోనే ఉంటోందని అంచనాకొచ్చారు.
 
 విధి నిర్వహణలో జాగ్రత్త..
  డిప్రెషన్‌లో ఉంటూ విధి నిర్వహణ చేసే వారితో ఎంతో అప్రమత్తంగా ఉండాలని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విమాన పెలైట్లు, వాహనాల డ్రైవర్లు, మెదడు, గుండె సంబంధిత వైద్యులు, సైంటిస్టులు, కీలక పరిశ్రమలు, మైనింగ్‌లో పనిచేసేవారిలో అవసరమైన వారు తరచూ డిప్రెషన్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వారితో పాటు ఇతరులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
 
 మొన్నటికి మొన్న జర్మన్ విమానం కో-పైల ట్ ఆండ్రియాస్ లుబిట్జ్ ప్రియురాలు కాదనడంతో డిప్రెషన్‌కు లోనై విమానాన్ని కూల్చివేసి 150 మంది అమాయక ప్రయాణికుల చావుకు కారణమయ్యాడన్న చేదు నిజాన్ని వీరు ఉదహరిస్తున్నారు. అందుకే ఇలాంటి వారి మానసిక స్థితి తెలిసేలా ముందుగా అవసరమైన చెకప్ చేయాలని వీరు పేర్కొంటున్నారు.
 
 థెరపీతో నయం..
 డిప్రెషన్‌కు గురయిన వారికి థెరపీతో నయం చేయొచ్చు. డిప్రెషన్‌లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. డిప్రెషన్ స్కేల్‌తో దాని తీవ్రతను గుర్తిస్తారు. ఇందులో మైల్డ్, మోడరేట్‌లకు కౌన్సెలింగ్, కాగ్నెటివ్ బిహేవియర్ థెర పీతో పూర్తిగా సరి చేస్తాం. ఇందుకు 2-6 నెలల పాటు చికిత్స అవసరం. అవసరమైన వారికి అవగాహన, సోషల్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం.
 
 సివియర్ కేటగిరీలో ఉన్న వారిని సైక్రి యాట్రిస్ట్‌ను సంప్రదించాలి. విశాఖ నగరంలో డిప్రెషన్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఇంకా పెరగాలి. మైండ్ అండ్ బాడీతో పనిచేసే వారు తరచూ డిప్రెషన్‌పై చెకప్ చేయించుకోవాలి. అవసరమైన వారు సంప్రదిస్తే కౌన్సెలింగ్, చికిత్స అందిస్తాం.           
  - డాక్టర్ ఎం.వి.ఆర్.రాజు, సైకాలజీ విభాగాధిపతి, ఏయూ (సెల్‌ః 9393101813)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement