నెగిటివ్ రోల్స్ ఇష్టం | Like negative roles | Sakshi
Sakshi News home page

నెగిటివ్ రోల్స్ ఇష్టం

Published Mon, Mar 23 2015 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

నెగిటివ్ రోల్స్ ఇష్టం

నెగిటివ్ రోల్స్ ఇష్టం

ఆయన సినిమా చూస్తుంటే మన పక్కింటి బాషా భాయ్... ఎదురింటి శంకరన్న మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాదీ గల్లీలు మన కళ్లకు కడతాయి. బాలీవుడ్ బాద్‌షాలా... హైదరాబాదీలకు ఓ ఖాన్ ఉన్నాడు. హాఫ్ ప్రై, జబర్‌దస్త్, గుళ్లుదాదాల్లో నెగిటివ్ రోల్స్‌లో మెప్పించి, ఏక్తా సర్దార్‌తో కథానాయకుడిగా హైదరాబాదీల మనసు దోచుకున్న ఆ ఖాన్.. తౌఫిక్ ఖాన్. నటుడిగానే పరిమితమవ్వకుండా మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి... సిటీ కల్చర్‌ను, సిటీకే సొంతమైన భాషను దృశ్యమానం చేస్తున్నాడు. త్వరలో మరో సినిమా ముహూర్తానికి రెడీ అవుతున్న ఖాన్‌ను సాక్షి సిటీప్లస్ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే...
 ..:: దార్ల వెంకటేశ్వరరావు
 
తెరపై నన్ను నేను చూసుకోవాలని మెహిదీపట్నంలోని రిషి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగానే కళాశాల నాటకాల్లో నటించేవాణ్ణి. డ్రామాల్లో నన్ను చూసిన ఫ్రెండ్స్ మెచ్చుకునే వాళ్లు. అప్పుడే సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా కలిగింది. స్నేహితుల సహకారంతో మొదట నాలుగు సినిమాల్లో నటించాను. నెగిటివ్ రోల్స్ ఇష్టం. అందుకే మొదట అవి చేశాను. తరువాత సొంత బ్యానర్ ‘మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్’ ఏర్పాటు చేశాను. ఈ క్రమంలో నా దోస్తులు సయ్యద్ హమీదుద్దీన్, జాఫర్ హుస్సేన్ మిరాజ్, జయంత్‌ల ప్రోత్సాహం మరువలేనిది.

రియల్ స్టోరీ...

నాలుగు చిత్రాల తర్వాత ఏక్తాసర్దార్ సొంత బ్యానర్‌పైనే నిర్మించాను. ఇందులో లీడ్‌రోల్ చేశాను.  హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం గడిపే ఓ ఆటోడ్రైవర్ పోలీసుల వేధింపులతో సర్దార్‌గా ఎలా మారాడనేది ఆ చిత్ర సారాంశం. హైదరాబాదీ భాష, వ్యవహారంతో పాటు అచ్చ హైదరాబాదీ చిత్రంలా ఉండేందుకు నా ఫ్రెండ్స్ అక్బర్‌బిన్ తబర్, అద్నాన్ సాజిద్, గుళ్లుదాదా, ఆర్కే మామ, అజీజ్ నాసిర్, అల్తాఫ్ హైదర్ గ్యాంగును తీసుకున్నా. ఈ చిత్రంలో బాగా నటించేందుకు ముంబై నుంచి శిక్షకులను పిలిపించుకుని, వారి దగ్గర మూడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నా. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోసం టాలీవుడ్‌లో పెద్ద నటుడైన ముఖేష్ రిషీని ఒప్పించాం. ఆయన అంగీకరించడం సంతోషాన్నిస్తే... ఆ చిత్రం హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. దీనికి సీక్వెల్‌గా కొత్త సినిమా ప్రారంభిస్తున్నా.

సొంతానికి వాడుకోను...

సినిమాలో నటించినపుడు వచ్చిన డబ్బు, చిత్ర నిర్మాణం తర్వాత వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను. వచ్చిన డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తా. ఆ అల్లా దయతో నాకు ఈ జీవితానికి కావాల్సినంత డబ్బు బిజినెస్ ద్వారా వస్తుంది. సినిమాలో వచ్చినా రాకపోయినా 365 రోజులు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటా. బియ్యం, రంజాన్ సమయంలో దుస్తులు, పండుగ సరుకులు అందిస్తుంటా. సేవలో ఉండే ఆనందం చాలా గొప్పది. తల్లిదండ్రుల పేరుతో యాకుత్‌పుర అమన్‌నగర్‌లో అమీనా యూసుఫ్ మసీదు నిర్మించా. సినిమాల్లో నటించడం డబ్బు కోసం కాదు కాబట్టే ఇంత కాలం ఇతర సినిమాల్లో ఆఫర్లు వచ్చినా వదులుకున్నా. అయితే ఈ సారి వస్తే నటించి, ఆ డబ్బు ట్రస్టులకు ఇవ్వాలని అనుకుంటున్నా.
 
పేరు తెచ్చుకోవాలని...


ఏక్తాసర్దార్ ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా బాగా ఆడింది. దీంతో మంచి గుర్తింపు వచ్చింది. మక్కాకు వెళితే అక్కడ చాలా మంది గుర్తు పట్టి ‘సర్దార్’ అంటూ పిలిచారు. దుబాయ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇలా అభిమానులు వచ్చి పిలుస్తూ ఫొటోలు దిగుతుంటే చాలా మజా అనిపిస్తుంది. ‘యే షహర్ మేతో సిర్ఫ్ ఏకీ రహ్‌సక్తా... ఓ హై సర్దార్’ డైలాగ్ లాగే హైదరాబాద్ సర్దార్‌గా ఇంకా పేరు తెచ్చుకోవాలని ఉంది. సన్నీ డియోల్, నానా పటేకర్ అంటే ఇష్టం. తెలుగులో ప్రకాష్‌రాజ్ నటన అంటే
అమితమైన ప్రేమ.
 
ప్రోత్సాహమివ్వాలి...


 చిన్న నిర్మాతలు ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. మన భాష, సంస్కృతి పరిరక్షణకు ఇవి దోహదపడుతున్నాయి. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. హైదరాబాద్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. అది మారాలి!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement