నా ప్రతి అడుగులో అమ్మ ఉంది..
‘శాంత బయోటెక్’ ఫౌండర్‌గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి. మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు..
‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి.
‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్‌కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం.
‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ.
‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి.
‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్‌డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత.
‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత.
‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’
అమ్మా నీవే నేను నేనే నీవు
నేను నీలో అంతర్భాగానిని
నీవు నాలో అంతర్వాహినివి..!