
ఎన్నెన్నో వర్ణాలు..!
అందమైన ప్రకృతిలో అసంఖ్యాకమైన సిత్రాలు. లక్షలాది వర్ణాలు. అందమైన పూలు.. కనువిందైన పక్షులు.. నీలాకాశంలో రకరకాల రంగుల్లో మేఘాలు.. అనంత సాగరంలో అలలపై దోబూచులాడే వింత వర్ణాలు.. పుడమిపై లెక్కలేనన్ని రంగులు.. జీవితమంతా రంగులమయం కాదూ. ఈ వర్ణాలను, వాటి అందాలను కాన్వాస్ అద్దంపై ప్రతిబింబించేవాడు చిత్రకారుడు. చిత్రం తీర్చిదిద్దే సమయంలో అతని ఆలోచనలు ఎలా ఉంటాయో, అవి కాన్వాస్‌పై ఎలా ప్రాణం పోసుకుంటాయో ఊహించడం కష్టం.
కానీ చిత్రం పూర్తయ్యాక అది చెప్పే కథలు అనంతం. చూసేవారి కళ్లకు మనసుంటే ఆ కథ మధురాతిమధురం. ఇక తమ చిత్రాల గురించి ఆర్టిస్టులే మాట్లాడితే? అది మరింత అర్ధవంతంగా ఉంటుంది. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి చెందిన బీఎఫ్‌ఏ విద్యార్థి రాజశేఖర్ ఇలా తన పెయింటింగ్ ప్రత్యేకతను ఇలా వివరించారు.
‘ఓ చిత్రం గీసేటప్పుడు ఆర్టిస్ట్‌ను ఏదో తెలియని శక్తి ఆవహిస్తుంది. అంతులేని ఉత్తేజానికి అది కారణమవుతుంది. నేను కూడా అటువంటి భావాలకు లోనయ్యాను. నేను ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు గీశాను. వాటిలో ఏది అత్యుత్తమైనదంటే ఆలోచించాలి కానీ.. మనసుకు బాగా నచ్చినది మాత్రం నేను గీసిన ‘ఫైవ్ ఎలిమెంట్స్’ చిత్రం. నైరూప్య కళ (ఏబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్) కోవలోకి వచ్చే ఈ చిత్రం నాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. ఈ పెయింటింగ్ వేస్తూ గంటల తరబడి ఏవో ఊహల్లోకి వెళ్లిపోయేవాడిని.
నాకు కావాల్సిన, నేను కోరుకున్న భావం వచ్చే వరకూ చిత్రం గీస్తూనే ఉండేవాడిని. పంచభూతాలను చిత్రంలో అంశాలుగా తీసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాను. ఇలా వేసిన ప్రతి పెయింటింగ్‌లో నేను కోరిన భావం వచ్చిందన్న సంతృప్తి ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం కలుగుతుంది.
ఆలోచన ఇలా..
సృష్టి సర్వం పంచభూతాల కలయిక కారణంగా రూపు దిద్దుకున్న సంగతి తెలిసిందే. వీటి నుంచే మానవ జన్మ ప్రారంభమవుతుంది. వీటిలో విలీనం కావడం ద్వారా అది ముగుస్తుంది. పంచభూతాలైన ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అవి ఒకదానితో ఒకటి అనుబంధమై ఉంటాయి. వాటికి నిర్దిష్టమైన రూపాన్ని ఊహించడం కష్టం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పెయింటింగ్ తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను.
ఒక్కో అంశానికి ఒక్కో రంగును నిర్దేశించుకుని వాటిని రకరకాలుగా కలుపుతూ పాంచభౌతికమన్న భావాన్ని చూపించడానికి కృషి చేశాను. ఆకాశానికి గాఢమైన నీలి రంగు, నీటికి లేత నీలి రంగు, గాలికి తెలుపు, అగ్నికి ఎరుపు, భూమికి జేగురు రంగు ఎంచుకున్నాను. ఈ పెయింటింగ్‌కు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం తీసుకున్నాను. ఒక్కో పెయింటింగ్ వేయడానికి నాకు రెండు నుంచి నాలుగు రోజుల వరకు సమయం పట్టింది. ఇదే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు 20 పెయింటింగ్స్ వరకు వేశాను. పాంచభౌతికమైన ప్రకృతి నన్నెంతగా ప్రభావితం చేసిందీ వీటిని చూస్తే అర్ధమవుతుంది.