ఆమెకు ఆత్మీయ ఆహ్వానం
మల్టీటాస్క్.. మహిళలను చూసే పురుడుపోసుకొని ఉంటది! బహుముఖ ప్రజ్ఞ.. వనితల ప్రతిభకు పట్టంగా వచ్చి ఉంటది! ట్వంటీఫోర్ ఇంటూ సెవెన్.. సేవలందించే వాళ్లుంటారేమో.. కానీ ట్వంటీఫోర్ ఇంటూ త్రీసిక్స్‌టీఫైవ్ డేస్ సేవలందించే వ్యక్తి ఈ భూమ్మీద స్త్రీ ఒక్కతే! భక్తుల మొర వినడానికి ఆ భగవంతుడు సైతం పరిమిత సమయాన్నే కేటాయిస్తాడు. కానీ ఇంట్లో వాళ్ల అవసరాలకు ఇంతులు అన్నివేళలా ఆసరాగా ఉంటారు.
అలాంటి ఆడవాళ్లు తమకోసం ఏడాదికి ఒక్కరోజు కేటాయించుకునే భాగ్యం కలిగింది.. ‘మహిళా దినోత్సవం’గా! దాని వెనక కారణం ఏదైనప్పటికీ! ఈ ఉత్సవాన్ని అద్భుతమైన వేదికగా మలచుకొని అంతే అదుర్స్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది సాక్షి.. విమెన్స్ వరల్డ్ సౌజన్యంతో! తేదీ.. మార్చి ఏడు.. వెన్యూ.. జేఆర్‌సీ కన్వెన్షన్.. సమయం.. ఉదయం పదకొండు నుంచి మూడు గంటల వరకు!
సేవ, త్యాగం, కష్టించి పనిచేసే తత్వం, ఓర్పు, క్షమించే ఔన్నత్యం.. ఇన్ని గుణాల ఇంతి ఇంట్లో ఉన్నా ఒక్కరోజూ కుటుంబ ప్రశంసలకు నోచుకోదు. కానీ వీటిని సాక్షి గుర్తించి.. ఫ్యామిలీలో చోటివ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా పాఠకుల ముందుకు వెళ్లింది. తమ అమ్మలోని కమ్మదనాన్ని తెలియజెప్పమని బిడ్డల్ని అడిగింది. మనసుపెట్టిన సంతానం తమ తల్లి ఔన్నత్యాన్ని చెప్తూ సాక్షికి ఉత్తరాలు రాశారు.
అలా అమ్మకు సత్కారం చేయబోతోంది సాక్షి. అలాగే జీవనసహచరి అండను, అందిస్తున్న సేవను, ఒడిదుడుకులు వచ్చినా కుటుంబనావ ఒరగకుండా చూసుకుంటున్న వైనాన్ని వివరించమని భర్తలకు చెప్పింది. ‘బాగుంది’ అంటూ భార్య కాచిన కాఫీకి కూడా కితాబివ్వని భర్తలు సాక్షి వినతికి భారీగానే స్పందించారు మరి. సహచరి సహకారాన్ని లేఖల రూపంలో ఫ్యామిలీకి పంపారు.
అలా అర్ధాంగికి అవార్డునివ్వబోతోంది. ఆలిగా, అమ్మగా బాధ్యతలు నిర్వరిస్తూనే.. ఉత్పత్తిలోనూ స్వేదాన్ని చిందిస్తున్న ధీరకూ వందనం చేయాలనుకుంది. వ్యవసాయంలో సాయమవుతూ ధాన్యరాశులను పండిస్తున్న ‘సిరి’సిత్రాన్ని అందివ్వమ్మనీ కోరింది సాక్షి. ఆశ్చర్యంగా ఆ మహాలక్ష్ముల శ్రమను చెప్పే అక్షర కూర్పులూ వచ్చాయి! అలా మహిళారైతునీ సత్కరించబోతోంది. ఈ మూడు కేటగిరీలకు చెందిన ఎంట్రీలను పరిశీలించే బాధ్యతలను ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి, ప్రొఫెసర్, రచయిత మృణాళిని, స్త్రీవాద రచయిత్రి కొండవీటి సత్యవతి నిర్వహించారు! సన్మాన సత్కారాలు అందుకోబోయే మహిమాన్వితలను ఎంపిక చేశారు!
ఇదంతా.. పత్రికాముఖంగా చేసే ప్రయత్నం!
ఏడో తారీఖున.. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో మహిళల కోసం ఇంకొన్ని కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. తోటివారికి స్ఫూర్తిని పంచేలా ‘ప్రైడ్ వాక్’, కళ, ఛాయాగ్రహణం, హస్తకళల్లో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే వీలుగా ఆయా రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళల కోసం వారు రూపొందించిన కళాకృతులతో ఓ ప్రదర్శననూ నిర్వహిస్తోంది. అంతేకాదు మహిళామణులు తయారు చేసిన వివిధ వస్తువులతో స్టాళ్లూ కొలువుదీరనున్నాయి.
ఇవన్నీ ఒకెత్తయితే స్త్రీలలో ఆరోగ్యస్పృహ కలిగించేందుకు అనూస్ ఆధ్వర్యంలో బాడీమాస్ ఇండెక్స్ ఫ్రీ క్యాంప్ కూడా ఉంటుంది. ఇవికాక ఇంకా అనేక కార్యక్రమాలు, ఆహూతులకు రకరకాల పోటీలు ఉంటాయి. ఇలా మహిళల ఆంతరంగిక సౌందర్యాన్ని చాటే కార్యక్రమాలెన్నో అలరించనున్నాయి. వీటన్నిటితోపాటు సాక్షి ఫ్యామిలీ నిర్వహించిన అమ్మ, అర్థాంగి, మహిళారైతు పోటీల్లో ఎన్నికైన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.
అతిథులుగా..
‘గులాబీ’గా ప్రేక్షక హృదయాల్లో గుబాళించిన నటి మహేశ్వరి, బాలల హక్కుల కోసం పోరాడుతున్న మమతారఘువీర్, ఐపీఎస్ రమారాజేశ్వరి, డిజైనర్, మహిళాపారిశ్రామికవేత్త సర్వమంగళ, ఫీనిక్స్ జ్యోతిరెడ్డి వంటి వనితలే కాక సినీతారలు, చిత్రకారిణులు, పలు రంగాల్లో ఖ్యాతి గడించిన మహిళలు ఈ ఉత్సవానికి అతిథులుగా విచ్చేస్తున్నారు.
కొసమెరుపు
ఈ ఉత్సవానికి ప్రాయోజితకర్తగా వ్యవహరించనున్న ‘విమెన్స్ వరల్డ్’ విమెన్స్ డే సెలబ్రేషన్స్‌లో స్పెషల్‌థింగ్‌గా.. చీరకట్టడంలోని
మెళకువలను నేర్పించనుంది!
గేమ్స్ అండ్ ప్రైజెస్
ఈవెంట్‌లో భాగంగా.. హోమ్ బడ్జెట్ నిర్వహణ, స్టోరీ టెల్లింగ్‌కి సంబంధించి పోటీలు ఉంటాయి.
గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. ఇందులో పాల్గొనదలచిన వారు కార్యక్రమం
జరుగుతున్న ఆవరణలోనే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.