multi task
-
సహకార స్వర్ణయుగం రానుందా?!
ఉమ్మడి ఆర్థిక, సాంఘిక, సంస్కృతిక అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది తమ సమష్టి యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామికంగా తామే నిర్వహించుకునే వ్యాపార, సేవా సంస్థలే సహకార సంఘాలు. వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా చేసే వ్యాపారానికి భిన్నమైనది సహకార వ్యవస్థ. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి సంస్థల కేంద్రీకృత ఆధిపత్య లాభార్జన ధోరణికి భిన్నంగా సమష్టి ప్రయోజనాల కోసం నానాటికీ విస్తరిస్తున్న ఈ వికేంద్రీకృత వ్యవస్థకు స్వయంపాలన, స్వావలంబనలే మూలస్తంభాలు. కరోనా మహమ్మారి నేర్పిన కొన్ని గుణపాఠాల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకార వ్యవస్థను మరింత విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది.(ఈ నెల 14 నుంచి 20 వరకు జరుగుతున్న 70వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా..) ఐక్యరాజ్యసమితి కూడా సహకార సంఘాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ.. 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకోవాలని ఇటీవలే తీర్మానం చేసింది. పుష్కర కాలం ముందు 2012లో కూడా అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని జరుపుకోవటం విశేషం. స్కాట్లండ్‌లోని ఫెన్విక్లో కీ.శ. 1761 మార్చి 14న ఏర్పాటైన ఫెన్విక్ చేనేత కార్మికుల సహకార సంఘమే తొట్టతొలి కోఆపరేటివ్ సొసైటీ. ప్రపంచంలో కనీసం 12% మంది ప్రజలు సహకారులే. సుమారు 30 లక్షల సహకార సంఘాలు ప్రపంచ దేశాల్లో లాభం కోసం కాకుండా విలువల కోసం పనిచేస్తున్నాయి. భారతీయ సహకారోద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద సహకార వ్యవస్థ. దేశం వలస పాలనలో మగ్గిపోతున్న కాలంలో సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసిన సర్ ఫ్రెడరిక్ నికల్సన్ మన దేశంలో సహకార వ్యవస్థకు బీజం వేశారు. మొట్టమొదటి సహకార సంఘం 1904లో ప్రస్తుతం తమిళనాడులో తిరువళ్లూరు జిల్లాలోని తిరుర్ అనే గ్రామంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలోని 8,54,355 సహకార సంఘాల్లో సుమారు 30 కోట్ల మంది సభ్యులున్నారు. మరో 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి చురుగ్గా చర్యలు చేపట్టింది. మన దేశంలో వ్యవసాయ రుణాలిచ్చే సొసైటీల సంఖ్యే ఎక్కువ. కింది స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలతో మొదలుకొని చాలా రాష్ట్రాల్లో మూడంచెల సహకార వ్యవస్థ అమల్లో ఉంది. జిల్లా, రాష్ట్రస్థాయి సొసైటీల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అనేక రాష్ట్రాల్లో వ్యాపార లావాదేవీలు, సేవలు అందించే సొసైటీల(మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు) రిజిస్ట్రేషన్ కేంద్ర సహకార రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. రెండేళ్ల క్రితం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు కావటంతో ఈ రంగంలో సరికొత్త కదలిక చోటుచేసుకుంది. జాతీయ సహకార విధానం రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్వం నుంచి ఉన్న వ్యవసాయం, హౌసింగ్, ఉద్యోగుల సహకార సంఘాలు వంటి సంప్రదాయ రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ముఖ్యంగా యువతను భాగస్వాముల్ని చేసే విధంగా అనేక సేవా రంగాల్లో సొసైటీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెంపొందించగల శక్తి సహకార రంగానికి ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ లక్ష్యాలతో మూడు వేర్వేరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్రం ఇటీవలే నెలకొల్పింది. మొదటిది మన ఉత్పత్తులను విదేశాలకు భారీస్థాయిలో ఎగుమతులను చేపట్టే లక్ష్యంతో ఏర్పాటైంది. సొసైటీల ద్వారా సర్టిఫైడ్/దేశీ విత్తనోత్పత్తి చేయటంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయటమే లక్ష్యంగా రెండో సొసైటీ ఏర్పాటైంది. ఇక మూడోది మరింత ముఖ్యమైనది. వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం చేసే రైతుల సొసైటీలు, ఎఫ్పిఓల నుంచి సేకరించి భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ పేరుతో ఆన్లైన్ ద్వారా, అవుట్లెట్ల ద్వారా దేశ విదేశాల్లో విక్రయించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. భారీ వాణిజ్య లక్ష్యాలతో పనిచేసే ఈ సొసైటీలకు వచ్చే లాభాల్లో సగాన్ని నేరుగా రైతులు, ఇతర ఉత్పత్తిదారులకు అందించబోతున్నారు. అనుకున్నట్లు యువతను సహకార వ్యాపార, సేవా రంగాల వైపు సమర్థవంతంగా ఆకర్షించగలిగితే భారతీయ సహకార రంగానికి స్వర్ణయుగం తధ్యమని చెప్పొచ్చు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!) -
ఆమెకు ఆత్మీయ ఆహ్వానం
మల్టీటాస్క్.. మహిళలను చూసే పురుడుపోసుకొని ఉంటది! బహుముఖ ప్రజ్ఞ.. వనితల ప్రతిభకు పట్టంగా వచ్చి ఉంటది! ట్వంటీఫోర్ ఇంటూ సెవెన్.. సేవలందించే వాళ్లుంటారేమో.. కానీ ట్వంటీఫోర్ ఇంటూ త్రీసిక్స్టీఫైవ్ డేస్ సేవలందించే వ్యక్తి ఈ భూమ్మీద స్త్రీ ఒక్కతే! భక్తుల మొర వినడానికి ఆ భగవంతుడు సైతం పరిమిత సమయాన్నే కేటాయిస్తాడు. కానీ ఇంట్లో వాళ్ల అవసరాలకు ఇంతులు అన్నివేళలా ఆసరాగా ఉంటారు. అలాంటి ఆడవాళ్లు తమకోసం ఏడాదికి ఒక్కరోజు కేటాయించుకునే భాగ్యం కలిగింది.. ‘మహిళా దినోత్సవం’గా! దాని వెనక కారణం ఏదైనప్పటికీ! ఈ ఉత్సవాన్ని అద్భుతమైన వేదికగా మలచుకొని అంతే అదుర్స్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది సాక్షి.. విమెన్స్ వరల్డ్ సౌజన్యంతో! తేదీ.. మార్చి ఏడు.. వెన్యూ.. జేఆర్సీ కన్వెన్షన్.. సమయం.. ఉదయం పదకొండు నుంచి మూడు గంటల వరకు! సేవ, త్యాగం, కష్టించి పనిచేసే తత్వం, ఓర్పు, క్షమించే ఔన్నత్యం.. ఇన్ని గుణాల ఇంతి ఇంట్లో ఉన్నా ఒక్కరోజూ కుటుంబ ప్రశంసలకు నోచుకోదు. కానీ వీటిని సాక్షి గుర్తించి.. ఫ్యామిలీలో చోటివ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా పాఠకుల ముందుకు వెళ్లింది. తమ అమ్మలోని కమ్మదనాన్ని తెలియజెప్పమని బిడ్డల్ని అడిగింది. మనసుపెట్టిన సంతానం తమ తల్లి ఔన్నత్యాన్ని చెప్తూ సాక్షికి ఉత్తరాలు రాశారు. అలా అమ్మకు సత్కారం చేయబోతోంది సాక్షి. అలాగే జీవనసహచరి అండను, అందిస్తున్న సేవను, ఒడిదుడుకులు వచ్చినా కుటుంబనావ ఒరగకుండా చూసుకుంటున్న వైనాన్ని వివరించమని భర్తలకు చెప్పింది. ‘బాగుంది’ అంటూ భార్య కాచిన కాఫీకి కూడా కితాబివ్వని భర్తలు సాక్షి వినతికి భారీగానే స్పందించారు మరి. సహచరి సహకారాన్ని లేఖల రూపంలో ఫ్యామిలీకి పంపారు. అలా అర్ధాంగికి అవార్డునివ్వబోతోంది. ఆలిగా, అమ్మగా బాధ్యతలు నిర్వరిస్తూనే.. ఉత్పత్తిలోనూ స్వేదాన్ని చిందిస్తున్న ధీరకూ వందనం చేయాలనుకుంది. వ్యవసాయంలో సాయమవుతూ ధాన్యరాశులను పండిస్తున్న ‘సిరి’సిత్రాన్ని అందివ్వమ్మనీ కోరింది సాక్షి. ఆశ్చర్యంగా ఆ మహాలక్ష్ముల శ్రమను చెప్పే అక్షర కూర్పులూ వచ్చాయి! అలా మహిళారైతునీ సత్కరించబోతోంది. ఈ మూడు కేటగిరీలకు చెందిన ఎంట్రీలను పరిశీలించే బాధ్యతలను ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి, ప్రొఫెసర్, రచయిత మృణాళిని, స్త్రీవాద రచయిత్రి కొండవీటి సత్యవతి నిర్వహించారు! సన్మాన సత్కారాలు అందుకోబోయే మహిమాన్వితలను ఎంపిక చేశారు! ఇదంతా.. పత్రికాముఖంగా చేసే ప్రయత్నం! ఏడో తారీఖున.. జేఆర్సీ కన్వెన్షన్‌లో మహిళల కోసం ఇంకొన్ని కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. తోటివారికి స్ఫూర్తిని పంచేలా ‘ప్రైడ్ వాక్’, కళ, ఛాయాగ్రహణం, హస్తకళల్లో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే వీలుగా ఆయా రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళల కోసం వారు రూపొందించిన కళాకృతులతో ఓ ప్రదర్శననూ నిర్వహిస్తోంది. అంతేకాదు మహిళామణులు తయారు చేసిన వివిధ వస్తువులతో స్టాళ్లూ కొలువుదీరనున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే స్త్రీలలో ఆరోగ్యస్పృహ కలిగించేందుకు అనూస్ ఆధ్వర్యంలో బాడీమాస్ ఇండెక్స్ ఫ్రీ క్యాంప్ కూడా ఉంటుంది. ఇవికాక ఇంకా అనేక కార్యక్రమాలు, ఆహూతులకు రకరకాల పోటీలు ఉంటాయి. ఇలా మహిళల ఆంతరంగిక సౌందర్యాన్ని చాటే కార్యక్రమాలెన్నో అలరించనున్నాయి. వీటన్నిటితోపాటు సాక్షి ఫ్యామిలీ నిర్వహించిన అమ్మ, అర్థాంగి, మహిళారైతు పోటీల్లో ఎన్నికైన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. అతిథులుగా.. ‘గులాబీ’గా ప్రేక్షక హృదయాల్లో గుబాళించిన నటి మహేశ్వరి, బాలల హక్కుల కోసం పోరాడుతున్న మమతారఘువీర్, ఐపీఎస్ రమారాజేశ్వరి, డిజైనర్, మహిళాపారిశ్రామికవేత్త సర్వమంగళ, ఫీనిక్స్ జ్యోతిరెడ్డి వంటి వనితలే కాక సినీతారలు, చిత్రకారిణులు, పలు రంగాల్లో ఖ్యాతి గడించిన మహిళలు ఈ ఉత్సవానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. కొసమెరుపు ఈ ఉత్సవానికి ప్రాయోజితకర్తగా వ్యవహరించనున్న ‘విమెన్స్ వరల్డ్’ విమెన్స్ డే సెలబ్రేషన్స్‌లో స్పెషల్థింగ్గా.. చీరకట్టడంలోని మెళకువలను నేర్పించనుంది! గేమ్స్ అండ్ ప్రైజెస్ ఈవెంట్లో భాగంగా.. హోమ్ బడ్జెట్ నిర్వహణ, స్టోరీ టెల్లింగ్‌కి సంబంధించి పోటీలు ఉంటాయి. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. ఇందులో పాల్గొనదలచిన వారు కార్యక్రమం జరుగుతున్న ఆవరణలోనే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.