నన్నెందుకు కన్నావమ్మా! | why you have given me birth mom! | Sakshi
Sakshi News home page

నన్నెందుకు కన్నావమ్మా!

Published Tue, Feb 10 2015 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

నన్నెందుకు కన్నావమ్మా!

నన్నెందుకు కన్నావమ్మా!

నేటి బాలికలే రేపటి మహిళలు. మరి ఆ రేపటి మహిళలు ఇప్పుడెంత సేఫ్‌గా ఉన్నారు?  దేశం మొత్తం బేటీ బచావో అంటోంది? మరి హైదరాబాద్ మాటేమిటి? రానున్న మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చిన్నారుల స్థితిగతులపై వరుస కథనాలు..
 
ఆడపిల్లకు పురిట్లోనే సమాధి కడుతూ మగపిల్లాడిని దీర్ఘాయుష్షుగా దీవిస్తున్న సమాజం ఇది. అలాంటి దురభిమానం చెంప చెళ్లుమనిపించిన చిట్టితల్లి కథ ఇది.. చదివిన తర్వాత.. కంటితుడుపుగా కాకుండా మనసు తడితో ఆలోచించండి...
 
దాదాపు ఎనిమినెలల కిందట.. ఫిల్మ్‌నగర్ బస్తీలో.. ఏడేళ్ల పాప ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ పాప తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంది. తండ్రి వాచ్‌మన్. ఈ పాపతోపాటు వాళ్లకు ఓ బాబూ ఉన్నాడు.
 
ఆ రోజు..
ఉదయం ఇంట్లోంచి వెళ్లిపోయిన పాప అటూ ఇటూ తిరిగి మొత్తానికి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ చేరింది. తల్లిదండ్రుల వివరాలు అడిగారు పోలీసులు. ‘నాకు ఎవరూలేరు’ అని చెప్పింది పాప మొండిగా. బుజ్జగించి అడిగారు. అయినా అదే సమాధానం. ఇంకాస్త బతిమాలి అడిగారు. ఈసారి పాప కళ్లల్లో నీళ్లు. మరికాస్త బామాలే సరికి ఆ అమ్మాయి కడుపులో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఏడుస్తూనే తల్లిదండ్రుల వివరాలు చెప్పింది. వాళ్లను పిలిపించారు పోలీసులు.
 
వెళ్లను.. నాకు ఎవరూ లేరు..

‘అమ్మానాన్న వచ్చారు కదా.. ఇక ఇంటికెళ్లమ్మా’ అన్న పోలీసులతో, మళ్లీ.. ‘వెళ్లను.. నాకు ఎవరూ లేరు’..అని పాప చెప్పింది. ఆ జవాబుకి తల్లిదండ్రులిద్దరూ అవాక్కయ్యారు. ‘అదేంటమ్మా అట్లా అంటావు పద తల్లి ఇంటికెళ్దాం’ అని గడ్డం పట్టుకొని బతిమాలబోయిన అమ్మ చేతిని విసిరికొట్టి ‘నేను.. రాను.. ‘‘నువ్వు చచ్చిపోయినా బాగుండు’’ అన్నావ్. మీతో రాను’అంటూ వెక్కిళ్లు పెట్టింది బిడ్డ. అంత చిన్న పిల్లకు అంత మొండిపట్టుదలేంటో, తల్లి మీద అంత కోపమెందుకో పోలీసులకు, అక్కడున్న మీడియాకూ అర్థంకాలేదు. అర్థంచేయించే పనీ ఆ పాప పెట్టుకున్నట్టుగా చిన్ని గుండెలో దాగిన బాధనంతా వెళ్లగక్కిందిలా...
 
నన్నొకలా. తమ్ముడ్ని ఒకలా..
నీ బాధేంటమ్మా అని అనునయించిన వెంటనే.. ‘అమ్మ.. నన్నొకలా. తమ్ముడ్ని ఒకలా చూస్తది. వాడేం చేసినా ఏమనదు. నేనేమనకపోయినా నన్ను కొడ్తది. వాడికే పాలు, పెరుగు, గుడ్డు, స్వీట్లు అన్నీను. నాకేమీ ఇవ్వదు (కన్నీళ్లను ఫ్రాక్‌తో తుడుచుకుంటూ). వాడు అల్లరి చేసినా నన్నే కొడుతుంది. ఇంట్లో పనంతా నేనే చేయాలి. టైమ్‌లేక హోమ్ వర్క్ చేయకపోతే స్కూల్లో టీచర్స్ కొడ్తున్నారు. పనిచేయకపోతే ఇంట్లో అమ్మ కొడుతుంది. ఇద్దరితో రోజూ తన్నులు తింటున్నాను’ అంటూ వెక్కివెక్కి ఏడుపు.

ఆ మాటలకు అమ్మ మనసు కదిలిందో ఏమో.. ‘ఇంకేమననులే తల్లీ... ఇంటికి రా పోదాం’ అంటూ చుబుకం పట్టుకొని బతిమాలుతున్న అమ్మ చేతిని మళ్లీ విదిలించి కొట్టింది పాప. ‘ఏమననులే ఏంటమ్మా... ‘నువ్వు చచ్చినా బాగుండు’ అన్నావ్. అలాంటప్పుడు నన్నెందుకు కన్నావమ్మా.. నా బదులు ఇద్దరు మగపిల్లల్ని కనాల్సింది’ అన్న ఆ పాప మాటకు అక్కడున్న అందరూ అవాక్కయ్యారు. ఇంత చిన్న నోట అంత పెద్ద మాట వచ్చిందంటే ఆ పసి హృదయం ఎంత గాయపడుండాలి? ‘మొన్న దీపావళికి తమ్ముడికి బట్టలు కొనిపెట్టింది.

నాకు కొనిపెట్టలే’ మళ్లీ వెక్కిళ్లతో ఏడుపు. ‘నా కన్నా తమ్ముడినే చూస్తూ.. తమ్ముడంటేనే ఇష్టమున్న ఆ ఇంటికి నేనెందుకు వెళ్లాలి? వెళ్లను. నాకు ఎవరూ లేరు. నేను రాను’ ఏడుస్తూ ఉంది పాప. ‘చదువుకోనివ్వరు.. ఇష్టమైంది పెట్టరు. పనంతా నాకే.

చేయకపోతే కొడ్తారు’ ఏడేళ్ల పాప గోస. ‘నన్నెందుకు కన్నావమ్మా... నా బదులు ఇద్దరినీ మగపిల్లల్నే కనాల్సింది’ ఆ మాటలు అక్కడున్న అందరికీ శూలాల్లా తగిలాయ్.. ఆ అమ్మకు కూడా! ఆ పాప చేసిన తప్పేంటి? అమ్మాయిగా పుట్టడమా? కాదు అని ఆ చిన్న మనసుకీ అర్థమైంది. అందుకే ఇంట్లోనే జరుగుతున్న అన్యాయానికి తనకు చేతనైన పద్ధతిలో నిరసన తెలిపింది. నిలదీసింది! తనకూ బతికే హక్కుందని చాటుతోంది! పోలీస్‌స్టేషన్ చేరిన సత్యం ఇది.. ఆడపిల్లలందరి ఆవేదన.. ఆక్రోశానికి  ప్రతినిధి ఈ ఏడేళ్ల పసిది! (ఆ తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాగా చూసుకుంటామని మాట ఇచ్చాకే ఆ పాప వాళ్లతో వెళ్లడానికి సిద్ధపడింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement