రెండో ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదం కృశిస్తోందని, అమెరికా సామ్రాజ్యవాదం విస్తరించనుందని అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నేత, యునెటైడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అధినేత స్టాలిన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు వివరించారు. మారిన పరిస్థితుల్లో అమెరికాను ప్రపంచ కమ్యూనిస్టులు ప్రథమ శత్రువుగా భావించాలన్నారు. అమెరికాను వ్యతిరేకిస్తూ.. బలహీనపడుతోన్న బ్రిటిష్ సామ్రాజ్యంతో స్నేహపూర్వకంగా ఉండే భారత్ వంటి దేశాలు, జాతీయ భూస్వామ్యవర్గాలు.. కమ్యూనిస్టుల పోరాటంలో తదుపరి ప్రాధాన్యతలలోకి వస్తాయని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపును వివేచించాలన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో స్టాలిన్ ఏమన్నారు..?!
భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత.. సైన్యం కమ్యూనిస్ట్‌లను నిర్దాక్షిణ్యంగా
అణచివేయడం ప్రారంభించింది. బ్రిగ్స్ ప్లాన్‌ను అమలు చేస్తూ! మలేసియాలో కమ్యూనిస్ట్‌లను అణచివేసేందుకు బ్రిటీష్ సైన్యాధికారి ‘బ్రిగ్స్’ అనుసరించిన వ్యూహంతో! ఏమిటా వ్యూహం? కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా బలప్రయోగం చేయడం! పంటలను దగ్ధం చేయడం. గిరిజనులు, గ్రామస్తులను భీతావహులను చేయడం. దోచుకోవడం. అనుమానితులందరినీ ఒకచోట చేర్చి కంచెవేయడం. వంట వండుకోవడానికి వంటచెరకు కోసం ఎవరైనా వెళ్లాలంటే ఇంట్లో మగమనిషిని తమ క్యాంపుల్లో జామీన్‌దారుగా ఉంచుకోవడం! మహిళలు తిరిగివచ్చాకే ఇంటిమనిషిని వదలడం.. ఇత్యాదులు! గెరిల్లా
పోరాటంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు గ్రామీణుల ద్వారా సమాచారం అందకుండా చేయడం, లేదా తప్పుడు సమాచారం ఇప్పించడం, దళాలను ఏకాకులను చేయడం. ఆనుపానులను తెలుసుకొని చుట్టుముట్టడం, మట్టుపెట్టడం.. దటీజ్ బ్రిగ్స్ ప్లాన్! తెలంగాణలో,
కమ్యూనిస్ట్‌ల ప్రభావం ఉన్న ఆంధ్ర ప్రాంతంలో బ్రిగ్స్ ప్లాన్ మలేసియాను
మరిపించేలా అమలైంది!
కమ్యూనిస్ట్‌లకు నిజాం ప్రభుత్వంపై పోరాటం చేయడం నల్లేరుపై నడకలా సాగింది. భారత ప్రభుత్వంపై పోరాటం కత్తుల వంతెనపై విన్యాసమే అవుతోంది! నిషేధం విధించిన మూడు రోజుల్లోనే కమ్యూనిస్ట్‌లు మెరికల్లాంటి తమ యోధులు రెండు వందల మందిని కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రణదివే నాయకత్వంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ వారిని పోరుబాట పట్టాల్సిందే అని ఆదేశించింది. క్రియాశీలురు మైదానప్రాంతం నుంచి అజ్ఞాతవాసం వెళ్లాలంది. తదనుగుణంగా కరీంనగర్ జిల్లాలోని గోదావ రి అటవీ ప్రాంతానికి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? మహానాయకుడు చండ్ర రాజేశ్వరరావుకే భద్రతలేని పరిస్థితుల్లో!! పార్టీ శ్రేణులు విచలితమయ్యాయి!
ఇంగ్లండ్ కాంటాక్ట్‌తో క్రెమ్లిన్‌కు కబురు!
సాయుధపోరాటాన్ని కొనసాగించడమా? విరమించడమా? పార్టీపై ఒత్తిడి పెరిగింది. నాయకత్వం తర్జనభర్జనలు పడింది. ఎటూ పాలు పోలేదు. అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీకి యునెటైడ్ సోవియట్ సోషలిస్ట్
రిపబ్లిక్ అధినేత జె.వి. స్టాలిన్ నాయకుడు. అన్ని దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు క్రెమ్లిన్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను సూచనలను పాటిస్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ తమ సమస్యను చర్చించేందుకు స్టాలిన్‌తో భేటీని కోరింది. ఒక ప్రతినిధి బృందం మాస్కోకు వచ్చి స్టాలిన్‌ను సంప్రదించాల్సిందిగా సూచన అందింది! 1951లో నలుగురు సభ్యుల బృందం మాస్కో బయలు దేరింది! శ్రీపాద అమృత్ డాంగే, అజయ్ ఘోష్, చండ్ర రాజేశ్వరరావు-బసవపున్నయ్య ఈ బృందంలో సభ్యులు. మొదటి ఇరువురూ సాయుధ పోరాటవిరమణకు అనుకూలురు. మిగిలిన ఇరువురూ విరమణకు అనుకూలురు కాదు, అలాగని కొనసాగించాలని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు.
ఆరు నెలుగా అనేక సమావేశాలు..
భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంలోని నలుగురూ మాస్కో చేరారు. తెలంగాణ సాయుధపోరాటం కొనసాగింపునకు అనుకూల వ్యతిరేక వర్గాల వారి వాదనల ఇంగ్లిష్
డాక్యుమెంట్లు రష్యన్ భాషలోకి అనువాదమయ్యాయి. వాటి ప్రాతిపదికగా అక్కడి నాయకులతో శ్రేణుల వారీగా చాలా చాలా సమావేశాల్లో పాల్గొన్నారు. ఆరు నెలలు గడిచాయి. చివరకు క్రెమ్లిన్‌లో స్టాలిన్‌ను కలిశారు. ఆ రోజు 1951 ఫిబ్రవరి 9. మొలతోవ్-మలెకోవ్-సుజ్లోవ్‌లూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. స్టాలిన్ రష్యన్‌లో మాట్లాడుతున్నారు. ప్రతినిధి బృందం
ఇంగ్లిష్‌లో మాట్లాడుతోంది. ప్రతి ప్రదమూ ఆచి తూచి ! నిపుణులు దుబాసీలుగా
వ్యవహరిస్తున్నారు.
మూడు ప్రశ్నలు!
తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతున్న ప్రాంతపు మ్యాప్‌ను స్టాలిన్ సహాయకులను అడిగారు. భారతదేశపు చిత్రపటం, దక్షిణ భారతదేశపు సవివర చిత్రపటాలు ఆయన
విశాలమైన మేజా బల్లైపై క్షణాల్లో పరిచారు. స్టాలిన్ తన పైపును పొగాకుతో నింపి.. వెలిగించాడు. ఇలా అడిగాడు ...
‘మీరు సాయుధపోరాటం చేస్తోన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆనుకుని లేదా దగ్గరగా ఏదైనా విదేశం ఉన్నదా?’
‘లేదు’
‘మీరు తప్పించుకునేందుకు ఏదైనా ఒక నౌకాశ్రయం ఉన్నదా?’
‘లేదు’
‘మీరు ఆశ్రయం పొందేందుకు ఏదైనా రక్షిత స్థలం ఉందా?’
‘లేదు’
స్టాలిన్ పైపును ఛాతీ అట్టడుగు పొరల్లోకి పీల్చాడు. టేబుల్‌పై మ్యాప్‌లను పక్కకు నెట్టేశాడు. పొగను వదుల్తూ అన్నాడు... ‘ ఈ పరిస్థితుల్లో మీరు ప్రతిబంధకాలను
ఎదుర్కోవడం, పోరాటం చేయడం కష్టమే ’ అన్నారు! అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ అభిప్రాయం మేరకు భారతదేశంలో పార్టీ తన విధానాన్ని
సవరించుకుంది. ఈ నిర్ణయం వచ్చేసరికి భారత ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని భౌతికంగా ఉండచుట్టింది! ఆ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసింది! అలా తెలంగాణ సాయుధపోరాటం ముగిసింది!
ప్రజెంటేషన్:
పున్నా కృష్ణమూర్తి
స్టాలిన్ ఉద్బోధ !
Published Tue, Mar 3 2015 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement