హాస్టల్ దునియా | Hostel Duniya | Sakshi
Sakshi News home page

హాస్టల్ దునియా

Published Mon, Mar 23 2015 10:15 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

హాస్టల్ దునియా - Sakshi

హాస్టల్ దునియా

చదువుకోసమో... ఉద్యోగవేటలోనో నగరంలో అడుగుపెడితే మొదటఎదురయ్యే సమస్య వసతి. బంధువులుంటే సరి... లేకపోతే హాస్టలే గతి.
 ఆ హాస్టల్‌ను వెదకడానికి నానా కష్టాలు. ఎన్నో తిప్పలు పడి వెతికినాక దొరికినా... అందులో సౌకర్యాలు అరకొర. ఈ సమస్యలన్నింటికీ సింగిల్ క్లిక్‌తో చెక్ పెట్టేలా చేశాడు యువ ఇంజనీర్ రాజు. ‘హాస్టల్‌దునియాడాట్‌కామ్’ వెబ్‌సైట్‌ని సృష్టించి... అవసరం ఆవిష్కరణలకు నాంది అని మరోసారి నిరూపించాడు. ఆ నాంది ప్రస్తావన...
 ..:: భువనేశ్వరి
 
‘కరీంనగర్ మా స్వస్థలం. నాన్న రైతు. ఇంజనీరింగ్ చదువుకోవడానికి హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడ జేఎన్‌టీయూలో చదువు పూర్తయ్యాక ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాలేజ్ టైమ్‌లోనే సరైన హాస్టల్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడ్డాను. జస్ట్ డయిల్ ద్వారా వెదికితే... అడ్రస్ ఉంటుంది. హాస్టల్లో సదుపాయాల గురించి తెలియదు. చాలా ఇబ్బంది పడ్డాను. అయితే నాలా ఎంతో మంది ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అనిపించింది. ఒక యూజర్‌ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌లో నగరంలోని హాస్టళ్ల వివరాలు పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాను. ముందుగా వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాను. ఉద్యోగం చేసుకుంటూనే ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టాను’అంటూ హాస్టల్ దునియా డాట్‌కామ్ రూపకల్పన వెనుక సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు రాజు. ఏడాది కిందట స్టార్ట్ అయిన ఈ వెబ్‌సైట్‌ను ఇప్పటివరకు 8 లక్షలమంది చూశారు.

అన్ని వివరాలు...

ఈ వెబ్‌సైట్‌లో హాస్టల్ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టి ఊరుకోలేదు. హాస్టల్‌లో ఉన్న సదుపాయాలు, సింగిల్ రూమ్‌కి ఫీజు ఎంత?, డబుల్ షేరింగ్‌కి ఎంత, త్రిబుల్ షేరింగ్‌కి ఎంత, ఏసీ ఉంటే, లేకపోతే... ఇలా అన్ని రకాల వివరాలు చేర్చాడు. ఆ హాస్టల్‌కి ఎంత దూరంలో ఏమేమున్నాయో కూడా మెన్షన్ చేశాడు. ‘ఇన్ని వివరాలు సైట్‌లో పెట్టాలంటే నేరుగా హాస్టల్ యజమానులతో మాట్లాడాలి, హాస్టల్‌ని చూడాలి. కొత్తలో పెన్ను, పేపరు పట్టుకుని హాస్టల్‌కి వెళ్లి వివరాలు చెప్పమని అడిగితే చాలామంది తిరస్కరించారు. ఏ ఐటి అధికారులో పంపించి ఉంటారని భయపడ్డారు. చాలా ఓపికతో విషయం చెప్పి, వారిని ఒప్పించి వివరాలు సేకరించడానికి చాలా సమయం పట్టింది. రోజూ ఆఫీసునుంచి బయటికివచ్చాక ఫ్రెండ్స్‌ని తీసుకుని హాస్టళ్ల చుట్టూ తిరిగేవాణ్ణి. అలా కొన్ని నెలలపాటు తిరిగి రెండు వందల హాస్టళ్ల వివరాలు సేకరించగలిగాను. వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాను’ అని తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు రాజు.
 
కొద్దిరోజుల్లోనే...

సైట్‌ని మొదలుపెట్టిన కొద్దిరోజులకే విజిటర్స్ సంఖ్య పెరిగిపోయింది. దీంతో ‘మా హాస్టల్ వివరాలు కూడా చేర్చండ’ంటూ హాస్టళ్ల యజమానులు రాజుని సంప్రదించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో నగరంలోని 1500 హాస్టళ్ల వివరాలున్నాయి. వెబ్‌సైట్‌కి వెళ్లి మనకు కావాల్సిన సదుపాయాలను ఆప్షన్స్‌లో టైప్ చేస్తే... మన రిక్వైర్‌మెంట్స్‌కి తగిన హాస్టల్‌ను అడ్రస్, ఫోన్‌నెంబర్‌తో సహా మన ముందుంచుతుంది. ‘తొలిసారి ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించినందుకు ఈ మధ్యనే స్టార్టప్ హీరో అవార్డు వచ్చింది. నగరంలో అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మాదాపూర్, మణికొండ... ఇలా ఏరియావైజ్ హాస్టళ్ల వివరాలను క్షణాల్లో తెలుసుకోగలిగే అవకాశాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంతోపాటు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే హాస్టల్లో రూమ్ దొరకడం ఎంత సులువో.. అంతే కష్టం కూడా. ముఖ్యంగా అమ్మాయిలకు. ఈ సమస్య మన ఒక్క నగరానిది మాత్రమే కాదు. బెంగళూరు, చెన్నైలో ఉన్న తెలుగువాళ్ల సూచనమేరకు అక్కడా హాస్టల్ దునియా ప్రారంభించాను’ అని వివరించాడు రాజు. ఈ స్టార్టప్ హీరో భవిష్యత్‌లో పుణే, కోయంబత్తూర్‌కి కూడా ఈ సేవలను విస్తరించాలనుకుంటున్నాడు.

ఇతర నగరాల్లో...

ఈ మధ్యనే మొదలైన బెంగళూరు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం 50 హాస్టళ్ల వివరాలు ఉన్నాయి. మరిన్ని చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చెన్నైలోనూ హాస్టల్‌దునియా ప్రారంభమైంది. ‘దేశంలోని ఏ నగరానికైనా కొత్తగా వచ్చిన వ్యక్తి వసతి ఇబ్బందులెదుర్కోకుండా ఉండాలన్నదే నా ఆలోచన’ అని చెబుతున్న ఈ యువ ఇంజనీరు కల నెరవేరాలని కోరుకుందాం!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement