ఆసక్తి... అవకాశాలు
కోర్సు ఎంపికకు గీటురాళ్లు..
నేటి ప్రపంచీకరణ యుగంలో.. విద్యార్థుల ముంగిట ఎన్నో విద్యావకాశాలున్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్‌లే కాకుండా.. అనేక కోర్సులు ఆహ్వానం పలుకుతున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి రెగ్యులర్ కోర్సులతోపాటు ఫైన్‌ఆర్ట్స్, ఫ్యాషన్, లా కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. సిటీలో అకడమిక్ అడ్మిషన్స్ జరుగుతున్న తరుణంలో.. విద్యార్థులు ఆయా కోర్సులను ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి? ఆసక్తా.. అవకాశాలా.. జాబ్ మార్కెట్ ట్రెండ్సా..అమ్మానాన్నల మార్గనిర్దేశమా.. స్నేహితుల ప్రోద్బలమా.. తెలుసుకుందాం..
రెగ్యులర్ డిగ్రీ కోర్సైనా, కలర్‌ఫుల్ ఫ్యాషన్ టెక్నాలజీ అయినా.. కెరీర్ అవకాశాలకు ఆకాశమే హద్దు అంటున్నారు సిటీ విద్యార్థులు. విభిన్న కోర్సుల ఎంపికతో ఒక్కొక్కరు ఒక్కో కెరీర్ గమ్యాన్ని నిర్దేశించుకుంటున్నారు. ఎంచుకున్న కోర్సుపై ఆసక్తి, అభిరుచి ఉండి, కష్టపడి చదివితే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
‘చిన్నప్పటి నుంచి భవనాల నిర్మాణాలు, వాటి ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సుల్లో చేరాలనున్నాను. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి.. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)లో చేరాన’ని పేర్కొంటున్నాడు.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సునభ్యసిస్తున్న మనీశ్ కుమార్. స్నేహితులందరూ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఎంచుకుంటున్నా.. తాను మాత్రం ఆర్కిటెక్చర్‌పై ఆసక్తితోనే ఈ కోర్సును ఎంచుకున్నానని తెలిపాడు. సృజనాత్మక నైపుణ్యాలుండి, ఫైన్‌ఆర్ట్స్‌లో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు యూనివర్సిటీతోపాటు నగరంలోని పలు కళాశాలలు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
‘ఫ్యాషన్’ కోర్సులు:
ఫ్యాషన్ కెరీర్.. నేటి సిటీ విద్యార్థికి పాషన్(అమితమైన ఇష్టం)గా మారింది. ఇంటర్మీడియెట్ తర్వాత ఈ కోర్సులో ప్రవేశించడానికి పోటీ పెరుగుతోంది. ప్రధానంగా సిటీ స్టూడెంట్స్ ఈ కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ‘కాస్ట్యూమ్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైన్ అంటే ఆసక్తి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ ప్రారంభించాలనుకున్నా. అందుకే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్), హైదరాబాద్‌లో చేరాన’ని తెలిపింది నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్‌లో నాలుగేళ్ల టెక్స్‌టైల్ డిజైన్ కోర్సునభ్యసిస్తున్న పి.అనిత. ఇంటర్మీడియెట్ తర్వాత ఫ్యాషన్ కోర్సులనభ్యసించాలనుకునే వారికోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆహ్వానం పలుకుతోంది. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఫ్యాషన్ రంగంలో ఉన్నత శిఖరాలనధిరోహించాలనుకునే వారికి సరైన వేదికగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని ఈ క్యాంపస్ ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో విభిన్న కోర్సులను ఆఫర్ చేస్తోంది. యాక్సెసరీస్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, అప్పరెల్ ప్రొడక్షన్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తోంది. వీటితోపాటు ఏడాది, ఆర్నెల్లు, మూడు నెలల కాలవ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి.
డిగ్రీలు-స్పెషలైజేషన్లు
డిగ్రీ కోర్సుల్లోనూ వైవిధ్యమైన కోర్సులకే సిటీ స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు. బీకామ్ కంప్యూటర్స్, హానర్స్ కోర్సుల్లో ప్రవేశానికే ఎక్కువ మంది పోటీపడుతున్నారు. ‘స్పెషల్ సబ్జెక్టుల ద్వారా విస్తృత అవకాశాలు సొంతం చేసుకోవచ్చని భావించాను. అందుకే డిగ్రీలో బీకామ్ హానర్స్ గ్రూప్‌ను ఎంపిక చేసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే.. బీకామ్ హానర్స్ డిగ్రీకి.. ఎంకామ్‌తో సమానంగా అవకాశాలున్నాయనడంలో సందేహం లేదు’ అని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ - కోఠిలో బీకామ్ హానర్స్ కోర్సునభ్యసిస్తున్న సయీదా హఫ్సా ఫాతిమా వివరించారు. బీఎస్సీ, బీఏ, బీకామ్ రెగ్యులర్ కోర్సుల్లోనూ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు. సిటీలోని ప్రముఖ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ కాంబినేషన్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది.
శ్రీ డిగ్రీ కోర్సులకు డిమాండ్!
గత రెండు మూడేళ్లుగా సాధారణ డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఇంటర్మీడియెట్‌లో 90 శాతం మార్కులకు పైగా సాధించిన వారు సైతం డిగ్రీ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా బీకామ్ జనరల్, కంప్యూటర్స్, బీఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లతోపాటు బీఎస్సీ కోర్సుల్లోనూ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఆధునిక ప్రపంచానికి తగినట్లుగా డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించడానికి ఆసక్తి చూపుతున్నాయి. అలాగే ఇంజనీరింగ్ తదితర సాంకేతిక కోర్సులకు దీటుగా డిగ్రీ కోర్సులకూ అవకాశాలుండడం వల్ల విద్యార్థులు వాటిపై మొగ్గుచూపుతున్నారు.
- ప్రొ. జితేందర్ కుమార్ నాయక్,
అకడమిక్ కోఆర్డినేటర్, ఉస్మానియా యూనివర్సిటీ
కాలేజ్ ఫర్ ఉమెన్, కోఠి
అవకాశాలు సమానం!
బీఎస్సీ ఎంపీఈసీఎస్ గ్రూప్‌ను ఎంచుకున్నాను. ఇంటర్మీడియెట్‌లో 93శాతం మార్కులు సాధించాను. ఇంటర్ తర్వాత అకడమిక్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవడం సవాలుతో కూడుకున్న పని. ఇంజనీరింగ్‌లో చేరాలా.. లేక డిగ్రీ కోర్సునభ్యసించాలా? అని చాలా ఆలోచించా. ఇంట్లో అందరూ ఇంజనీరింగ్‌లో చేరాలని ఒత్తిడి చేశారు. అయినా చదివేది నేనే కాబట్టి నా ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా డిగ్రీలో చేరాను. మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులుగా ఉన్న ఎంపీఈసీఎస్ గ్రూప్‌లో చేరాను. కష్టపడి చదివితే నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సైనా, మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సైనా ఒక్కటేనని నా నమ్మకం. రెండింటిలోనూ అవకాశాలు సమానంగా ఉన్నాయనేది నా విశ్వాసం. అలాగే డిగ్రీ కోర్సుతో ఒక ఏడాది సమయం కూడా కలిసొస్తుంది.
- ఇ.మేఘన, బీఎస్సీ మొదటి సంవత్సరం
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కోఠి