City students
-
బెజవాడకు మంచిపేరు తెండి
విజయవాడ సెంట్రల్ : వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్‌లో ప్రతిభ కనబరిచి బెజవాడకు మంచిపేరు తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఆకాంక్షించారు. ఈనెల 22, 23 తేదీల్లో కోల్‌కతాలో జరిగే వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వి.వెంకట ప్రణీత, మ్యాట్మన్ స్కూల్ నుంచి టి.మాధవ్, నలంద పబ్లిక్ స్కూల్ నుంచి ఎన్.సుశీల్‌రెడ్డి ఎంపికయ్యారు. వీరిని టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గురువారం కమిషనర్ చాంబర్‌కు తీసుకువచ్చారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అభివృద్ధి పరిచే అంశంపై 2016కు సంబంధించి ఎరువులు లేకుండా బలమైన పోషకాలతో తాము తయారుచేసిన ఆర్గానిక్ పౌడర్ గురించి విద్యార్థులు కమిషనర్‌కు వివరించారు. పాడైన పండ్లు, కూరగాయలను ఉడికించి, డ్రై చేసి దాన్ని పౌడర్‌గా తయారుచేసినట్లు తెలిపారు. ఈ ఆర్గానిక్ పౌడర్ చేపలు, రొయ్యలు, మేకలు, ఆవులు వంటి జంతువులకు ఆహారంగా వినియోగించవచ్చన్నారు. రోబో రాయల్ టీమ్స్ తరఫున తాము వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నట్లు వివరించారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలవాలని కమిషనర్ విద్యార్థులకు సూచించారు. -
‘మాతృభాష’ను మురిపిస్తాం
సెంట్రల్ యూనివర్సిటీ: సెంట్రల్ యూనివర్సిటీ అనగానే ఇంగ్లిష్ వ్యవహారంతో కూడిన చదువులు గుర్తొస్తుంటాయి. ఉద్యోగ అవకాశాలుంటాయని నేటి యువత కూడా వాటివైపే ఆసక్తి చూపిస్తుంటారు. మాతృభాషపై మమకారం చంపుకొక మరికొందరు లింగ్విస్టిక్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఇదే కోవలో మన సిటీ విద్యార్థులు కనుమరుగవుతున్న తెలుగు, ఉర్దూ భాషలకు జీవం పోసేందుకు పీహెచ్‌డీలు చేస్తున్నారు. మరికొందరు పీజీలో తెలుగు, ఉర్దూ భాషలను ఎంచుకొని కన్వకేషన్ పొందుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడి ప్రభుత్వాలు తెలుగు, ఉర్దూకు ప్రాధాన్యమిచ్చి మన భాషను భావితరాలకు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉద్యోగవకాశాలు లేకున్నా మాతృభాష కోర్సులను ఎంచుకున్నామంటున్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన 16వ స్నాతకోత్సవంలో తెలుగు, ఉర్దూ భాషల్లో పట్టాలు అందుకున్న విద్యార్థులతో ‘సాక్షి’ ముచ్చటించింది. మీడియా చొరవ చూపాలి ‘మాది మహబూబ్‌నగర్. నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచే తెలుగంటే ఇష్టం. అనేక కష్టనష్టాలు ఒర్చుకొని ఎంఏ తెలుగు చేశా. ఈ రోజు పీహెచ్‌డీలో హెచ్‌సీయూ నుంచి పట్టా అందుకున్నా. ‘పాలమూరు జిల్లా క్షేత్ర మహత్య పద్య కావ్యాలు అనుశీలన’పై చేసిన పరిశోధనకు ఈ గౌరవం దక్కింది. హెచ్‌సీయూలోనే తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృధ్ధి కోసం కృషి చేస్తా. కనమరుగువుతున్న తెలుగును బతికించాలంటే ప్రభుత్వంతో పాటు మీడియా కూడా చొరవ తీసుకోవల్సిన అవసరముందని వికలాంగుడైన శ్యామ్ సుందర్ తెలిపారు. తెలుగంటే ప్రాణం ‘మాది తూర్పుగోదావరి జిల్లా. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నా. అమ్మనాన్నల మద్దతుతో ఈ రోజు పీహెచ్డీ పట్టా సాధించగలిగా. తెలుగు నిఘంటువుల ఆరోపాల అధ్యయనం చేశా. బాసర ఐఐఐటీలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృద్ధి కోసం కృషి చేస్తా. తెలుగును బతికించేందుకు అందరం కృషి చేయాలని దోమలగూడలో ఉంటున్న కొమండూరి విజయభాను తెలిపారు. ఉర్దూ భాష గొప్పతనం చెబుతా రోజు ఉర్దూ భాషలో పీహెచ్డీ పట్టా పొందానంటే అందుకు మా కుటుంబసభ్యుల సహకారం ఉంది. రోజురోజుకు కనమరుగువుతన్న ఈ భాషను మళ్లీ గాడిలో పెట్టేందుకు నా వంతు కృషి చేస్తా. పిల్లలకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరిస్తా. ఇందుకోసం ప్రతి పాఠశాలలో సెమినార్లు నిర్వహిస్తానని ఎల్బీ నగర్లో ఉంటున్న గృహిణి జరీన్‌ఖాన్ తెలిపారు. సిటీలో ఆదరణ ఉంది ‘సిటీలో ఉర్దూకు మంచి ఆదరణ ఉంది. భారీ సంఖ్యలో మైనారిటీలున్నా ఆ భాషకు తగిన ప్రాచుర్యం లేదు. ఉద్యోగవకాశాలు తక్కువగా ఉండడం కూడా ఈ భాషపై యువతకు నిరాసక్తత కలిగించేలా చేస్తోంది. అయితే యువతకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం నా వంతుగా చేస్తా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటే బాగుంటుంద’ని ఉర్దూ భాషలో పీహెచ్డీ పట్టా పొందిన సిటీకి చెందిన గౌసియా భాను తెలిపారు. -
నగర విద్యార్థికి కేంబ్రిడ్జి పురస్కారం
నగర విద్యార్థికి అవుట్ స్టాండింగ్ కేంబ్రిడ్జి లెర్నర్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుతున్న వరుణ్ మాథుర్ జూన్ 2014 సిరీస్‌లో కేంబ్రిడ్జి నిర్వహించిన ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్ఈ) పరీక్షలో భారత్ నుంచి ప్రథమస్థాయిలో నిలిచాడు. కేంబ్రిడ్జి.. ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పరీక్ష నిర్వహిస్తుంది. దీనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పురస్కారం అందజేస్తారు. వీరికి అంతర్జాతీయంగా గుర్తింపుతోపాటు కెరీర్‌కు అవసరమైన ప్రోత్సాహాన్ని కేంబ్రిడ్జి వర్సిటీ అందిస్తుంది. నగరానికే చెందిన మరో విద్యార్థి చాలుమూరి వెంక టనాగ రితిన్ నాయుడు రెండో స్థానంలో నిలిచాడు. -
సిటీ స్టూడెంట్స్.. కోరికల చిట్టా!
నగరంలోని ప్రముఖ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సంప్రదాయ కోర్సుల్లో చదివేవారు కొందరైతే.. విభిన్న కోర్సులను ఎంపిక చేసుకొని వైవిధ్యమైన కెరీర్లో అడుగుపెట్టేవారు మరికొందరు. తమ అభిరుచులకు, ఆసక్తులకు పెద్దపీట వేస్తూ వినూత్న పంథాలో దూసుకెళ్తున్న సిటీ స్టూడెంట్స్.. విద్యావిధానంలో తామేం కోరుకుంటున్నారో కుండబద్ధలు కొడుతున్నారు. కొత్త విద్యాసంవత్సరంలో సిటీ విద్యార్థుల ఆలోచనలేంటో చూద్దాం.. ప్రవేశ పరీక్షల సంఖ్య తగ్గాలి! ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో చేరాలంటే.. ఆయా బోర్డులు, విద్యాసంస్థలు నిర్వహించే అనేక ప్రవేశ పరీక్షలను రాయాల్సిందే. పలు పరీక్షల సిలబస్‌లో వ్యత్యాసాలు, పరీక్ష విధానాల్లో తేడా ఉండడంతో విద్యార్థి దేనిపైనా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. అందుకే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకే నగర విద్యార్థి మొగ్గు చూపుతున్నాడు. ‘ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఎంసెట్, జేఈఈ-మెయిన్, బిట్‌శాట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాశాను. వివిధ రకాల ఎంట్రెన్స్‌లు, వాటి విభిన్న సిలబస్‌లను ఒకే సమయంలో సన్నద్ధమవడం కష్టమైంది. పరీక్ష తేదీలు కూడా వారం రోజుల వ్యవధిలోనే ఉండడం వల్ల ఆందోళన చెందాను. ఫలితంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. ఎంసెట్ ప్రిపరేషన్కైనా ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుండేదనిపించింది’ అని ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న కీర్తిరెడ్డి చెప్పాడు. ఉమ్మడి ఎంట్రెన్స్తోపాటు కామన్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రవేశ పెట్టాలని సిటీ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఆన్లైన్ రిసోర్సెస్: క్లాస్ రూమ్ పాఠాలకు ఆన్లైన్ గెడైన్స్ కూడా తోడైతే అకడమిక్‌గా మంచి ఫలితాలను సాధించొచ్చు. యూనివర్సిటీలు, కళాశాలలు సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్ని, ప్రిపరేషన్ మెళకువలను కూడా ఆన్లైన్లో పొందుపరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం విద్యార్థి లోకంలో వ్యక్తమవుతోంది. ‘ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, గెడైన్స్, మాక్, ఆన్లైన్ పరీక్షలు చాలా వెబ్సైట్లలో లభిస్తున్నాయి. అలాగే ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన మెటీరియల్, జాబ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గెడైన్స్, మాదిరి ప్రశ్నలు, సంబంధిత మెటీరియల్‌ను అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’ అని ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్న వై.హర్షిత్ తెలిపాడు. ప్రమాణాలు పాటించాలి: రాష్ట్రంలో కళాశాలల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. నాణ్యమైన విద్యనందించే విద్యాసంస్థల కొరత మాత్రం అలాగే ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, ప్రముఖ విద్యాసంస్థలు మినహా చాలా కాలేజీలు కనీస ప్రమాణాలను కూడా పాటించడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల నుంచి ఆదరణ లేక సీట్ల భర్తీకి కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. ‘ఎంసెట్ ర్యాంకులు పొందిన తర్వాత రోజు నుంచే కన్సల్టెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నారు. తాము సూచించిన కాలేజీలో చేరాలని కోరుతున్నారు. కన్వీనర్ కోటా కంటే తక్కువ ఫీజులకే అడ్మిషన్ ఇప్పిస్తామని, ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు’ అని ఇంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థి జె.శ్రీధర్ తెలిపాడు. తగిన మౌలిక సదుపాయాలను కల్పించి, బోధన, ప్రయోగశాలల్లో నాణ్యతను పాటిస్తే.. విద్యార్థులే కళాశాలను వెతుక్కుంటూ వెళ్తారని స్టూడెంట్స్ పేర్కొంటున్నారు. అన్ని సదుపాయాలుంటేనే కొత్త కళాశాలలు, కోర్సులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రీ రిలవెంట్ సిలబస్: యూనివర్సిటీలు మారుతున్న జాబ్‌మార్కెట్‌కు అనుగుణంగా కరిక్యులంలో మార్పులు తీసుకురావాలి. పరిశ్రమ అవసరాలకు సరితూగే రీతిలో దాన్ని రూపొందించాలి. బోధన కూడా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. కరిక్యులాన్ని పక్కాగా ప్రిపేర్ అయితే జాబ్ సొంతమవుతుందనే నమ్మకం ఉండాలి అని పలువురు అభిప్రాయ పడ్డారు. ‘కోర్సులో భాగంగా అభ్యసించే సబ్జెక్టులకు, ఆ తర్వాత చేసే కొలువుకు సంబంధం ఉండదని అంటున్నారు. ఎలాంటి ఉద్యోగానికైనా ఉపయుక్తంగా ఉండేలా కరిక్యులంను రూపొందిస్తే ఆ సమస్య ఉండదు కదా!’ అంటున్నాడు బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కిశోర్. అదేవిధంగా కాలేజ్-ఇండస్ట్రీ సంయుక్తంగా కోర్సులను ఆఫర్ చేస్తే మరింత మేలు జరుగుతుందని ఎక్కువ మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్న్షిప్స్: ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తే మంచి అవకాశాలుంటాయి.. భవిష్యత్తు లో చేరబోయే కంపెనీలో పని వాతావరణాన్ని ముందే తెలుసుకోవచ్చు.. ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతమవుతుంది. లోటుపాట్లను సవరిం చుకుని అకడమిక్‌గా మరింత రాణించొచ్చు- అనేది విద్యార్థులకు నిపుణులు తరచూ ఇచ్చే సలహా. ‘ఇంటర్న్‌షిప్ విషయంలో విద్యార్థులకు సరైన సమాచారం అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయంలో కళాశాలలు, కంపెనీలు విద్యార్థులకు తగిన తోడ్పాటునందించాలి. విద్యార్థుల అవసరాల రీత్యా ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేయడానికి కంపెనీలు ముందుకు రావాలి’ అని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రెహానా పేర్కొన్నారు. దరఖాస్తులు-ఫీజులు: మంచి కళాశాలలో చేరాలంటే.. మధ్యతరగతి విద్యార్థికి తలకు మించిన భార మవుతోంది. రకరకాల ఎంట్రెన్స్‌లు, దరఖాస్తు రుసుముల దగ్గర్నుంచి అడ్మిషన్ ఫీజులు, కోర్సు ఫీజులు, ఆ తర్వాత పరీక్ష ఫీజుల వర కూ.. విద్యార్థులు పలు రకాల ఫీజులను చెల్లించాల్సి వస్తోంది. ఇక ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, ఫ్యాషన్ తదితర కోర్సుల ఫీజుల గురించి తెలిసిందే. కాబట్టి విద్యార్థులపై భారం తగ్గించాలని, తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్య లభించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి! సిటీ స్టూడెంట్స్‌లో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. వారు ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. నగరంలో అందుబాటులో ఉన్న అవకాశాల సమాచారాన్ని తెలుసుకోవాలి. తక్కువ ఫీజులకే కోర్సులను ఆఫర్ చేస్తున్న రామకృష్ణ మఠ్ వంటి వాటిలో చేరి నైపుణ్యాలను పెంచుకోవచ్చు. అలాగే నగరంలో అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థలపై అవగాహన పెంచుకోవాలి. చదువుతోపాటే ఇతర స్కిల్స్‌నూ వృద్ధి చేసుకోవాలి. - జి. సుధాకర్ సైకాలజీ విద్యార్థి, నిజాం కళాశాల విద్యార్థినులకు భద్రత కావాలి! సిటీలో విద్యార్థినులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. వారి భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మహిళలకు కేటాయించిన ఆర్టీసీ బస్సుల సంఖ్యను కళాశాలల సమయా ల్లో పెంచాలి. కోర్సులు, ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేలా కళాశాలలు చర్యలు తీసుకోవాలి. - సయేదా హఫ్సా ఫాతిమా, బీకామ్ హానర్స్ ఫైనల్ ఇయర్, కోఠి ఉమెన్స్ కళాశాల -
సిటీలో మేటి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్.. ఐపీఈ
ఇన్స్టిట్యూట్ వాచ్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ గురించి తెలియని నగర విద్యార్థులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఔత్సాహికులకు.. ఎంబీఏ, పీజీడీఎం అంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఒకటి. తొలుత 1964లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించిన వ్యవహారాలు, విధానాలపై అధ్యయనం కోసం ఏర్పాటైన ఈ ఇన్స్టిట్యూట్.. క్రమేణా అకడెమిక్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వందల మంది మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లను అందించింది. యాభై ఏళ్ల ప్రస్థానంలో దినదిన ప్రవర్థమానం అవుతూ.. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందింది. నగరంలో ప్రముఖ ఇన్స్టిట్యూట్గా నిలిచి.. గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఐపీఈపై ఫోకస్.. దేశ సామాజిక - ఆర్థిక అభివృద్ధికి పబ్లిక్ ఎంటర్ప్రైజ్లను ప్రధాన సాధనంగా 1960ల ప్రథమార్థంలో ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలనే ఆలోచన చేసింది. అందుకనుగుణంగానే అప్పటి కేబినెట్ సెక్రెటరీ ఎస్.ఎస్.ఖేరా రూపొందించిన ప్రతిపాదనల మేరకు ఏర్పాటైన సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్(ఐపీఈ). తొలుత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ల కార్యకలాపాలకు పరిమితమైన ఈ ఇన్స్టిట్యూట్ కాలక్రమంలో అనేక మైలురాళ్లను అధిగమిం చింది. 1976లో సోషల్ సైన్స్ రీసెర్చ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా కేంద్ర ప్రభుత్వ గుర్తింపును పొందింది. కన్సల్టెన్సీ సర్వీసుల నుంచి అకడెమిక్ కోర్సుల వరకు: ఐపీఈ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.. దేశంలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, పరిశోధనలు, కన్సల్టెన్సీ సర్వీసులు అందించడం. అయితే ఈ ఇన్స్టిట్యూట్ వీటికే పరిమితం కాలేదు. మేనేజ్మెంట్లో అకడెమిక్ కోర్సుల దిశగా అడుగులు వేసింది. ఇలా 1981లో మొట్టమొదట ప్రాక్టీసింగ్ మేనేజర్ల కోసం.. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ స్పెషలైజేషన్‌లో మూడేళ్ల పార్ట్-టైం ఎంబీఏ కోర్సును ప్రారంభించింది. తర్వాత 1995లో రెండేళ్ల వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును ప్రవేశపెట్టింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు.. తాజా గ్రాడ్యుయేట్లకు కూడా పలు కోర్సులను అందిస్తోంది. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా: అకడెమిక్ కోర్సుల దిశగా అడుగులు వేసిన ఐపీఈ.. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలు, జాబ్ ట్రెండ్స్‌కు అనుగుణంగా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల వ్యవధి ఉన్న రిటైల్ మేనేజ్మెంట్; బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్; బయోటెక్నాలజీ, ఇంటర్నేషనల్ బిజినెస్, హెచ్ఆర్ఎం స్పెషలైజేషన్లలో పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించి విద్యార్థుల ఆదరణను చూరగొంది. ఇప్పుడు మేనేజ్మెంట్లో పీహెచ్డీ అందించే వరకు ఎదిగింది. ప్రాక్టికాలిటీకి పెద్దపీట: ఐపీఈ అకడెమిక్ కోర్సుల బోధన విషయంలో మరో ప్రత్యేకత.. మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయడం. ముఖ్యంగా అకడెమిక్‌గా ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్ట్ వర్క్, కేస్ స్టడీస్ అనాలిసిస్‌కు సంబంధించి విద్యార్థులకు రియల్‌టైం ఎక్స్పీరియన్స్ లభించేలా చర్యలు చేపడుతోంది. వీటితోపాటు ఇండస్ట్రీ నిపుణుల భాగస్వామ్యంతో సెమినార్లు నిర్వహిస్తూ విద్యార్థులకు మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా అకడెమిక్ కోణంలో మొనాష్ యూనివర్సిటీ, నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ వంటి పలు ప్రపంచ ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. ర్యాంకింగ్స్‌లోనూ ముందంజ: ‘ఇన్స్టిట్యూట్ను ఎంపిక చేసుకునేముందు సదరు ఇన్స్టిట్యూట్కు ఉన్న ర్యాంకింగ్, గుర్తింపును ప్రామాణికంగా తీసుకోవాలి’.. సాధారణంగా విద్యార్థులకు నిపుణులు ఇచ్చే సలహా. ఈ ర్యాంకింగ్స్ విషయంలోనూ ఐపీఈ ముందంజ లోనే నిలుస్తోంది. జీహెచ్‌ఆర్‌డీసీ-సీఎస్ఆర్, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, ది వీక్, బిజినెస్ ఇండియా, ఔట్లుక్, డీఎన్ఏ, మింట్ తదితర సంస్థలు నిర్వహించే బెస్ట్ -బి స్కూల్స్ సర్వేలో అఖిల భారత స్థాయిలో టాప్-30లో నిలుస్తోంది. అంతేకాకుండా 2009లో వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన సెంటర్ ఫర్ ఫోర్కాస్టింగ్ జాబితాలో ‘టాప్ గవర్నమెంట్ ఎయిడెడ్ బి-స్కూల్’గా గుర్తింపు పొందడం గమనార్హం. కొత్త క్యాంపస్‌లో.. సరికొత్త సదుపాయాలతో: యాభై ఏళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐపీఈ.. 2014-15 నుంచి శామీర్‌పేటలో నిర్మించిన కొత్త క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. రూ.150 కోట్ల వ్యయంతో 21 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో నిర్మించిన ఈ క్యాంపస్‌లో విద్యార్థులకు అకడెమిక్‌గా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. 400 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయంతోపాటు.. 50 వేల పుస్తకాలు, రీసెర్చ్ పేపర్స్ అందుబాటులో ఉండేలా లైబ్రరీ, ఆడిటోరియం, సెమినార్ హాల్స్ నిర్మించారు. ప్లేస్‌మెంట్స్ ప్రొఫెషనల్ కోర్సులు, ఇన్స్టిట్యూట్లు అనగానే విద్యార్థులకు గుర్తొచ్చేది.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. ఈ విషయంలోనూ ఐపీఈ ప్రత్యేకతను చాటుకుంటోంది. రిటైల్ మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు పలు సంస్థలు నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా ప్రతి ఏటా 90 శాతంపైగా ఐపీఈ విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. 2012-14 బ్యాచ్‌కు మహీంద్రా ఫైనాన్స్ మొదలు.. డెలాయిట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థల వరకు దాదాపు 70 కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నిర్వహించాయి. సగటున రూ. 6లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్స్ అందించాయి. ప్రవేశం పాందాలంటే ఐపీఈ అందించే.. ఎంబీఏ తత్సమా న పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్/ ఎక్స్‌ఏటీ/ ఏటీఎంఏ/ మ్యాట్/సీమ్యాట్ స్కోర్ల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ కోర్సుకు మాత్రం ఈ అర్హతలతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. ప్రవేశ ప్రకటన మార్చి/ఏప్రిల్ ల్లో వెలువడుతుంది. వెబ్సైట్: www.ipeindia.org వినూత్న కోర్సులకు కేరాఫ్ ‘‘దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఐపీఈ.. ఆధునిక కోర్సులను ఆఫర్ చేసేందుకు కొత్త ప్రణాళికలు రూపొంది స్తోంది. మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని రిటైల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాం. విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్ అందించేందుకు సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. మేనేజ్మెంట్ కోర్సుల్లో ఎంతో కీలకమైన కేస్ స్టడీస్ అధ్యయనం విషయంలోనూ ప్రత్యేక శిక్షణనందిస్తున్నాం. ఇందుకు సంబంధించి రియల్‌టైం ఎక్స్‌పీరియెన్స్ లభించే విధంగా పలు పరిశ్రమలు, వ్యాపార సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నాం. రాష్ర్టంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించే విధంగా బోధనలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాం. క్యాట్/ ఏటీఎంఏ/ మ్యాట్/ ఐసెట్ ఉత్తీర్ణులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాం. మేనేజ్మెంట్ కోర్సుల పట్ల నిజమైన ఆసక్తి, ఆప్టిట్యూడ్ ఉన్న విద్యార్థులకు సరైన వేదిక.. ఐపీఈ’’ - ఆర్.కె. మిశ్రా, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ -
ఆసక్తి... అవకాశాలు
కోర్సు ఎంపికకు గీటురాళ్లు.. నేటి ప్రపంచీకరణ యుగంలో.. విద్యార్థుల ముంగిట ఎన్నో విద్యావకాశాలున్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్లే కాకుండా.. అనేక కోర్సులు ఆహ్వానం పలుకుతున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి రెగ్యులర్ కోర్సులతోపాటు ఫైన్ఆర్ట్స్, ఫ్యాషన్, లా కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. సిటీలో అకడమిక్ అడ్మిషన్స్ జరుగుతున్న తరుణంలో.. విద్యార్థులు ఆయా కోర్సులను ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి? ఆసక్తా.. అవకాశాలా.. జాబ్ మార్కెట్ ట్రెండ్సా..అమ్మానాన్నల మార్గనిర్దేశమా.. స్నేహితుల ప్రోద్బలమా.. తెలుసుకుందాం.. రెగ్యులర్ డిగ్రీ కోర్సైనా, కలర్‌ఫుల్ ఫ్యాషన్ టెక్నాలజీ అయినా.. కెరీర్ అవకాశాలకు ఆకాశమే హద్దు అంటున్నారు సిటీ విద్యార్థులు. విభిన్న కోర్సుల ఎంపికతో ఒక్కొక్కరు ఒక్కో కెరీర్ గమ్యాన్ని నిర్దేశించుకుంటున్నారు. ఎంచుకున్న కోర్సుపై ఆసక్తి, అభిరుచి ఉండి, కష్టపడి చదివితే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘చిన్నప్పటి నుంచి భవనాల నిర్మాణాలు, వాటి ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సుల్లో చేరాలనున్నాను. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి.. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ)లో చేరాన’ని పేర్కొంటున్నాడు.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సునభ్యసిస్తున్న మనీశ్ కుమార్. స్నేహితులందరూ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఎంచుకుంటున్నా.. తాను మాత్రం ఆర్కిటెక్చర్‌పై ఆసక్తితోనే ఈ కోర్సును ఎంచుకున్నానని తెలిపాడు. సృజనాత్మక నైపుణ్యాలుండి, ఫైన్ఆర్ట్స్లో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు యూనివర్సిటీతోపాటు నగరంలోని పలు కళాశాలలు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ‘ఫ్యాషన్’ కోర్సులు: ఫ్యాషన్ కెరీర్.. నేటి సిటీ విద్యార్థికి పాషన్(అమితమైన ఇష్టం)గా మారింది. ఇంటర్మీడియెట్ తర్వాత ఈ కోర్సులో ప్రవేశించడానికి పోటీ పెరుగుతోంది. ప్రధానంగా సిటీ స్టూడెంట్స్ ఈ కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ‘కాస్ట్యూమ్ డిజైనింగ్, టెక్స్టైల్ డిజైన్ అంటే ఆసక్తి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ ప్రారంభించాలనుకున్నా. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్), హైదరాబాద్‌లో చేరాన’ని తెలిపింది నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్‌లో నాలుగేళ్ల టెక్స్టైల్ డిజైన్ కోర్సునభ్యసిస్తున్న పి.అనిత. ఇంటర్మీడియెట్ తర్వాత ఫ్యాషన్ కోర్సులనభ్యసించాలనుకునే వారికోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆహ్వానం పలుకుతోంది. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఫ్యాషన్ రంగంలో ఉన్నత శిఖరాలనధిరోహించాలనుకునే వారికి సరైన వేదికగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని ఈ క్యాంపస్ ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో విభిన్న కోర్సులను ఆఫర్ చేస్తోంది. యాక్సెసరీస్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, అప్పరెల్ ప్రొడక్షన్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తోంది. వీటితోపాటు ఏడాది, ఆర్నెల్లు, మూడు నెలల కాలవ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. డిగ్రీలు-స్పెషలైజేషన్లు డిగ్రీ కోర్సుల్లోనూ వైవిధ్యమైన కోర్సులకే సిటీ స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు. బీకామ్ కంప్యూటర్స్, హానర్స్ కోర్సుల్లో ప్రవేశానికే ఎక్కువ మంది పోటీపడుతున్నారు. ‘స్పెషల్ సబ్జెక్టుల ద్వారా విస్తృత అవకాశాలు సొంతం చేసుకోవచ్చని భావించాను. అందుకే డిగ్రీలో బీకామ్ హానర్స్ గ్రూప్‌ను ఎంపిక చేసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే.. బీకామ్ హానర్స్ డిగ్రీకి.. ఎంకామ్‌తో సమానంగా అవకాశాలున్నాయనడంలో సందేహం లేదు’ అని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ - కోఠిలో బీకామ్ హానర్స్ కోర్సునభ్యసిస్తున్న సయీదా హఫ్సా ఫాతిమా వివరించారు. బీఎస్సీ, బీఏ, బీకామ్ రెగ్యులర్ కోర్సుల్లోనూ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు. సిటీలోని ప్రముఖ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ కాంబినేషన్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. శ్రీ డిగ్రీ కోర్సులకు డిమాండ్! గత రెండు మూడేళ్లుగా సాధారణ డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఇంటర్మీడియెట్‌లో 90 శాతం మార్కులకు పైగా సాధించిన వారు సైతం డిగ్రీ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా బీకామ్ జనరల్, కంప్యూటర్స్, బీఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లతోపాటు బీఎస్సీ కోర్సుల్లోనూ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఆధునిక ప్రపంచానికి తగినట్లుగా డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించడానికి ఆసక్తి చూపుతున్నాయి. అలాగే ఇంజనీరింగ్ తదితర సాంకేతిక కోర్సులకు దీటుగా డిగ్రీ కోర్సులకూ అవకాశాలుండడం వల్ల విద్యార్థులు వాటిపై మొగ్గుచూపుతున్నారు. - ప్రొ. జితేందర్ కుమార్ నాయక్, అకడమిక్ కోఆర్డినేటర్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కోఠి అవకాశాలు సమానం! బీఎస్సీ ఎంపీఈసీఎస్ గ్రూప్‌ను ఎంచుకున్నాను. ఇంటర్మీడియెట్‌లో 93శాతం మార్కులు సాధించాను. ఇంటర్ తర్వాత అకడమిక్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవడం సవాలుతో కూడుకున్న పని. ఇంజనీరింగ్‌లో చేరాలా.. లేక డిగ్రీ కోర్సునభ్యసించాలా? అని చాలా ఆలోచించా. ఇంట్లో అందరూ ఇంజనీరింగ్‌లో చేరాలని ఒత్తిడి చేశారు. అయినా చదివేది నేనే కాబట్టి నా ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా డిగ్రీలో చేరాను. మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులుగా ఉన్న ఎంపీఈసీఎస్ గ్రూప్‌లో చేరాను. కష్టపడి చదివితే నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సైనా, మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సైనా ఒక్కటేనని నా నమ్మకం. రెండింటిలోనూ అవకాశాలు సమానంగా ఉన్నాయనేది నా విశ్వాసం. అలాగే డిగ్రీ కోర్సుతో ఒక ఏడాది సమయం కూడా కలిసొస్తుంది. - ఇ.మేఘన, బీఎస్సీ మొదటి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కోఠి