సిటీ స్టూడెంట్స్.. కోరికల చిట్టా! | Council helps City students improve their cycling skills | Sakshi
Sakshi News home page

సిటీ స్టూడెంట్స్.. కోరికల చిట్టా!

Published Sun, Aug 3 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

సిటీ స్టూడెంట్స్.. కోరికల చిట్టా!

సిటీ స్టూడెంట్స్.. కోరికల చిట్టా!

నగరంలోని ప్రముఖ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సంప్రదాయ కోర్సుల్లో  చదివేవారు కొందరైతే.. విభిన్న కోర్సులను ఎంపిక చేసుకొని వైవిధ్యమైన కెరీర్‌లో అడుగుపెట్టేవారు మరికొందరు. తమ అభిరుచులకు, ఆసక్తులకు పెద్దపీట వేస్తూ వినూత్న పంథాలో దూసుకెళ్తున్న సిటీ స్టూడెంట్స్.. విద్యావిధానంలో తామేం కోరుకుంటున్నారో కుండబద్ధలు కొడుతున్నారు. కొత్త విద్యాసంవత్సరంలో సిటీ విద్యార్థుల ఆలోచనలేంటో చూద్దాం..
 
ప్రవేశ పరీక్షల సంఖ్య తగ్గాలి!
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో చేరాలంటే.. ఆయా బోర్డులు, విద్యాసంస్థలు నిర్వహించే అనేక ప్రవేశ పరీక్షలను రాయాల్సిందే. పలు పరీక్షల సిలబస్‌లో వ్యత్యాసాలు, పరీక్ష విధానాల్లో తేడా ఉండడంతో విద్యార్థి దేనిపైనా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. అందుకే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకే నగర విద్యార్థి మొగ్గు చూపుతున్నాడు. ‘ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఎంసెట్, జేఈఈ-మెయిన్, బిట్‌శాట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాశాను.
 
వివిధ రకాల ఎంట్రెన్స్‌లు, వాటి విభిన్న సిలబస్‌లను ఒకే సమయంలో సన్నద్ధమవడం కష్టమైంది. పరీక్ష తేదీలు కూడా వారం రోజుల వ్యవధిలోనే ఉండడం వల్ల ఆందోళన చెందాను. ఫలితంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. ఎంసెట్ ప్రిపరేషన్‌కైనా ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుండేదనిపించింది’ అని ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న కీర్తిరెడ్డి చెప్పాడు. ఉమ్మడి ఎంట్రెన్స్‌తోపాటు కామన్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రవేశ పెట్టాలని సిటీ  విద్యార్థులు కోరుకుంటున్నారు.
 
ఆన్‌లైన్ రిసోర్సెస్:
క్లాస్ రూమ్ పాఠాలకు ఆన్‌లైన్ గెడైన్స్ కూడా తోడైతే అకడమిక్‌గా మంచి ఫలితాలను సాధించొచ్చు. యూనివర్సిటీలు, కళాశాలలు సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్ని, ప్రిపరేషన్ మెళకువలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం విద్యార్థి లోకంలో వ్యక్తమవుతోంది. ‘ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, గెడైన్స్, మాక్, ఆన్‌లైన్ పరీక్షలు చాలా వెబ్‌సైట్లలో లభిస్తున్నాయి. అలాగే ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన మెటీరియల్, జాబ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గెడైన్స్, మాదిరి ప్రశ్నలు, సంబంధిత మెటీరియల్‌ను అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’ అని ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్న వై.హర్షిత్ తెలిపాడు.
 
 ప్రమాణాలు పాటించాలి:
 రాష్ట్రంలో కళాశాలల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. నాణ్యమైన విద్యనందించే విద్యాసంస్థల కొరత మాత్రం అలాగే ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, ప్రముఖ విద్యాసంస్థలు మినహా చాలా కాలేజీలు కనీస ప్రమాణాలను కూడా పాటించడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల నుంచి ఆదరణ లేక సీట్ల భర్తీకి కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. ‘ఎంసెట్ ర్యాంకులు పొందిన తర్వాత రోజు నుంచే కన్సల్టెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నారు. తాము సూచించిన కాలేజీలో చేరాలని కోరుతున్నారు.
 
 కన్వీనర్ కోటా కంటే తక్కువ ఫీజులకే అడ్మిషన్ ఇప్పిస్తామని, ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు’ అని ఇంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థి జె.శ్రీధర్ తెలిపాడు. తగిన మౌలిక సదుపాయాలను కల్పించి, బోధన, ప్రయోగశాలల్లో నాణ్యతను పాటిస్తే.. విద్యార్థులే కళాశాలను వెతుక్కుంటూ వెళ్తారని స్టూడెంట్స్ పేర్కొంటున్నారు. అన్ని సదుపాయాలుంటేనే కొత్త కళాశాలలు, కోర్సులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని సూచిస్తున్నారు.
 
 ఇండస్ట్రీ రిలవెంట్ సిలబస్:
 యూనివర్సిటీలు మారుతున్న జాబ్‌మార్కెట్‌కు అనుగుణంగా కరిక్యులంలో మార్పులు తీసుకురావాలి. పరిశ్రమ అవసరాలకు సరితూగే రీతిలో దాన్ని రూపొందించాలి. బోధన కూడా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. కరిక్యులాన్ని పక్కాగా ప్రిపేర్ అయితే జాబ్ సొంతమవుతుందనే నమ్మకం ఉండాలి అని పలువురు అభిప్రాయ పడ్డారు. ‘కోర్సులో భాగంగా అభ్యసించే సబ్జెక్టులకు, ఆ తర్వాత చేసే కొలువుకు సంబంధం ఉండదని  అంటున్నారు. ఎలాంటి ఉద్యోగానికైనా ఉపయుక్తంగా ఉండేలా కరిక్యులంను రూపొందిస్తే ఆ సమస్య ఉండదు కదా!’ అంటున్నాడు బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కిశోర్. అదేవిధంగా కాలేజ్-ఇండస్ట్రీ సంయుక్తంగా కోర్సులను ఆఫర్ చేస్తే మరింత మేలు జరుగుతుందని ఎక్కువ మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.  
 
ఇంటర్న్‌షిప్స్: ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తే మంచి అవకాశాలుంటాయి.. భవిష్యత్తు లో చేరబోయే కంపెనీలో పని వాతావరణాన్ని ముందే తెలుసుకోవచ్చు.. ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతమవుతుంది. లోటుపాట్లను సవరిం చుకుని అకడమిక్‌గా మరింత రాణించొచ్చు- అనేది  విద్యార్థులకు నిపుణులు తరచూ ఇచ్చే సలహా. ‘ఇంటర్న్‌షిప్ విషయంలో విద్యార్థులకు సరైన సమాచారం అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయంలో కళాశాలలు, కంపెనీలు విద్యార్థులకు తగిన తోడ్పాటునందించాలి. విద్యార్థుల అవసరాల రీత్యా ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేయడానికి కంపెనీలు ముందుకు రావాలి’ అని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రెహానా పేర్కొన్నారు.  
 
 దరఖాస్తులు-ఫీజులు:
 మంచి కళాశాలలో చేరాలంటే.. మధ్యతరగతి విద్యార్థికి తలకు మించిన భార మవుతోంది. రకరకాల ఎంట్రెన్స్‌లు, దరఖాస్తు రుసుముల దగ్గర్నుంచి అడ్మిషన్ ఫీజులు, కోర్సు ఫీజులు, ఆ తర్వాత పరీక్ష ఫీజుల వర కూ.. విద్యార్థులు పలు రకాల ఫీజులను చెల్లించాల్సి వస్తోంది. ఇక ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ తదితర కోర్సుల ఫీజుల గురించి తెలిసిందే. కాబట్టి విద్యార్థులపై భారం తగ్గించాలని, తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్య లభించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 
 కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి!
 సిటీ స్టూడెంట్స్‌లో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే.  వారు ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. నగరంలో అందుబాటులో ఉన్న అవకాశాల సమాచారాన్ని తెలుసుకోవాలి. తక్కువ ఫీజులకే కోర్సులను ఆఫర్ చేస్తున్న రామకృష్ణ మఠ్ వంటి వాటిలో చేరి నైపుణ్యాలను పెంచుకోవచ్చు. అలాగే నగరంలో అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థలపై అవగాహన పెంచుకోవాలి. చదువుతోపాటే ఇతర స్కిల్స్‌నూ వృద్ధి చేసుకోవాలి.
 - జి. సుధాకర్
 సైకాలజీ విద్యార్థి, నిజాం కళాశాల

 
 విద్యార్థినులకు భద్రత కావాలి!
 సిటీలో విద్యార్థినులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. వారి భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మహిళలకు కేటాయించిన  ఆర్టీసీ బస్సుల సంఖ్యను కళాశాలల సమయా ల్లో పెంచాలి. కోర్సులు, ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేలా కళాశాలలు చర్యలు తీసుకోవాలి.
 - సయేదా హఫ్సా ఫాతిమా,
 బీకామ్ హానర్స్ ఫైనల్ ఇయర్,
 కోఠి ఉమెన్స్ కళాశాల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement