పనిచేసేచోట కమ్యూనికేషన్ ఇలా..
కార్యాలయంలో ఉత్పత్తి పెరగాలంటే, పై అధికారులతో, సహచరులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలి. దీనికోసం ఉద్యోగులు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవడం మేలు. ఇందుకోసం ఏం చేయాలంటే..
ఇతరులను పరిశీలించండి
ఆఫీస్‌లో సహచరులను మెప్పించేలా మాట్లాడాలంటే.. మొదట వారు ఎలా మాట్లాడుతున్నారో పరిశీలించి, అర్థం చేసుకోవాలి. వారి కమ్యూనికేషన్ విధానాన్ని తెలుసుకోవాలి. తదనుగుణంగా సంభాషించాలి. ఉదాహరణకు ఒకరు నేరుగా విషయంలోకి రావడాన్ని ఇష్టపడతారు. మరొకరు మొదట ఏదైనా మాట్లాడిన తర్వాతే అసలు విషయంలోకి దిగుతారు. వ్యక్తుల కమ్యూనికేషన్ స్టైల్‌ను తెలుసుకొని, వారితో అలాగే మాట్లాడితే సంభాషణ విజయవంతమవుతుంది.
స్పష్టత, కచ్చితత్వం, సంపూర్ణం
మన మాట అవతలివారికి సరిగ్గా అర్థం కాకపోతే అనర్థాలు తలెత్తుతాయి. కాబట్టి చెప్పే విషయంలో స్పష్టత, కచ్చితత్వం ఉండాలి. అసంపూర్తిగా కాకుండా సంపూర్ణంగా చెప్పేయాలి. ఆఫీస్‌లో సంభాషణల ప్రధాన ఉద్దేశం.. పని సక్రమంగా జరగడం, తద్వారా ఉత్పత్తి పెరగడం. కమ్యూనికేషన్ అనేది రాతపూర్వకంగా లేదా మాటల ద్వారా.. ఎలాగైనా కావొచ్చు. కానీ, చెప్పే విషయంలో స్పష్టత తప్పనిసరి. మీరిచ్చే సమాచారం లేనిపోని గందరగోళానికి దారితీసేలా అస్పష్టంగా ఉండకూడదు.
సందర్భానికి తగిన మాధ్యమం.. : కమ్యూనికేషన్‌లో సందర్భానికి తగిన మాధ్యమాన్ని ఎంచుకోవాలి. సందేశం క్లుప్తంగా ఉండి, అవతలివారికి త్వరగా చేరవేయాలనుకుంటే ఈ-మెయిల్ ద్వారా పంపించాలి. ఎక్కువ సేపు విపులంగా చర్చించాలనుకుంటే వ్యక్తిగతంగా సమావేశమవ్వాలి లేదా ఫోన్‌లో మాట్లాడాలి. కాంట్రాక్ట్‌లు, ఒప్పందాలు వంటి కీలకమైన విషయాలు రాతపూర్వకంగా సాగాలి.
శరీరమూ మాట్లాడాలి
మన భావాన్ని మాటలతోనే కాదు శరీర కదలికలతోనూ చెప్పొచ్చు. దీన్నే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ శరీర భంగిమలను పరిశీలించుకోండి. మిమ్మల్ని చూస్తే వారికి ప్రతికూల భావం కలగకుండా ప్రొఫెషనల్‌గా వ్యవహరించండి. వారిని ఆకర్షించే చక్కటి బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించండి.
ఒక సమయంలో ఒకేపని
ఈ-మెయిల్ చూస్తూ ఫోన్‌లో మాట్లాడటం వంటి ఏకకాలంలో బహుళ కార్యాలకు స్వస్తి చెప్పండి. లేకుంటే దేనికీ సరైన న్యాయం చేయలేరు.
వినే అలవాటు ఉందా?
ఇరువురి మధ్య భావ ప్రసారానికి ప్రధానంగా కావాల్సింది.. ఓపిగ్గా వినే అలవాటు. ఇతరులు చెప్పేది పూర్తిగా వినే లక్షణం చాలా ముఖ్యం.
ఎడ్యూ న్యూస్: సీఎఫ్‌ఆర్‌డీ..
ఓయూ క్యాంపస్ సాఫ్ట్‌వేర్ ఎగ్జిబిషన్
ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్‌చ అండ్ డెవలప్‌మెంట్(సీఎఫ్‌ఆర్‌డీ) విభాగంలో గురువారం ‘‘ లేటెస్ట్ సైంటిఫిక్ ప్రొడక్ట్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఎగ్జిబిషన్-2014’ నిర్వహించారు. యూనివర్సిటీలో తొలిసారి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయాలజీ తదితర అంశాల్లో పరిశోధన చేస్తున్న వారికి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్న పలు ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. సీఎఫ్‌ఆర్‌డీలోని పరిశోధనశాలలోకి కేవలం ఓయూ విద్యార్థులే కాకుండా బయటి కళాశాలల యువ పరిశోధకులు, పరిశ్రమ వర్గాలకు కూడా ప్రవేశం ఉన్నట్లు సంస్థ డెరైక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని పలుకళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వివరాలకు cfrd.osmania.ac.in సంప్రదించవచ్చు.