‘మాతృభాష’ను మురిపిస్తాం
సెంట్రల్ యూనివర్సిటీ: సెంట్రల్ యూనివర్సిటీ అనగానే ఇంగ్లిష్ వ్యవహారంతో కూడిన చదువులు గుర్తొస్తుంటాయి. ఉద్యోగ అవకాశాలుంటాయని నేటి యువత కూడా వాటివైపే ఆసక్తి చూపిస్తుంటారు. మాతృభాషపై మమకారం చంపుకొక మరికొందరు లింగ్విస్టిక్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఇదే కోవలో మన సిటీ విద్యార్థులు కనుమరుగవుతున్న తెలుగు, ఉర్దూ భాషలకు జీవం పోసేందుకు పీహెచ్‌డీలు చేస్తున్నారు.
మరికొందరు పీజీలో తెలుగు, ఉర్దూ భాషలను ఎంచుకొని కన్వకేషన్ పొందుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడి ప్రభుత్వాలు తెలుగు, ఉర్దూకు ప్రాధాన్యమిచ్చి మన భాషను భావితరాలకు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉద్యోగవకాశాలు లేకున్నా మాతృభాష కోర్సులను ఎంచుకున్నామంటున్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన 16వ స్నాతకోత్సవంలో తెలుగు, ఉర్దూ భాషల్లో పట్టాలు అందుకున్న విద్యార్థులతో ‘సాక్షి’ ముచ్చటించింది.
మీడియా చొరవ చూపాలి
‘మాది మహబూబ్‌నగర్. నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచే తెలుగంటే ఇష్టం. అనేక కష్టనష్టాలు ఒర్చుకొని ఎంఏ తెలుగు చేశా. ఈ రోజు పీహెచ్‌డీలో హెచ్‌సీయూ నుంచి పట్టా అందుకున్నా. ‘పాలమూరు జిల్లా క్షేత్ర మహత్య పద్య కావ్యాలు అనుశీలన’పై చేసిన పరిశోధనకు ఈ గౌరవం దక్కింది. హెచ్‌సీయూలోనే తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృధ్ధి కోసం కృషి చేస్తా. కనమరుగువుతున్న తెలుగును బతికించాలంటే ప్రభుత్వంతో పాటు మీడియా కూడా చొరవ తీసుకోవల్సిన అవసరముందని వికలాంగుడైన శ్యామ్ సుందర్ తెలిపారు.
తెలుగంటే ప్రాణం
‘మాది తూర్పుగోదావరి జిల్లా. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నా. అమ్మనాన్నల మద్దతుతో ఈ రోజు పీహెచ్‌డీ పట్టా సాధించగలిగా. తెలుగు నిఘంటువుల ఆరోపాల అధ్యయనం చేశా. బాసర ఐఐఐటీలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృద్ధి కోసం కృషి చేస్తా. తెలుగును బతికించేందుకు అందరం కృషి చేయాలని దోమలగూడలో ఉంటున్న కొమండూరి విజయభాను తెలిపారు.
ఉర్దూ భాష గొప్పతనం చెబుతా
రోజు ఉర్దూ భాషలో పీహెచ్‌డీ పట్టా పొందానంటే అందుకు మా కుటుంబసభ్యుల సహకారం ఉంది. రోజురోజుకు కనమరుగువుతన్న ఈ భాషను మళ్లీ గాడిలో పెట్టేందుకు నా వంతు కృషి చేస్తా. పిల్లలకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరిస్తా. ఇందుకోసం ప్రతి పాఠశాలలో సెమినార్‌లు నిర్వహిస్తానని ఎల్‌బీ నగర్‌లో ఉంటున్న గృహిణి జరీన్‌ఖాన్ తెలిపారు.
సిటీలో ఆదరణ ఉంది
‘సిటీలో ఉర్దూకు మంచి ఆదరణ ఉంది. భారీ సంఖ్యలో మైనారిటీలున్నా ఆ భాషకు తగిన ప్రాచుర్యం లేదు. ఉద్యోగవకాశాలు తక్కువగా ఉండడం కూడా ఈ భాషపై యువతకు నిరాసక్తత కలిగించేలా చేస్తోంది. అయితే యువతకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం నా వంతుగా చేస్తా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటే బాగుంటుంద’ని ఉర్దూ భాషలో పీహెచ్‌డీ పట్టా పొందిన సిటీకి చెందిన గౌసియా భాను తెలిపారు.