మెట్రో స్టూడెంట్స్... మెచ్చే కెరీర్స్! | Metro Students like the Careers | Sakshi
Sakshi News home page

మెట్రో స్టూడెంట్స్... మెచ్చే కెరీర్స్!

Published Wed, Jul 2 2014 12:30 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

మెట్రో స్టూడెంట్స్... మెచ్చే కెరీర్స్! - Sakshi

మెట్రో స్టూడెంట్స్... మెచ్చే కెరీర్స్!

ఉదయం 5 గంటలు... ఇటీవలే 10+2 పూర్తి చేసిన రాజేష్... సూర్యోదయపు కాంతిలోని అందమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమవుతున్నాడు...

 సంగీత.. ఇంటర్ చదువుతోంది... మరోవైపు మనసుపెట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది..!
 వరుణ్.. పదో తరగతి జస్ట్ కంప్లీటెడ్... కుంచెతో తదేకంగా అందమైన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాడు..
 ఇలా.. చెప్పుకుంటూ పోతే ఎందరో..!! వీరంతా  ఏదో హాబీగానో.. తాత్కాలిక ఆసక్తి తోనో.. లేదా సరదాగానో... ఈ వ్యాపకాలను సొంతం చేసుకోలేదు... ఫోటోగ్రపీ.. డ్యాన్స్.. చిత్రలేఖనం.. ఇవి నేటి యువత కెరీర్ ఆప్షన్స్!... ముఖ్యంగా మెట్రో విద్యార్థి మెచ్చే  ఆఫ్‌బీట్ కెరీర్స్.
 
ఇంటర్ పూర్తికాగానే.. ఇంజనీరింగ్.. మెడిసిన్.. ఐఐటీలు.. నిట్‌లు... ఎయిమ్స్.. ఇవే నేడు ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యాలు..! ఎక్కువ మంది క్రేజీ కోర్సులవైపు పరుగులు తీస్తుంటే.. . అందరూ నడిచే మార్గం నాకసలే నచ్చదురో అంటూ... క్రియేటివ్ కోర్సులవైపు అడుగులేస్తున్నారు.. మరికొంతమంది. తమకు ఆసక్తి ఉన్న అంశాన్నే భవిష్యత్ కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మెట్రో స్టూడెంట్స్ ఆఫ్‌బీట్ కోర్సులకు వారి తల్లిదండ్రులూ బాసటగా నిలుస్తుండటం ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌గా మారింది. గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్, లేదా కనీసం ఏదైనా విభాగంలో సంప్రదాయ డిగ్రీ అయినా చేయాలని గట్టిగా కోరుకునేవారు.  కనీసం డిగ్రీ ఉంటే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారనేది వారి భావన. ఇప్పుడు అమ్మానాన్నల ఆలోచన ధోరణి మారింది. తమ అభిప్రాయాలను బిడ్డలపై రద్దడం లేదు. పిల్లల ఆసక్తులకు విలువ ఇస్తున్నారు. పైన పేర్కొన్న రాజేశ్, సంగీత, వరుణ్ విషయంలో అదే జరిగింది. తమ ఆసక్తుల మేరకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను వారి తల్లిదండ్రులు ఇచ్చారు.
 
భిన్నంగా ఆలోచిస్తున్నారు:
టెన్త్, 10+2 పూర్తిచేసిన చాలామంది విద్యార్థులు.. ఏదో ఒక చట్రంలో ఉండి పోవాలనుకోవడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం 9 టు 5 అనే పని వేళలకు భిన్నంగా.. తమ ఆలోచనల మేరకు ఎటువంటి ఒత్తిళ్లు, పరిమితులు లేకుండా స్వతంత్రంగా పని చేసే వైవిధ్యమైన రంగాన్ని కెరీర్‌గా కోరుకుంటున్నారు. ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకుంటున్నారు.
 
వేదికలివే: మారిన అభిరుచులు, శరవేగంగా వస్తున్న మార్పులు, అంతకంటే వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ యుగంలో.. వైవిధ్యమైన కెరీర్స్‌కు.. ఫొటోగ్రఫీ, డీజేయింగ్(డీజే), జ్యూయలరీ డిజైనింగ్, ఫుట్‌వేర్ డిజైనింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్ వంటి రంగాలు వేదికలు నిలుస్తున్నాయి. ప్రస్తుత యుగంలో వీటికి మంచి  డిమాండ్ ఉంది. ఇవి కూడా ఏదో ఒక విభాగానికి పరిమితం కాకుండా.. ఆలోచనల మేరకు సృజనాత్మక సామర్థ్యానికి పదునుపెట్టే ఎన్నో ఉపవిభాగాలు వీటిలో ఆవిర్భవిస్తున్నాయి. ఉదాహరణకు డిజైన్ రంగంలో ఇంటీరియర్ డిజైనర్, వెబ్ డిజైనర్, బ్రాండ్ డిజైనర్, విజువల్ మర్కండైజర్, ఎగ్జిబిషన్ డిజైనర్, ఈవెంట్ డిజైనర్, క్రియేటివ్ డిజైనర్ వంటివి ఉంటాయి. ఇదే కోవలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో.. టెక్స్‌టైల్ డిజైనర్, జ్యూయలరీ డిజైనర్, ఈవెంట్ మేనేజర్, ఫ్యాషన్ జర్నలిస్ట్, స్టైలిస్ట్, యాక్సెసరీ డిజైనర్స్ వంటివి ఉపవిభాగాలు. ఆర్టిస్ట్ విభాగంలో క్రియేటివ్ ఆర్టిస్ట్, కమర్షియల్ ఆర్టిస్ట్, యానిమేషన్ ఎక్స్‌పర్ట్, ఫిల్మ్ మేకర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్, కాపీ రైటర్స్ వంటి స్పెషలజైషన్ల హవా కొనసాగుతోంది. బిజినెస్ డిజైన్‌లో ఫ్యాషన్ ఈ-రిటైలర్, డిజిటల్ మార్కెటర్, సోషల్ మీడియా మేనేజర్, బ్రాండ్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, మర్కండైజర్, బయ్యర్ వంటి ఉప విభాగాలు ఉంటాయి.
 
నైపుణ్యాలు అవసరం: క్రియేటివ్ కోర్సుల్లో రాణించాలంటే.. నైపుణ్యాలు అవసరం. దాంతోపాటు ఆసక్తి, సృజనాత్మకత కావాలి. అంతకుమించి నిబద్ధతతో ఉండాలి. కోర్సులో చేరిన తర్వాత బోధించే అంశాలు కూడా సృజనాత్మకతను మరింత పెంచేలా ఉంటాయి. మీలో ఎంత సృజనాత్మకత ఉంటే.. అంత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అంతేకాకుండా సొంతంగా తమ ఆలోచనల మేరకు స్వతంత్రంగా స్టూడియో/బోటిక్ స్థాపించుకోవడం ద్వారా కార్యకలాపాలను నిర్వహించవచ్చు.  ఈ అంశం కూడా ఇటువంటి సృజనాత్మక రంగాలపై యువత దృష్టి సారించడానికి కారణమవుతోంది.

అవకాశాలు: క్రియేటివ్ కోర్సులకుండే మరో ప్రత్యేకత చదువుకుంటూనే సంపాదించ వచ్చు. ఇక్కడ విద్యార్థి నైపుణ్యం ఆధారంగా సంపాదన ఉంటుంది.  ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు బ్యాచిలర్ కోర్సులకు మాత్రమే పరిమితం కాదు. మాస్టర్ కోర్సులను అభ్యసించడం ద్వారా మరిన్ని అవకాశాలను దక్కించుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇండస్ట్రియల్, అడ్వర్‌టైజింగ్ సంబంధిత రంగాల్లో విస్తృత అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పెయింటింగ్, కమర్షియల్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు కూడా ఈ అంశం చాలా కలిసి వచ్చింది. వీరికి ముఖ్యంగా మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు, అడ్వర్‌టైజింగ్, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, ఫొటోగ్రఫీ, సంగీతం, నృత్య విభాగాల అభ్యర్థులు టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా స్థిరపడొచ్చు. ప్రభుత్వ విభాగాల విషయానికొస్తే.. ట్రైబల్ వేల్పేర్ డిపార్ట్‌మెంట్, దూరదర్శన్, ఆకాశవాణి, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్లలో అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, స్కల్ప్చర్,  మ్యూజిక్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో కాంట్రాక్ట్‌బేస్డ్ పద్ధతిలో పని చేయవచ్చు. సొంతంగా ఆర్ట్ గ్యాలరీలను నెలకొల్పడం, ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించడం వంటి వాటి ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. వివిధ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లలో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్‌గా సేవలు అందించవచ్చు. సొంతంగా మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ స్కూళ్లను స్థాపించవచ్చు. సంబంధిత రంగంపై రచనలు చేయడం, విమర్శనాత్మక వ్యాసాలు రాయడం, నూతనంగా వస్తున్న మార్పులను వివరించడం వంటి అంశాలపై  వివిధ పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తూ కూడా ఉపాధిని పొందొచ్చు.
 
వేతనాలు: అడ్వర్‌టైజింగ్  ఏజెన్సీలు, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి వేతనం నెలకు రూ.8 వేల-రూ.20 వేల వరకు ఉంటుంది. తర్వాత హోదాను బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేలకు సంపాదించవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రారంభంలో రూ.12 వేల నుంచి రూ. 25వేల వరకు ఆర్జించవచ్చు. థియేటర్, డ్రామా, ప్రొడక్షన్ హౌసెస్‌లలో ప్రారంభంలో రూ. 8 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement