అమ్మకు చారల చీర | Strong and confident girl | Sakshi
Sakshi News home page

అమ్మకు చారల చీర

Published Tue, Jan 12 2016 11:26 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

అమ్మకు చారల చీర - Sakshi

అమ్మకు చారల చీర

అమ్మ పుట్టినరోజుకి మనం ఏమీ కొనిపెట్టం.
 అసలు అమ్మ పుట్టినరోజు మర్చిపోతాం కూడా!
 కానీ అమ్మ చనిపోయిన రోజును
 ఎవ్వరం మర్చిపోలేం.
 నేహ తన తల్లి చనిపోవడానికి కారణమైన
 ఒక స్పీడ్‌బ్రేకర్ మీద...
 అది కనిపించేలా చారలు పూయడానికి
 పోరాడింది!
 అదే తను తన అమ్మకు ఇచ్చిన చారల చీర!

 
అమ్మ.. నాన్న..  అమ్మాయి.. ఓ మరాఠీ ఫ్యామిలీ! ఆ నాన్న పేరు వివేక్ చరాటి. చిన్న వ్యాపారి. అమ్మ.. వీణ... బ్యాంక్ క్యాషియర్. స్వతంత్ర భావాలు గల వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక మహిళకు ప్రతీక. అమ్మాయి నేహ. అకోలాలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది హాస్టల్లో ఉంటూ! అమ్మ మాత్రం కూతుర్ని స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గర్ల్‌గా చూడాలనుకుంటోంది. అనుకోవడమే కాదు అలా పెంచుతోంది కూడా! అందుకే  మూడో ఏట నుంచే ఫుట్‌బాల్, వాలీబాల్, బాడ్మింటన్ ఆడించడం మొదలుపెట్టింది. ఏడో యేట సైకిల్ నేర్పించింది. పన్నెండో యేట టూ వీలర్ నడిపేలా చేసింది.  వీళ్లుండేది మహారాష్ట్ర.. అకోలా జిల్లాలోని గాధింగ్లాజ్ అనే చిన్న టౌన్‌లో. ఆ ఊళ్లో బ్యాంక్‌లో పనిచేస్తున్న తొలి, ఏకైక మహిళా ఉద్యోగి వీణే. అలాగే ఫుట్‌బాల్, వాలీబాల్, బాడ్మింటన్ లాంటి ఆటలు ఆడే ఏకైక అమ్మాయి కూడా నేహే. బంధువుల దగ్గర్నుంచి ఇరుగుపొరుగు దాకా ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోకుండా తాను నిలబడింది.. కూతురూ నిలబడేలా  చేసింది వీణ. అందుకే ఆ ఊళ్లోని విద్యావంతులకు, సాహిత్యకారులకు, చివరికి బ్యాంక్‌కు వచ్చే గ్రామీణ ఖాతాదారులకూ వీణ అంటే ఎనలేని గౌరవం.. అభిమానం!
   
హైదరాబాద్ రింగ్ రోడ్డులో ఘోరమైన యాక్సిడెంట్! హైదరాబాద్ - విజయవాడ హైవే దాదాపు ప్రతిరోజూ నెత్తురోడుతూనే ఉంటుంది. నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014వలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు నాలుగున్నర లక్షల పైనే! మృత్యువాతపడ్డవారు వారు లక్షా 41 వేల 526 మంది. రోజుకి 12 వందల యాక్సిడెంట్లు నమోదవుతున్నాయి. హలో.. మహారాష్ట్రలోని చింతలులేని ఆ చిన్న కుటుంబానికి.. దేశంలోని ఈ రోడ్డు ప్రమాదాలకు ఏంటీ సంబంధం? వాళ్ల గురించి చెప్తూ  హఠాత్తుగా ఈ యాక్సిడెంట్ల గోలేంటి? అని కన్నెర్ర చేసుకోకండి. సంబంధం ఉంది. కాబట్టే ఈ ఇంటరప్షన్! సావధానంగా సాగండి.
 
స్పీడ్ బ్రేకర్...

వీణ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పుకున్నాం కదా! ప్రతిరోజు ఆమె భర్త వివేక్ స్కూటర్ మీద వీణను బ్యాంక్ దగ్గర దింపి తన వ్యాపార పనులకు వెళ్లిపోతాడు. ఎప్పటిలాగే 2015.. అక్టోబర్ 4.. ఉదయం కూడా ఆ జంట బయలుదేరింది. ఊళ్లోని మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీస్ ముందుకు వచ్చారు. వీళ్ల స్కూటర్ వెనకాలే యమస్పీడ్‌గా ఓ ఇన్నోవా దూసుకొస్తోంది. రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూశాడు వివేక్. ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది. దాటి బండిని పక్కకు తీసుకొని ఇన్నోవాకు దారిద్దామనుకున్నాడు. స్కూటర్‌ను కొంచెం స్లో చేసి స్పీడ్‌బ్రేకర్ దాటిస్తున్నాడు. వెనక వీల్ స్పీడ్ బ్రేకర్ దిగబోతోంది.. అంతలోకే ఇన్నోవా రావడమూ.. దగ్గరికి వస్తేగానీ కనిపించని స్పీడ్‌బ్రేకర్‌ని ఇన్నోవా డ్రైవర్ చూడ్డం.. సడన్‌గా హ్యాండ్ బ్రేక్ వేసినా వేగం అదుపుకాలేకపోవడం...స్కూటర్‌ను ఢీ కొట్టడం.. బండికి అటువైపు వివేక్.. ఇటువైపు వీణ కిందపడడమూ.. ఆమె కడుపు మీదనుంచి ఇన్నోవా వెళ్లిపోవడమూ క్షణంలో జరిగాయి.
 
హార్ట్ బ్రోకెన్
 వివేక్‌ను, వీణను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వివేక్‌కు స్వల్పగాయాలయ్యాయి. వీణకు మాత్రం  కుడిపక్క ఎముకలన్నీ విరిగిపోయాయి. పేగులు నుజ్జునుజ్జయ్యాయి. పొట్టలో రక్తస్రావం అవుతుంటే ‘ఇక్కడ చికిత్స చేయలేం.. దగ్గర్లోని బెల్గామ్ టౌన్‌కి తీసుకెళ్లండి’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అమ్మానాన్నలకు అయిన యాక్సిడెంట్ గురించి అకోలాలో ఉన్న నేహకు కబురు పంపారు బంధువులు. పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అమ్మ వీణ.. బెల్గాం చేరకుండానే మార్గమధ్యంలోనే దేవుడిని చేరుకుంది.  కుప్పకూలిపోయారు వివేక్, నేహ!
 
మూణ్ణెల్లయినా...
ధైర్యాన్ని ఉగ్గుపాలతో పెట్టి పెంచిన అమ్మ.. ఆడపిల్లగా కాకుండా మనిషిగా ఎలా బతకాలో నేర్పిన టీచరమ్మ.. తన కాళ్ల మీద తను నిలబడి చూపించిన రోల్‌మోడల్ మరణం నేహను కుంగదీసింది. తండ్రి కొద్దిగా కోలుకున్నా నేహ ఆ డిప్రెషన్‌లోంచి బయటపడలేక పోయింది. చదువు మీద ధ్యాస కుదరడం లేదు. 24 గంటలూ అమ్మ తాలూకు జ్ఞాపకాలే. అమ్మ పోయినప్పుడు పరామర్శకు వచ్చిన చుట్టాలు, స్నేహితులు ‘అక్కడ ఆ స్పీడ్ బ్రేకర్ లేకుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. దానివల్లే వీణ చనిపోయింది. కనీకనిపించనట్టున్న ఆ స్పీడ్‌బ్రేకర్ గతంలోనూ చాలామందినే పొట్టనపెట్టుకుంది’ అని అన్న మాటలు పదేపదే గుర్తుకురాసాగాయి నేహకు. నిజమే.. ఆ స్పీడ్‌బ్రేకర్ కనిపించేట్టు ఉంటే వెనకాల ఇన్నోవా స్పీడ్ తగ్గేది.. యాక్సిడెంట్ కాకపోయేది.. అమ్మ బతికేది! అనుకుంది చాలాసార్లు. ఆ స్పీడ్‌బ్రేకర్ ఇలాగే చాలామందిని పొట్టనపెట్టుకుంది అన్న మాట మాత్రం మెదడులో ఆలోచనల్ని రేకెత్తించసాగింది.
 
స్నేహితులతో కలిసి..
మూడునెలల తర్వాత ఒకరోజు బయటకు వచ్చింది నేహ.. స్నేహితులను కలిసేందుకు. తనకు వచ్చిన ఐడియాను పంచుకుంది. వాళ్లూ ఓకే అన్నారు. ఆ ఐడియాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. తర్వాత  మున్సిపల్ ఆఫీస్ అథారిటీస్‌కు దరఖాస్తు రాశారు.. మున్సిపల్ ఆఫీస్ ముందున్న స్పీడ్ బ్రేకర్ కారణంగా ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి? ఎంతమంది చనిపోయారు? తాజా ప్రమాదంలో తన తల్లి మరణించడం.. వంటి వివరాలన్నిటినీ తెలుపుతూ, కాబట్టి ఆ స్పీడ్‌బ్రేకర్ స్పష్టంగా కనిపించేలా దానికి పెయింట్ వేద్దామనుకుంటున్నామని, దానివల్ల ప్రమాదాలను అరికట్టవచ్చనే విజ్ఞాపననూ జోడిస్తూ!
 
నిరసన.. ధర్నా..
మున్సిపల్ అధికారులు ఆ దరఖాస్తుని చదివి నిర్లక్ష్యంగా చెత్తబుట్టలో వేశారు. జవాబు రాకపోయేసరికి గాధింగ్లాజ్‌లో ఉన్న నేహ స్నేహితులే కాదు, తన ఇంజనీరింగ్ క్లాస్‌మేట్స్ కూడా జత కలిసి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అయినా కదల్లేదు సిబ్బంది. తెల్లవారి ఊరంతా నిరసన ర్యాలీ తీశారు. రెండు రోజుల హడావిడికి కొంత మేల్కొంది మున్సిపాలిటీ. మాట్లాడ్డానికి పిలిచారు అధికారులు. వాళ్లమ్మ మరణానికి కారణమైన స్పీడ్‌బ్రేకర్‌కు మాత్రమే పెయింట్ వేయడానికి అనుమతిచ్చారు. ఏ కదలికైనా ఒక్క అడుగుతోనే కదా మొదలు.. అనుకొని సరే అంది నేహ బృందం. ఆరోజే వాళ్లమ్మ ఫోటో తీసుకొచ్చి ఆ స్పీడ్‌బ్రేకర్ ముందు పెట్టారు. స్పీడ్‌బ్రేకర్‌కి తెల్లని పెయింట్ వేశారు వాహనదారులకు కనిపించేలా! అలాగే ఆ ఫోటో ముందు వాళ్లమ్మ వివరాలు.. చనిపోయిన కారణాన్ని పెయింట్‌తో రాసింది నేహ. వీళ్ల ప్రయత్నాన్ని చూసిమున్సిపల్ సిబ్బంది కూడా కళ్లు తెరిచారు. దాంతో గాధీంగ్లాజ్‌లోని అన్ని స్పీడ్‌బ్రేకర్స్‌కి పెయింటింగ్ వేసి రోడ్‌సేఫ్టీ మెథడ్స్‌నూ రాశారు. అయితే వైట్ పెయింట్ కాకుండా రాత్రిపూటా కనపడేలా రేడియం పెయింట్‌ను వేశారు. నేహ వాళ్లు వేసిన స్పీడ్‌బ్రేకర్ సహా అన్నిటికీ!  ఇప్పుడు ఇది ఓ ఉద్యమంలా.. అకోలా జిల్లా అంతా పాకింది. ఫలితాలు అనుకూలంగా ఉండడంతో త్వరలోనే ఓ మోస్తరు పట్టణాలకూ దీన్ని విస్తరింపచేయాలని అనుకుంటోందట మహారాష్ట్ర ప్రభుత్వం.
 
 సమాజంలో చెడు జరిగినప్పుడో అన్యాయం జరిగినప్పుడో  ప్రమాదం జరిగినప్పుడో  మన మనసులు కలవరపడతాయి.
 ఏదైనా చేస్తే బాగుండునని ఉద్రేకపడతాయి.  నేహలా మనమూ ఇలాంటి చిన్ని చిన్ని ప్రయత్నాలు చేస్తే  అపరాధభావం లేకుండా ఆత్మసంతృప్తితో  జీవించవచ్చు.  మీరూ అలా ప్రయత్నిస్తారని నమ్ముతూ.. మీ సాక్షి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement