‘అమ్మ’దనానికి ప్రతీక యశోదమ్మ
‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచందర్ రావు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఆర్‌ఐ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుండేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని గుమ్మడివెల్లి గ్రామం నుంచి హన్మకొండకు మకాం మార్చాం. నాన్న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. అమ్మ యశోదా దేవి మా చదువుల కోసం హన్మకొండలోని శివారు గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివించారు. ఇంటర్ తర్వాత బ్రదర్స్ సురేందర్ రావు, నరేందర్ రావు మెడిసిన్‌లో చేరారు.
నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. మరో బ్రదర్ సీఏ చేశాడు. మమ్మల్ని సరైన మార్గంలో నడపడంలో మా అమ్మ పాత్ర మరవలేనిది. వృధా ఖర్చులకు ఎప్పుడూ దూరంగా ఉంచేది. తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని పదేపదే చెప్పేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాకు చిన్నప్పటి నుంచే అమ్మ అలవర్చారు. అమ్మ మీద ప్రేమ, గౌరవంతో యశోద హాస్పిటల్స్ ప్రారంభించాం. 1989లో ఒక చిన్న క్లినిక్‌గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ పాతికేళ్ల కాలంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా ఎదగడంలో అమ్మ దీవెనలు ఉన్నాయి. తల్లిగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. సంకల్పంతోనూ.. శ్రమించే తత్వంతోనూ.. అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ ఎందరికో ఆదర్శమూర్తి అయిన అమ్మ జీవితం ఈతరం వారికి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మ మా మధ్యలో లేకున్నా... ఆమె చూపిన మార్గంలోనే ముందుకెళుతున్నాం’.
- గోరుకంటి రవీందర్‌రావు, చైర్మన్, యశోద హాస్పిటల్స్