చిట్టితల్లికి ఎన్ని శాపాలో..
బేటీ బచావోలో ఈ రోజు కనిపించే అమ్మాయిలాంటి వాళ్లెందరికో నగరాల్లోని పాష్ లొకాలిటీస్‌లు ఆవాసాలు. ఇది ఓ పదేళ్లమ్మాయి జీవితం! ఉనికి సహజం అయినప్పుడు పేరు అనవసరం! కాబట్టి నేరుగా ఆమె కథలోకి వెళ్దాం. ఈ అమ్మాయి వాళ్లది ఆంధ్రలోని మారుమూల పల్లెటూరు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ముల్లో ఆఖరుది. పెద్దక్క పెళ్లయింది. రెండో అక్క అమ్మానాన్నలతోపాటు వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఇద్దరన్నలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు చదువు కోసం. ఈ ఇద్దరు మగపిల్లల్ని చదివించడం కోసం తల్లి, తండ్రి, అక్కతో కలసి పదేళ్ల ఈ పిల్లా శ్రమదానం చేస్తోంది.
ఎలా..
తన అమ్మానాన్నలు పనిచేసే పొలం యజమానికి ఒక్కడే కొడుకు. హైదరాబాద్‌లో ఉంటున్నాడు వ్యాపార నిమిత్తం. అతని భార్య ప్రభుత్వోద్యోగి. ఇద్దరు పిల్లలు. చిన్న పిల్లాడికి నెలల వయసుంటుంది. ఆ పిల్లాడి ఆలనాపాలనకు ఈ పిల్లను తెచ్చుకున్నారు. అంటే బాలకార్మికురాలిగా అన్నమాట. అదీ జీతమిచ్చి కాదు. వెట్టికి. కారణం.. ఈ పిల్ల అక్క పెళ్లికి వాళ్ల నాన్న ఈ వ్యాపారి తండ్రి దగ్గర పాతికవేలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు కింద పదేళ్ల బిడ్డను ఇక్కడికి పంపించాడు.
పిల్లాడి బాధ్యత..
తన తిండి తనకే సరిగ్గా తినడం రాని ఆ చిట్టితల్లి చిట్టిచిట్టి చేతులతో ఇంకో చంటోడికి ముద్దలు తినిపించాలి. వాడు సరిగ్గా తినకపోతే ఈ అమ్మాయికి వీపు మీద వాతలే! సన్నగా పీలగా ఉన్న ఈ పిల్ల బొద్దుగా ఆరోగ్యంగా ఉన్న ఆ బాలుడిని పొద్దస్తమానం చంకనెత్తుకొని మోయాలి. కింద దించితే వాడు రాగం తీస్తాడు. అమ్మగారు పొద్దున లేవగానే ఆఫీస్‌కెళ్లే హడావిడిలో ఉంటారు కాబట్టి పిల్లాడు ఏడ్వకుండా వాడి బాధ్యతలన్నీ ఈ పిల్లే చూసుకోవాలి.. ఆవిడ ఆఫీస్‌కు వెళ్లిపోతే ఎవరూ ఉండరు కాబట్టి మళ్లీ ఈ అమ్మాయికే ఆ భారం. అమ్మగారు ఆఫీస్‌లో పనిచేసి అలసిపోయి వస్తారు.. ఆవిడకు కాస్త విశ్రాంతి కావాలి.. ఆ పిల్లాడిని సాయంకాలం ఈ పిల్లే లాలించాలి. పదేళ్లకే ఓ తల్లి మోయాల్సిన భారం ఈ చిన్నతల్లి మోస్తోంది. ఆమెకన్నా రెండేళ్లే చిన్నోడైన అమ్మగారి పెద్దకొడుకు ఎంచక్కా స్కూల్‌కి వెళ్తాడు. స్నేహితులతో ఆడుకుంటాడు.. పాడుకుంటాడు.. కావల్సింది తింటాడు.. హాయిగా నిద్దరోతాడు! దీనికి పూర్తిగా విరుద్ధం ఈ అమ్మాయి జీవితం!
ఇలాంటి వెట్టి జీవితాలు హైదరాబాద్‌లోని పెద్దిళ్లల్లో చాలా కనిపిస్తాయి. ఓవైపేమో ప్రభుత్వాలు బాలకార్మిక వ్యవస్థను రద్దుచేయడానికి కఠిన చర్యలు అంటాయి.. ఇంకో వైపు బేటీలను బచాయించడానికి కంకణాలు కట్టుకుంటాయి. అయినా ఈ పిల్లల తలరాతలు మానవు.
ముగింపు
ఇలాంటి వెతలకు ముగింపు కావాలి. ఎప్పుడు ? ఏమో! బేటీ బచావో ప్రచారానికి ‘సిటీప్లస్’ పెన్ను పట్టి నెలవుతోంది. నేటితో విరామమిస్తోంది. ఈ నెలరోజుల్లో ఇక్కడ ప్రచురితమైన గాథలే కాక రాయడానికి వీల్లేని ఘోర గాయాలనూ చూసింది. దాదాపు అరవై శాతం వ్యథలకు కారణం ఇంటి సభ్యులే! మనసు చలించింది.. కలత చెందింది! అక్షరాలుగా పేరిస్తే ఒక్కరైనా స్పందించి ఆడబిడ్డ పట్ల సున్నితంగా ఆలోచిస్తారేమో అనిపించింది.
అందుకే ఈ ప్రయత్నంతో ముందుకు వచ్చాం. ఆ ఒక్కరు ఇంకొకరిని.. ఆ ఇంకొకరు మరొకరిని ఇలా కనీసం కొంతమందైనా ప్రభావితమైతే.. ప్రయత్నం సఫలమైనట్టే! ఆడపిల్ల రక్షణకు అడుగు పడ్డట్లే! అలా బేటీ బచావో అనే ఈ కాలమ్‌కి మంచి ముగింపును ఆశిస్తున్నాం!
సరస్వతి రమ