మీ షాపింగ్ స్పాట్
అనిత చేగూరి.. మల్టీ టాలెంటెడ్ గాళ్.
తల్లిదండ్రులు కాదన్నా... ఇష్టంతో ఆప్షనల్‌గా డ్యాన్స్ మ్యూజిక్ నేర్చుకుంది. ఇప్పుడు అదే మెయిన్ ఆప్షన్ అయ్యింది. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది. పెర్ఫార్మెన్స్‌కి అవకాశమున్న రోల్ చేయడమే తన గోల్ అంటూ ఆమె చెబుతున్న కబుర్లు...
..:: శిరీష చల్లపల్లి
నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నేను చిన్నప్పటినుంచే చాలా చురుకు. చదువులోనే కాదు... ఆటపాటల్లో కూడా. కబడ్డీ అంటే పిచ్చి. నేను బొద్దుగా ఉండటంతో నా పర్సనాలిటీని చూసే అవతలి టీం వాళ్లు జంకేవాళ్లు. అలా కాలేజీ, డిస్ట్రిక్ట్ లెవల్ వరకూ ఆడాను. అమ్మా, నాన్న ఇద్దరూ ఎంప్లాయీస్ కావడంతో నాకు రెస్పాన్సిబులిటీస్ కాస్త ఎక్కువగా ఉండేవి. అవి మా తమ్ముడు, చెల్లిని గైడ్ చేయడం, వాళ్ల కేర్ తీసుకోవడం అంతే.
యాంకరింగ్‌లో అవకాశం..
ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా దూరదర్శన్‌లో పాట పాడటానికి ఛాన్స్ వచ్చింది. అప్పుడు వాళ్లు నాలో చురుకుదనం చూసి ఓ పిల్లల ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేయమని అడిగారు. కానీ అమ్మవాళ్లు ఒప్పుకోలేదు. ఇక ఇంటర్‌లో ఉండగా జెమినీలో ఆడిషన్స్‌కి అటెండ్ అయ్యాను. ఫుల్‌టైం చేయమన్నారు. చదువుకు ఇబ్బందవుతుందని నేను ఒప్పుకోలేదు. తరువాత మెల్లగా పార్ట్‌టైమ్‌గా యాంకరింగ్ మొదలుపెట్టాను. ఇప్పడు వివిధ ఛానల్స్‌లో చేస్తున్నాను. ఎన్ని చేసినా యాంకర్ అనిత అనగానే అందరికీ గుర్తొచ్చేది సఖి మాత్రమే. ఎప్పటికైనా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవాలన్నది ఆల్‌టైం గోల్. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలన్నది ధ్యేయం.
మొండిదాన్ని...
నా స్కూల్ డేస్ నుంచే డాన్సన్నా, సింగింగ్ అన్నా చాలా ఇష్టం. ఏ ఫంక్షన్ జరిగినా ఐదు నుంచి ఆరు ప్రోగ్రామ్స్ నావే ఉండేవి. కానీ మా పేరెంట్స్‌కి చదువు తప్పించి ఇతర యాక్టివిటీస్ మీద నేను దృష్టి పెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఆడపిల్ల అనే చిన్న భయంతో స్పోర్ట్స్‌కి, డ్యాన్స్‌కి కొంచెం దూరంగా ఉంచేవాళ్లు. మొండిదాన్నవ్వడం వల్ల ఇంట్లో వాళ్లకు తెలియకుండా డాన్స్, సింగింగ్ క్లాసుల్లో జాయినయ్యాను.
పచ్చదనం కరువైన నగరం
హైదరాబాద్ బ్యూటిఫుల్ షాపింగ్ స్పాట్. నా చిన్నప్పుడు హైదరాబాద్ మొత్తం చెట్లు, గుట్టలతో పచ్చదనం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు టోటల్ రివ ర్స్ అయింది. డ్రాస్టిక్ ఛేంజ్ వచ్చింది. ఆ ప్రశాంతమైన వాతావరణం చూడాలంటే ఏ అన్నపూర్ణస్టూడియోకో, ఇతర స్టూడియోలకో వెళ్లాల్సి వస్తోంది.