
సిటీలో పట్టాభిరాముడు
నిజాం పాలకుల మతసామరస్యానికి ప్రతీక సీతారాంబాగ్ దేవాలయం. మల్లేపల్లి నుంచి ఆసిఫ్‌నగర్‌కు వెళ్లే దారిలో ఉన్న సీతారాంబాగ్ దేవాలయం జంటనగరాల్లోని హిందూ....
నిజాం పాలకుల మతసామరస్యానికి ప్రతీక సీతారాంబాగ్ దేవాలయం. మల్లేపల్లి నుంచి ఆసిఫ్‌నగర్‌కు వెళ్లే దారిలో ఉన్న సీతారాంబాగ్ దేవాలయం జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లోనే అతి పురాతమైనది. పండుగ వచ్చిందంటే భక్తులకు కిక్కిరిసే ప్రస్తుత ఆలయాల్లా కాకుండా... ఆ కాలంలోనే సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ పురాతన దేవాలయం నేటికీ భక్తులను ఆకట్టుకుంటోంది...
సీతారాంబాగ్ దేవాలయాన్ని నిర్మించిన కచ్చితమైన సంవత్సరం చరిత్రలో ఎక్కడా లేదు. మూడో, నాల్గో నిజామ్‌ల పరిపాలనా కాలం(1803-1857)లో ఈ సీతారాముల దేవాలయం నిర్మించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. నిజాంకాలంలో ప్రముఖ మార్వాడీ వ్యాపారి పురానమాల్ గెనేరివాలా ఈ దేవాలయాన్ని నిర్మించారని, తర్వాత ఆయన కుమారులు దేవాలయ అభివృద్ధి, పరిరక్షణ బాధ్యతలు చేపట్టారని చెబుతారు.
ఆలయ జాగీర్...
దేవాలయం చుట్టూతా ఎత్తై ప్రాకారం... కోట గోడలను తలపింపజేస్తుంది. జైపూర్ పాలరాతితో తయారు చేయించిన సీతారాముల విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రతిష్టించారు. అలాగే వరదరాజస్వామి దేవాలయం కూడా ఇక్కడ కొలువై ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తగిన సత్రపు గదులు, అర్చక స్వాముల కోసం ప్రత్యేక గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేవాలయ ప్రాంగణపు గోడలు ఎత్తై ప్రధాన ద్వారాలతో, యూరోపియన్ వాస్తు శైలిలో నిర్మించారు. ఆనాటి నిజాం ప్రభువులు కొందరు హిందూ దేవాలయాల అభివృద్ధికి కూడా తగిన సహాయం అందించారని చెబుతారు. నాల్గో నిజాం ప్రభువు నవాబ్ నాసిర్-ఉద్-దౌలా సీతారాంబాగ్ దేవాలయ అభివృద్ధికి ఇతోదికంగా సహకరించారని, ఆలయ పరిరక్షణకు కొన్ని భూములు జాగీర్‌గా కూడా ప్రకటించారని చరిత్ర చెబుతోంది.
పూదోటల నడుమ...
1908లో మూసీనది పరవళ్లు తొక్కినప్పుడు అంతేకాదు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరింత సెక్యులర్ భావాలతో నుదుట తిలకం దిద్దుకుని, హిందూ వస్త్రధారణతో ఆ నదీమ తల్లికి పట్టుచీర, హారతి సమర్పించారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అసఫ్‌జాహీ ప్రభువుల పరిపాలనా కాలంలో సుమారు 20 ఎకరాల్లో సీతారాంబాగ్ దేవాలయం చక్కని పూదోటల నడుమ నిర్మించారు.
ఆనాడు తెలంగాణా ప్రాంతంలో విద్యా సంస్థలు అసలే లేవు. అలాంటి రోజుల్లోనే సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో సంస్కృత విద్యాశాలనొకొదాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఎందరికో ఉచిత విద్యాదానం చేశారు. ఇక్కడ ఖండవల్లి నర్సింహశాస్త్రి వ్యాకరణ పండితులుగా పనిచేశారు.
దాశరధి, దివాకర్ల వెంకటావధాని వంటి పండితులు ఇక్కడి తరగతులకు హాజరయ్యారు. ఈ సంస్కృత పాఠశాలలో ఆ రోజుల్లోనే ‘అమరభారతి’ అనే లిఖిత మాస పత్రికను కూడా నిర్వహించారు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు రవ్వా శ్రీహరి, కె.కె. రంగానాథాచార్యులు, ఎస్.వి.విశ్వనాథశర్మ, తదితరులు ఈ పాఠశాల విద్యార్థులే. పండితులకు పుట్టినిల్లుగా, ఎందరికో ఎన్నో విధాల సేవలందించిన పురాతన దేవాలయం నేటికీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. చక్కని గాథలు తెలిపే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే!