
ఈ ప్రశ్నలకు బదులేది..?
మతసామరస్యాన్ని చాటుతూ బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ‘కమ్యూనల్ హార్మోనీ పేరుతో శని, ఆదివారాల్లో పలు డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. గోద్రా దుస్సంఘటన జరిగి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ బాధితుల స్మృత్యర్థం విజ్జీయార్, విమోచన్, లామకాన్‌లు /ా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రదర్శనలో తొలిరోజు ఆనంద్ పట్వర్ధన్, శుభ్రదీప్ చక్రవర్తి, రాకేశ్ శర్మ రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. రెండో రోజైన ఆదివారం ఫైనల్ సొల్యూషన్, ఫాదర్.. సన్ హోలీ వార్ చిత్రం 2 భాగాలు, ఎన్‌కౌంటర్డ్ ఆన్ సాఫ్రాన్ చిత్రాలను స్క్రీనింగ్ చేశారు.
ఫాదర్-సన్ హోలీవార్.. 2 భాగాలు
ఆనంద్ పట్వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో.. దేశంలో బలహీనుల మీద దాడులకు కారణమవుతున్న అనేక భావజాలాలకు మూలమైన అంశాలను అర్థవంతంగా చూపించారు. నాటి సతి సహగమనం నుంచి తలాక్ వరకు అన్ని చోట్ల బాధితులు మహిళలే. పురుషాధిక్యతకు బలం చేకూరుస్తున్న మత విధానాలు, సంప్రదాయాలు, చారిత్రక కథలు.. నేటి టీవీ కార్యక్రమాలను చిత్ర దర్శకుడు వేలెత్తి చూపించారు. ఈ డాక్యుమెంటరీ 90వ దశకంలో తీసిందైనా.. చిత్రాల్లో ప్రస్తావించిన అంశాలు నేటికీ ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అహింసను నపుంసకత్వానికి చిహ్నంగా భావించడం భవిష్యత్తును మరింత అంధకారంలోకి తోసే
విధానమనే ఆలోచనను రేకెత్తిస్తూ ఫాదర్-సన్ హోలీవార్ ముగుస్తుంది.
ఎన్‌కౌంటర్డ్ ఆన్ సాఫ్రాన్ ఎజెండా
గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ల గురించి తీసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ ఇది. ట్యూషన్లు చెప్పుకునే అమ్మాయి, బంధువులను చూడటానికి వెళ్లిన భార్యభర్తలు, మోటరు బైక్ మీద అహ్మదాబాద్‌కు బయలుదేరిన యువకుడు హఠాత్తుగా ఎన్‌కౌంటర్ అయినట్లు వార్తా కథనాలు. పోలీసుల వివరణలు ప్రసారమవుతాయి. పేపర్లో వార్తలు వస్తాయి. కొన్ని ఫిర్యాదులు, కొంత విచారణ తర్వాత జనం వాటిని మరచిపోతారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది టైస్టులా, సామాన్యులా, పోలీసు కథనాలలో ఉన్న నిజానిజాలు నిగ్గుతేల్చిన డాక్యుమెంటరీ ఇది. నిపుణులు, అధికారుల కన్నా సామాన్యులు, కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలు సమస్య మూలాలను కదిలించేవిగా ఉన్నాయి! ఈ డాక్యుమెంటరీ రూపొందించింది శుభ్రదీప్ చక్రవర్తి.
ఫైనల్ సొల్యూషన్
‘మా తాతను, నాన్నను వాళ్లు పొడిచి చంపేశారు. మా ఊరి నుంచి పంపించేశారు. అప్పటి నుంచి ఈ ఊళ్లో ఉంటున్నాం. మా పిన్ని ఇంకా మిగతా ఆడవాళ్ల బట్టలు ఊడదీసి, చంపేశారు. వాళ్లని నేను చూశాను’ అని నాలుగేళ్ల పిల్లవాడి మాటలతో మొదలయ్యే ఈ డాక్యుమెంటరీ గుజరాత్ అల్లర్ల మీద లోతైన విషయాలను మన ముందుకు తెస్తుంది. అల్లర్లలో నష్టపోయిన ఇరు వర్గాల వాళ్ల ఇళ్లు, వాడలను కళ్లముందుంచారు డెరైక్టర్. దాడులలో బతికి బయటపడ్డ వారు, ముఖ్యంగా స్త్రీలు పడిన వేదనను గుండె కదిలించేలా చూపించారు. రాకేశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చాలా చోట్ల స్క్రీనింగ్ చేయడానికి అనుమతులు నిరాకరించారు.
ఓ మధు