కాలక్షేపానికి... come to me | for time pass come to me | Sakshi
Sakshi News home page

కాలక్షేపానికి... come to me

Published Wed, Feb 25 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

కాలక్షేపానికి... come to me

కాలక్షేపానికి... come to me

వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ... అంతకుమించి యూత్ పెద్దగా కోరుకునేదేముంది? అయితే సిటీలో హ్యాంగవుట్ స్పాట్స్ రూపకర్తలు అంతకుమించే ఆఫర్ చేస్తున్నారు. వీటి వెల్లువ పుణ్యమా అని.. యువ గుసగుసల వేదికలు అంతకంతకూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. సిటీ యూత్ హృదయాలను దోచుకుంటున్న హ్యాంగవుట్ ట్రెండ్స్ ముచ్చట్లు...
 ..:: ఎస్.సత్యబాబు
 
 ఇరానీ క్యాంటీన్‌ల నుంచి ఇంటర్నేషనల్ కెఫెల దాకా సిటీ యూత్ సరదాలకు, ముచ్చట్లకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కావేవీ ఎంజాయ్‌మెంట్‌కు అనర్హం అన్నట్టుగా.. ఎందెందు వెతికినా అందందు కాలక్షేపం దొరుకుతోంది. రోజురోజుకూ యువత ఆకాంక్షలు మారుతూండడంతో ముచ్చట్ల వేదికలు కూడా  విభిన్న రకాలుగా ముస్తాబవుతున్నాయి. కాలేజ్ కుర్రకారు దగ్గర్నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా పలు రంగాల్లోని యువతను  ‘కాలక్షేపానికి కమ్ టు మి’ అంటున్నాయి.
 
హైఫై టు వైఫై..
 పేలే జోకులు.. ఫెల్లున నవ్వులు.. ఛెల్లున హైఫైలు.. అంతలోనే వైఫైలోకి పయనాలు..  క్షణానికో రకంగా మారిపోయే యూత్ మూడ్స్‌కి అనుగుణమైన వాతావరణమే హ్యాంగవుట్ ప్లేస్‌కు ప్రధాన వనరు. ఆకర్షణీయమైన యాంబియన్స్‌కు ప్రథమ స్థానం ఇస్తున్న యువతీయువకులు ఫుడ్‌కి సెకండ్‌ప్లేస్, మ్యూజిక్‌కి థర్డ్‌ప్లేస్ ఇస్తున్నారు. ఈ మూడు అంశాల్లో సంతృప్తి చెందాక... అదనంగా అందేవాటిని పరిశీలిస్తున్నారు.
 
యూత్ అభిరుచులను దృష్టిలో ఉంచుకుని యాంబియన్స్, ఫుడ్, మ్యూజిక్‌లను అద్భుతంగా మలుస్తున్న హ్యాంగవుట్స్ రూపకర్తలు అంతకుమించి అందిస్తున్న ఆకర్షణల్లో ఉచిత వైఫై ఫెసిలిటీ ప్రధానమైంది. నలుగురూ కలసి ముఖాముఖి ముచ్చటించుకోవడానికి  మాత్రమే కాదు.. చాటింగ్‌లూ, వాట్సప్‌లూ, షేరింగ్‌లతో ఒంటరిగా గడపడానికి కూడా వైఫై అత్యవసరంగా మారింది.

ఉచితంగా ఈ-సేవను అందిస్తున్న హ్యాంగవుట్ ప్లేసెస్‌కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్‌కి డిస్కౌంట్స్ కనీసం 15 శాతం నుంచి ఆపైన అందిస్తున్నారు. గ్రూప్స్ సంఖ్యను బట్టి కూడా ఈ ఆఫర్స్‌ను మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నారు. తరచుగా యాంబియన్స్‌లో మార్పు చేర్పులు చేయడమే కాదు, వీటి విశేషాలను ఆన్‌లైన్ ద్వారా యూత్‌కి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. వెల్‌కమ్  డ్రింక్స్‌ను ఫ్రీగా ఇచ్చే ప్లేస్‌లూ ఉన్నాయి.
 
యూత్ చాయిస్‌లు...
 యూత్‌ని ఎట్రాక్ట్ చేయడంలో కాఫీడేలు, బరిస్తా, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ.. ఆల్‌టైమ్ పాపులర్. బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌లో ఉన్న హార్డ్ రాక్ కెఫె... ఇప్పుడు సిటీ కుర్రాళ్లకు హార్ట్‌బీట్. అలాగే జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో హార్ట్ కప్ కెఫె.. మ్యూజిక్, ఫుడ్‌తో ఎప్పుడూ యువ సందోహంతో నిండి ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో క్రీమ్ స్టోన్ ఐస్‌క్రీమ్ పార్లర్.. సమయం సందర్భం లేకుండా పార్టీలు, విందు వినోదాలతో సందడిగా కనిపిస్తుంటుంది. ‘క్రీమ్ స్టోన్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతుండడం ఈ ప్లేస్‌కి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం’ అంటారు ఫుడీ సంకల్ప్. మాదాపూర్‌లో లేటెస్ట్‌గా ప్రారంభమైన సిగుస్తా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో జస్ట్ లాంచ్ అయిన స్టార్ బక్స్ లకూ యూత్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే మరో ఐదు రెస్టారెంట్స్ ఓపెన్ కానున్నాయి.
 
హ్యాపీ హ్యాంగవుట్స్
ప్రస్తుతం యువాదరణ పొందుతున్న ఖరీదైన ముచ్చట్ల వేదికల గురించి చెప్పాలంటే.. కేబీఆర్ పార్క్ రోడ్‌లో ఉన్న క్రేవ్ ఒకటి. సుందర ఉద్యానవనం సమీపంలో ఉండే ఈ హ్యాంగవుట్ ప్లేస్‌కు వైట్ ఇంటీరియర్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే  లేట్‌నైట్ చిల్ అవుట్‌కి పేరొందిన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని వ్యూ లాంజ్‌లో వెరైటీ మాక్‌టైల్స్ యువత చవులూరిస్తాయి. హైటెక్ సిటీలోని చార్‌కోల్ యూత్ మెచ్చే బార్బెక్యూ ఫుడ్‌కి కేరాఫ్. కార్పొరేట్ ఉద్యోగులు పని అనంతరం సేదతీరేందుకు ఎంచుకునే ప్లేస్ ఇది.  వింటర్ సీజన్‌లో చలిమంట (బోన్ ఫైర్) సెటప్‌తో సహా యువతను ఉర్రూతలూగించే ఆకర్షణలతో.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ది బ్యాక్ యార్డ్ ఆకట్టుకుంటుంది.

చుట్టూ పచ్చదనం, లాంతర్ల అమరికతో... వెరైటీ లుక్ దీని స్పెషాలిటీ. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ది లాస్ట్ సొసైటీ సౌకర్యవంతమైన సిట్టింగ్‌కు, లైటింగ్‌కు చిరునామా. ఎత్తయిన భవనాల మధ్య ఠీవిగా నిలిచి ఆహ్వానిస్తుంది. వరండా దీనిలో ప్రత్యేక ఆకర్షణ. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లో విలాసవంతంగా, ఖరీదుగా కనిపించే ఎయిర్‌లాంజ్ మరో బెస్ట్ ప్లేస్. లెక్కలేనన్ని పాస్తాలకు ఒక్కచోటే అంటూ లొట్టలేస్తారు యూత్. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోనే ఉన్న ‘ది పాస్టా బార్ వెనెటొ’ కూడా  ఫేవరేట్ స్పాట్‌గా మారింది. ఇలా రకరకాల హ్యాంగవుట్ హబ్‌లు నగర యువతను సేదతీరుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement