ఐ సెట్ | SET | Sakshi
Sakshi News home page

ఐ సెట్

Published Fri, Feb 20 2015 11:02 PM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

ఐ సెట్ - Sakshi

ఐ సెట్

వీలైతే ఫేస్‌బుక్.. కుదిరితే వాట్సప్.. ఇలా ఇంటర్నెట్  ముందు టైంపాస్ చేసే యూతే ఇప్పుడు ఎక్కువ. అలాంటి చాటింగ్‌లకు, కబుర్లకు గుడ్‌బై చెప్పి..చదువుకుంటూనే నాలెడ్జ్ పెంచుకునే పనిలో పడ్డారు వీళ్లు. ఉద్యోగపర్వంలో ఎదురయ్యే సమస్యలను ముందే తెలుసుకుని
 అధిగమిస్తూ, టీమ్ లీడర్‌గా ప్రాజెక్టులను హ్యాండిల్ చేసే అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. వారికి బాసటగా నిలుస్తోంది ‘ఐసెక్’ (ఏఐఈఎస్‌ఈసీ).
 ..:: వాంకె శ్రీనివాస్
 
 ఐసెక్ వెనుక ఆరున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. 1948లో ఏడుగురు యువకులతో నార్వేలో ఇది ప్రారంభమైంది. నేడు 124 దేశాలలో తన కార్యాలయాలను నడుపుతోంది. వీటిలో లక్షకు పైగా విద్యార్థులు వలంటీర్లుగా ఉన్నారు. 1990లో సిటీకి చెందిన ఏడుగురు యువకులు ఏఐఈఎస్‌ఈసీ హైదరాబాద్‌ను స్టార్ట్ చేశారు. ట్వంటీఫోర్ బై సెవన్ లీడర్‌షిప్ ఫ్యాక్టరీ పేరుతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు కృషి చేస్తోంది ఐసెక్. 89 మంది విద్యార్థులతో ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ని మొదలెట్టిన ఐసెక్ నేడు వందలాది మందికి సహకారాన్నందిస్తోంది.
 
 ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ అంటే...
 ఇక్కడి యువతను ఇతర దేశాలకు ఇంటర్న్‌షిప్ కోసం పంపడమే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన యువతకు మన దేశంలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది ఐసెక్. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇతర దేశాల్లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్ చాన్స్ ఇప్పిస్తుంది. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వారి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను బట్టి విదేశాల్లో ఏడాది పాటు ఏదైనా కంపెనీలో ఉద్యోగం ఇప్పించగలుగుతుంది. ఈ పనంతా హైదరాబాద్‌లో వలంటీర్లుగా పనిచేసే విద్యార్థులే చేస్తారు.
 
  కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఉద్యోగాల కల్పన, మార్కెటింగ్ అండ్ పీఆర్, టాలెంట్ మేనేజర్ అండ్ ఫినాన్స్.. ఇలా నాలుగు టీమ్‌లుగా యువత పనిచేస్తోంది. వీరికి లోకల్ కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గెడైన్స్ ఇస్తుంటారు. ఇతర దేశాల నుంచి ఇంటర్న్‌షిప్ కోసం ఇక్కడికి వచ్చిన వారికి తమ కార్యాలయాల్లోనే బస కల్పిస్తారు. మొదట  వారు పనిచేసే సంస్థకు తీసుకెళ్లి పరిచయం చేస్తారు. రూట్‌మ్యాప్ డెరైక్షన్ ఇస్తారు. ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరిస్తారు. విదేశీ విద్యార్థులకు ఆత్మీయ ఆతిథ్యాన్నిస్తారు. జాలీగా ట్రిప్పు వెళ్లాలనుకున్నవారిని తీసుకెళ్లి చూపిస్తారు.
 
 పరిణితి ఇలా...
 పీస్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ హ్యూమన్‌కైండ్స్ పొటెన్షియల్ థీమ్‌తో పనిచేస్తున్న ఈ సంస్థ. చదువు పూర్తయి ఉద్యోగాల్లో చేరేలోపే విద్యార్థుల్లో కంపెనీలో పనిచేసిన అనుభవం, టీమ్ లీడర్‌గా ఎదురయ్యే సవాళ్లు, వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లే తీరు ప్రాక్టికల్‌గా అర్థమయ్యేలా చేస్తోంది. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు 2004 నుంచి ఐసెక్ పలు సేవ కార్యక్రమాలూ నిర్వహిస్తోంది. 2004 నుంచి ‘బాల కళాకార్’ కార్యక్రమంతో ఎంతోమంది పేద చైల్డ్ ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకొచ్చామంటున్నారు లోకల్ కమిటీ ప్రెసిడెంట్ కౌశిక్. మహిళా సాధికారత కోసం ‘అధికార్’, పర్యావరణ పరిరక్షణ కోసం ‘కన్సర్వ్’, జంతువులను కాపాడేందుకు ‘అనిమిలియా’ వంటి కార్యక్రమాలతో వలంటీర్లలో సేవాభావం పెరిగిందన్నారు. ఏటా నిర్వహించే రీజనల్ యూత్ లీడర్ కాన్ఫరెన్స్, నేషనల్ స్ట్రాట జిక్ కాన్ఫరెన్స్, ఆన్యువల్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ విద్యార్థులకు
 ఉపయోగపడుతున్నాయన్నారు.
 
 నమ్మకం కలిగింది..
 ‘ఫ్రెండ్ ప్రెజర్‌తో ఇంటర్వ్యూకు హాజరయ్యా. మెంబర్ స్థాయి నుంచి టీమ్ లీడర్‌గా ఎదిగా. కొత్తవాళ్లతో గలగల మాట్లాడటం అలవాటైంది. రిక్రూట్‌మెంట్‌లో ఫైనాన్స్ బాధ్యతలు చూసుకుంటున్నా. ఇది నాకు ప్రాక్టికల్‌లా ఉపయోగడింద’ని అని చెబుతోంది సీఏ విద్యార్థిని శ్రీకరి కొండూరి. ‘ఐసెక్‌లో చేరాక కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఉండాలో క్లారిటీ వచ్చింది’ అని అంటోంది వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ నవ్య. ‘2014 ఆగస్టులో ఇంటర్వ్యూకి హాజరై మెంబర్‌ను అయ్యా. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్ గురించి మన సిటీకి వచ్చే విదేశీ ప్రతినిధులతో పనిచేస్తున్నా.  ఓటమిపాలైనా ఒత్తిడిలో సైతం మళ్లీ లక్ష్యాన్ని చేరుకోగలనన్న నమ్మకం ఏర్పడింది’ అని అంటున్నాడు జేఎన్‌టీయూలో చదువుతున్న ప్రతీక్.
 
 వలంటీర్‌గా చేరాలంటే...
 ఐసెక్ తమ వలంటీర్లను పెంచుకోవడానికి శని, ఆదివారాల్లో సోమాజిగూడలోని రూట్స్ బిజినెస్ స్కూల్లో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. 18 నుంచి 22 ఏళ్లున్న వారు అర్హులు. వివరాలకు ఫోన్: 7893375916, 9642707942.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement