సాక్షి, గుంటూరు(త్తెనపల్లి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్‌ఫోన్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలల్లో సెల్‌ఫోన్‌ల వినియోగానికి ఎట్టకేలకు తాళం పడింది. ఉపాధ్యాయులు విధి నిర్వహణ ఉన్న సమయంలో వీటిని వాడకూడదన్న నిబంధన ఎప్పటి నుంచో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా తరగతి గదుల్లో వీటి వినియోగాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో సెల్‌ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ గతంలోనే విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, అవి ఎక్కడా అమలు కాలేదు. దీనిపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం ఉండట్లేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.
ప్రధానోపాధ్యాయులదే బాధ్యత
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇప్పుడు సెల్‌ఫోన్‌ల నిషేధం పక్కాగా అమలు చేయాల్సి ఉంది. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు వీటి విషయంలో బాధ్యత పెరిగింది. ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లు తీసుకుని స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. బడి సమయం ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు సైతం వీటిని వినియోగించడానికి వీలు లేదు. తరగతి గదిలో ఫోన్ వాడితే ఉపాధ్యాయులతోపాటు ఆ పాఠశాల హెచ్‌ఎంలను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకపై సెల్‌ఫోన్‌లను పాఠశాలలకు తీసుకెళ్లకూడదని కొందరు ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
ఈ నిబంధనలు తప్పనిసరి..
తరగతి గదిలో ఉన్నంత సేపు సెల్‌ఫోన్ మాట్లాడరాదని, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను తరగతి గదుల్లో ఉపయోగించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. వాటిని వినియోగిండం వలన ఉపాధ్యాయుల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా విద్యార్థుల దృష్టి మరలే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటువంటి అలవాట్లు ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు సంక్రమిస్తాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లిన వెంటనే సెల్‌ఫోన్లు సైలెంట్ మోడ్‌లో పెట్టి స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాలి, లేకంటే ప్రధానోపాధ్యాయుడి నియంత్రణలో ఉంచాల్సి ఉంటుంది. భోజన విరామ సమయంలో మాత్రమే ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లు వాడుకోవాల్సి ఉంది.
డ్రెస్ కోడ్..
వీటితో పాటు పాఠశాలల్లో గురువులు డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంది. 8/4 జేబులతో కూడిన ఫ్యాంట్లు కానీ, టీషర్టులు కానీ వేసుకోకూడదు. ఉపాధ్యాయినులు విధిగా చీరలు ధరించాలి. వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం వీటిలో మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలని, వీటిని అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ బడుల్లో సెల్‌ఫోన్ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్నా.. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. పాఠాలు పక్కనబెట్టి కొందరు టీచర్లు తరగతి గదుల్లోనే సెల్‌ఫోన్ కబుర్లతో కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు కావడంతో ఇంటర్‌నెట్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment