సిస్టర్స్ 4 బ్యూటీ | sisters four beauty | Sakshi
Sakshi News home page

సిస్టర్స్ 4 బ్యూటీ

Published Fri, Mar 6 2015 11:33 PM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM

సిస్టర్స్ 4 బ్యూటీ - Sakshi

సిస్టర్స్ 4 బ్యూటీ

గల్లీకో బ్యూటీ పార్లర్..  సెంటర్‌కో బ్యూటీ హబ్.. సిటీలో ఇప్పుడు సర్వసాధారణం. మూడు దశాబ్దాల కిందట.. బ్యూటీ పార్లర్ కెరీర్ అంటే ఓ అసాధారణ విషయం. కానీ దాన్నే కెరీర్‌గా  ఎంచుకుని.. సిటీలో నయా ట్రెండ్ సెట్ చేసింది మాత్రం ఆ నలుగురే. ఆధునికతను  అందిపుచ్చుకుని అతివలకు దగ్గరి బంధువులయ్యారు. అనూస్‌సిస్టర్స్‌గా పేరొందిన  ఆ అక్కాచెల్లెళ్ల పేర్లు అనురాధ, అన్నపూర్ణ, అనుపమ, అనిరుధ.
 కోట కృష్ణారావు
 
 థర్టీత్రీ ఇయర్స్ బ్యాక్.. 1982 నగరంలోని తిలక్‌నగర్.
 మున్సిపల్ కమిషనర్ ఇల్లు. ఆ ఇంటి ముందు బ్యూటీ సెలూన్ పేరిట బోర్డు వెలసింది. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి ఇంటి ముందు ఈ బోర్డేంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆరా తీస్తే కమిషనర్ గారాలపట్టి అనురాధకు బ్యూటీ రంగంపై ఆసక్తి ఎక్కువ. తన ఇంటికి సమీపంలో ఎవరో బ్యూటీ చిట్కాలతో అందానికి వన్నెలద్దుతున్నారని తెలిసి ఆమె కూడా వెళ్లింది. అక్కడినుంచి వచ్చిన తర్వాత అద్దం ముందు నిల్చుని పదే పదే చూసుకుంది. తనూ బ్యూటీ సెలూన్ ప్రారంభించాలని డిసైడ్ అయింది.
 
  ఒకవైపు డిగ్రీ చదువుతూనే.. అప్పట్లో అందుబాటులో ఉన్న వనరులతో బ్యూటీ సెలూన్‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంది. ఇంట్లోవారిపైనే ప్రయోగాలు చేసింది. సక్సెస్ సాధించి తల్లిదండ్రులు తిరుపతిరావు, లలితాదేవిని మెప్పించి.. ఒప్పించి.. సింగిల్ కుర్చీతో బ్యూటీ సెలూన్ ఓపెన్ చేసింది. మగవారు చేసే పని చేస్తుందని ఎందరు ఎన్ని రకాల మాటలన్నా.. పట్టించుకోకుండా ముందుకెళ్లింది.
 
 నిత్యాన్వేషకులుగా..
 అనురాధ స్టార్ట్ చేసిన బ్యూటీ సెలూన్‌కు కొద్ది రోజుల్లోనే యువతులు క్యూ కట్టారు. సెలూన్‌కు ఆదరణ పెరగటంతో.. ఎదురుగా ఉన్న పెద్ద ఇంట్లోకి మారారు. రెండేళ్లకు విద్యానగర్‌లో అన్ని సౌకర్యాలతో బ్యూటీ పార్లర్‌ను నెలకొల్పారు. అందులోనే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో అనురాధ చెల్లెలు అన్నపూర్ణ కూడా అక్కకు తోడైంది. రకరకాల బ్యూటీ సమస్యలతో తమ వద్దకు వస్తున్న కస్టమర్ల కోసం వీరు నిత్యాన్వేషకులుగా మారారు. చెన్నై, ముంబై, ఢిల్లీతో పాటు అమెరికా వంటి దేశాలు చుట్టి వచ్చి బ్యూటీ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను అధ్యయనం చేశారు.
 
  మిగతా ఇద్దరు సిస్టర్స్ అనుపమ, అనిరుధలు కూడా అక్కలు నడిచిన బాటే పట్టారు. 1991-92 మధ్య కాలంలో సెలూన్ సేవలతో పాటు అనూస్ పూర్తిస్థాయి క్లినికల్ సర్వీసెస్‌గా తీర్చిదిద్దారు. నలుగురు కలిసి 1992లో సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్‌లో మొట్టమొదటిసారిగా జర్మన్ టెక్నాలజీని పరిచయం చేస్తూ బ్యూటీ సేవల్లో ఆధునికతకు ఆహ్వానం పలికారు. బ్యూటీ స్కూల్ కూడా నిర్వహిస్తూ వచ్చారు. మహిళలతో పాటు మగవారికీ బ్యూటీ సేవలు అందిస్తున్నారు.
 
 యజమానులూ జీతానికే..
 ఏ రోజూ బ్యూటీ సెలూన్ నుంచి లాభాలు ఆశించలేదు ఆ సిస్టర్స్. సంస్థలో మిగతా వారి లాగానే ప్రతి నెలా జీతాలు తీసుకుంటూ వచ్చారు. సంస్థ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ అదే సంస్థలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని బ్యూటీ రంగానికి పరిచయం చేస్తూ అనూస్‌ను ఒక బ్రాండెడ్ సంస్థగా తీర్చిదిద్దారు. అలా పదేళ్లలోనే దేశవ్యాప్తంగా 17 నగరాల్లో 27 బ్రాంచ్‌లతో అనూస్ బ్యూటీ సామ్రాజ్యాన్నే నెలకొల్పారు.
 
 అందం వెంటే ఆత్మవిశ్వాసం..
 అందం వెంటే ఆత్మవిశ్వాసం ఉంటుందంటారు అనూస్ సిస్టర్స్. ‘మోములో ఏ చిన్న మచ్చ ఉన్నా ఏదో తెలియని బాధ. ఆ బాధ కెరీర్ కు అడ్డంకిగా మారుతుందనే వారు ఎందరో ఉంటారు. అలాంటి వారికి అందాన్ని తీర్చిదిద్ది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పురిగొల్పే ప్రయత్నం చేయడమే అనూస్ లక్ష్యం’ అని చెబుతారు అనురాధ. ‘అనిరుధ అమెరికాలోని బ్రాంచ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. మిగతా ముగ్గురం దేశంలోని పలు నగరాల్లో అనూస్ బాధ్యతలను చూసుకుంటున్నాం. మా జీవిత భాగస్వాములు కూడా మా అభిరుచిని గుర్తించి.. పూర్తి సహకారం అందించడం వల్లే బ్యూటీ రంగంలో మాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాం’ అని ఆమె అంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement