యువ చైతన్యం
యక్షగానం, కోయల జీవితం, డప్పు మోతలు, జానపదాలు నగరం నడిబొడ్డున వెల్లి విరిశాయి. నెహ్రూయువకేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో యువజన సదస్సు మంగళవారం ప్రారంభమైంది. కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక విభాగం ఛైర్మన్ రసమయి బాలకిషన్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కళాకారుల ప్రాచీన యక్షగానం అందరినీ ఆకట్టుకుంది.
కేవలం విందులు, వినోదాలకే పరిమితమైన డప్పును ఎన్నిరకాలుగా వాయించొచ్చో చెబుతూ రంగారెడ్డి కళాకారులు చేసి డప్పు విన్యాసాలు ఆహూతులను అలరించాయి. కళాకారుడు మొగులయ్య 12 మెట్ల కిన్నెరతో ఆలపించిన పాట మైమరపింపజేసింది. పది జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువజన సంఘాలు పాల్గొని తాము చేస్తున్న సేవ, భవిష్యత్‌లో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.
అంతరించి పోతున్న కళలకు పున రుజ్జీవం పోయడానికే యువత చేస్తున్న కృషిని అతిథులు కొనియాడారు. యూత్‌ను ఎంకరేజ్ చేసే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్‌ను తమ భుజాలపై మోస్తున్న యువతను కులాంతర వివాహాలవైపు నడిపిస్తూనే, వివిధ అంశాలపై కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న వచ్చిన మహిళా సంఘాలు వివరించాయి.
కళలను ప్రోత్సహించాలి
‘యక్షగానాన్ని కొన్ని తరాలుగా మేం కాపాడుకుంటూ... నేటి తరానికి అందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి కళలను, కళాకారులను ప్రోత్సహించాలి’ అని యక్షగాన కళాకారుడు నంబూద్రి ప్రసాద్ కోరారు. ‘అంతరించిపోతున్న జానపద కళలు, నాటి నాగరికతను నేటి యువతకు తెలియజేసేందుకు అందరం బృందంగా ఏర్పడ్డాం. చదువుకుంటూనే నాటికలు, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని తాండూరి విద్యార్థి హరీష్ చెప్పాడు.
చిత్రం సైదులు, నాగోలు ::: ఫొటోలు: సోమ సుభాష్