వెండితెర బంగారం
చిట్‌చాట్
నిత్య నూతన చిరునవ్వుతో.. టాలీవుడ్ జనాలకు దగ్గరైన నిత్యామీనన్.. చీరకట్టులో సింప్లీ సూపర్బ్ అనిపించింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం జరిగిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశంకర్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో... ఆయన కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్స్‌ను చూసి అచ్చెరువొందింది. ఈ సందర్భంగా నిత్యామీనన్‌తో సిటీప్లస్ చిట్‌చాట్..
నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి జర్నలిజం కోర్సు చేశా. హీరోయిన్ అవుతానని ఏనాడూ అనుకోలేదు. జర్నలిస్టుగా రాణించాలనుకున్నా. పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ తర్వాత నా ఆలోచనలను సినిమా ద్వారా చెప్పేందుకు నిర్మాత కావడం కోసం పూణెలోని ఎఫ్‌టీఐలో సినిమాటోగ్రఫీలో ఎన్‌రోల్ చేసుకున్నా. ఈ ఎంట్రెన్స్ సమయంలోనే నందినిరెడ్డితో పరిచయం ఏర్పడింది. హీరోయిన్‌గా నటించాలని బ్రెయిన్ వాష్ చేసింది. అలా మొదలైంది నా సినిమా కెరీర్.
చిన్నప్పటి నుంచీ చలాకీ...
స్కూల్ డేస్ నుంచే చలాకీగా ఉండేదాన్ని. ఇంట్లో కూడా బాగా అల్లరి చేసేదాన్ని. నా ముసిముసినవ్వులు, వినసొంపైన మాటలతో పేరెంట్స్‌ను కూల్ చేసేదాన్ని. కోపమొచ్చినా మరుక్షణంలో మరిచేలా నటించేదాన్ని. అలా నాకు తెలియకుండానే నటన వచ్చేసింది. పదో తరగతిలో ఉండగానే ‘ద మంకీ హూ న్యూ టూమచ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది.
అలా మొదలైంది...
నా కెరీర్‌కు దోహదపడిన ఈ భాగ్యనగరం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అలా మొదలైంది సినిమా చాలా వరకు సిటీ లొకేషన్స్‌లోనే తీశారు. ఈ షూటింగ్ ిపీరియడ్‌లోనే సిటీలోని చారిత్రక కట్టడాలు చూసేశాను. నాకు డ్రెస్ వేసుకోవడం కంటే.. చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంటాను. హైదరాబాదీ డిజైనర్స్ చేతిలో అట్రాక్షన్‌గా రూపుదిద్దుకున్న చీరలు భలేగా ఉంటాయి.
అ మజానే వేరు..
సిటీఫుడ్ అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారాకు వెళ్తుంటా. అక్కడ లేక్ పక్కన ఉన్న కుర్చీల్లో కూర్చొని బిర్యానీ తింటే ఆ మజానే వేరు. స్పైసీ ఫుడ్ కూడా నోరూరిస్తుంటుంది. సరికొత్తగా కనిపించిన ఏ వంటకాలనైనా టేస్ట్ చూడనిదే
వదిలిపెట్టను. సినిమా పరంగా అయితే ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మంచి పేరునే తెచ్చిపెట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తిలో చేసింది చిన్న రోల్ అయినా నటన సంతృప్తినిచ్చింది. ఓకే బంగారంలోని నా పాత్ర రియల్ లైఫ్‌కి అతికినట్టు సరిపోతుంది.
సొంతూరు వెళ్తున్నా....
ఇన్నాళ్లు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నా. రెండు నెలల పాటు బ్రేక్‌ను ఇవ్వాలనుకుంటున్నా. బెంగళూరుకు వెళ్లి కుటుంబసభ్యులతో గడుపుదామనుకుంటున్నా. ఆ తర్వాత బెంగళూరు డేస్ రీమేక్ తెలుగు మూవీలో నటించబోతున్నా. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటా. రాస్తుంటా. కూర్చొని ఆలోచిస్తుంటా. అయితే ఆర్ట్ వేయడమనేది ఓ విద్య. అంత కష్టమైన పనిని నేను చేయలేను.