ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి
ఉత్తమ నటీమణులు నిత్యామీనన్, మానసీ పరేఖ్
ఉత్తమ చిత్రం మలయాళ ‘ఆట్టమ్’ ∙ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా
ప్రాంతీయ ఉత్తమ చిత్రం ‘కార్తికేయ 2’
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...
ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్‌ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.
భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి.
చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్‌కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.
ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.
జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు....
⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ)
⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ)
⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ)
⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)
⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ)
⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం)
⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ)
⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి)
⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం)
⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1)
⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్)
⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ)
⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ)
⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్‌మోహర్ – హిందీ)
⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం)
⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం)
⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ)
⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).
ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు
⇒తెలుగు: కార్తికేయ–2
⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2
⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1
⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009
⇒హిందీ: గుల్‌మోహర్
అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి
‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది.
టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్‌స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.
నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.
కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.
ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.
కెరాడి టు పాన్ ఇండియా
కర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.
‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment