ముఝె అస్లీ రంగ్ దే.. | mujhe Asli rang de | Sakshi
Sakshi News home page

ముఝె అస్లీ రంగ్ దే..

Published Thu, Mar 5 2015 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

ముఝె అస్లీ రంగ్ దే..

ముఝె అస్లీ రంగ్ దే..

ఒక చెంపకు బంతి.. మరోవైపు చామంతి. ఇదిగో మోదుగ.. అదిగో ఇండిగో ! పూవులో పూవునై.. రంగులో రంగునై ఈ హోలీ ఆడుకోనా..! ఆడుకున్నా.
 
 హోలీ ఆయారే !! ఎటు చూసినా రంగుల మయం. అసలు ప్రక ృతే హోలీలో ఆడినట్టు ఎటు చూసినా రంగు రంగుల్లో విరబూసిన పువ్వులే. ఏ పండుగైనా ప్రకృతే ప్రేరణ. అందుకే కాబోలు వసంత ఆగమనానికి స్వాగతం పలికేందుకు ప్రకృతిలోని రంగులతో మమేకమై రంగులనే పండుగగా మార్చేశాం.
 
  పురాణాలు ఎన్ని కథలు చెప్పినా, వాటన్నిటికీ అతీతంగా హోలీని చేసుకుంటున్నాం. నిజానికి ఈ రంగుల పండుగలో రంగులు తప్ప మరో అంశానికి ప్రాధాన్యమే ఇవ్వం. హోలీ ఎందుకు చేసుకుంటున్నారు అనే ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు. అయినా కూడా రంగులాటలో ఉత్సాహంగా పాల్గొంటారు. హోలిక వధ, కాముని దహనం కథ, కృష్ణ రాసలీల గాథ.. కారణం ఏదైనా కానీ మనం మాత్రం ఇప్పుడు రంగుల కోసమే హోలీ ఆడుకుంటున్నాం.
 
 రంగు పడుద్ది..
 బృందావనంలో పసుపు నీళ్లాటలు, మోదుగ పూల రంగుతో వసంతాలు.. వినడానికి ఎంత బావున్నాయో. ఇవన్నీ తాతల జమానాలోనే అంతరించాయి. నెల రోజులు రుద్దినా పోని గులాల్, నాలుగు రోజులు మెరిసే సునేర్.. ఇవీ ఇప్పటి హోలీ ట్రెండ్స్. వీటితో పాటు మరెన్నో కొత్త రంగులు మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ రంగులు వేటితో తయారు చేస్తున్నారు..?, అందులో పదార్థాలేమిటి..? అని మనం అడగం, వారు ప్రకటించరు. గుడ్డి నమ్మకంతో కొనేస్తాం, ఆడేస్తాం. పైగా ఎంత ఎక్కువ రోజులు నిలిచే రంగైతే అంత మంచిదని కొనుక్కునే వారూ ఉన్నారు. ఆ రంగులను మరింత చిక్కగా మార్చడానికి  ఏవేవో ప్రయోగాలు చేసేస్తారు. ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన
 విభాగాలు వీటిపై ఓ కన్ను వేయాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్లు, అలర్జీల వంటి
 ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న రీసెర్చిల హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. మరీ
 చేజారకముందే ప్రభుత్వ పరమైన పర్యవేక్షణ పెరగాలి. ప్రజల్లో కూడా అవగాహన,
 విచక్షణ కలగాలి. రంగుల గురించి అవగాహన మాట అటుంచితే, హోలీ విచక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రంగులాటలో ఆనందహేల ఎంతుంటుందో.. అపశ్రుతుల కేళి కూడా జరుగుతుంటుంది.
 
 గుడ్డు పగులుద్ది..
 రంగుల్లో ముంచెత్తే పర్మిషన్ ఇవ్వకనే ఇచ్చే పండుగ హోలీ. ఆ ముసుగులో మర్యాదల గీత దాటే సంప్రదాయమూ కనిపిస్తుంది. వద్దన్న వారికీ రంగులు పూయటం ఓ సరదా కానీ తెలియని వారిపై కూడా రంగుల దాడి చేయడం ఎంత వరకు సమంజసం. కానీ హోలీలో అవేమీ చెల్లవనే ధీమాతో మర్యాదాతిక్రమణ జరిగిపోతూ ఉంటుంది.
 
 ఇక రంగులు కాకుండా కోడి గుడ్లు, టమాటాలు, గ్రీజు వంటివి కూడా హోలీలో చోటు సంపాదించాయంటే ఈ రంగులాటకి అవమానం కాదూ. ఇక డబ్బున్న వర్గాల్లో హోలీ పార్టీల పేరుతో రెయిన్ డ్యాన్స్‌లు సాధారణంగా కనిపిస్తాయి. డబ్బున్నవారు నీళ్లు కొనుక్కోగలరు, ఆ నీళ్లు వేస్ట్ చేయగలరు. ఆ రెయిన్ హోలీ వెనుక వేస్జేజ్ వారికి పట్టదు. ఇక హోలీలో భంగు సంప్రదాయం ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ రూపంలోకి  తర్జుమా కావడం సంపన్న వర్గాలని కలవరపరచాల్సిన అంశం.
 
 పండుగ పండుద్ది..
 కొత్తదనం పేరుతో హోలీ రూపాంతరం చెందుతోంది. అసలు ఆనందం మాయమవక ముందే మేల్కొందాం. క్రోమియం, లెడ్, సిలికా వంటి కెమికల్స్‌ని రంగుల తయారీలో ఉపయోగిస్తున్నారన్న అవగాహన ఎప్పట్నుంచో మీడియా కల్పిస్తూనే ఉంది. మరి సహజమైన హోలీ వైపు మన అడుగులు ఎందుకు పడట్లేదు. కొన్నేళ్ల కిందటి వరకూ సహజ రంగులు మార్కెట్లో అందుబాటులో ఉండేవి కావు. కానీ, మూడునాలుగేళ్లుగా ఆర్గానిక్ రంగులపై రీసెర్చి బాగా జరిగింది. ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగింది. ఇక వాడకం పెంచాల్సిన బాధ్యత మనదే. మోదుగ నీరు, పసుపు నీరు వంటి ఇంటి చిట్కాలే కాదు, మార్కెట్లో వివిధ మొక్కల నుంచి తయారు చేసిన రంగులూ అందుబాటులో ఉన్నాయి. బంతి పువ్వులు, ఇండిగో దానిమ్మ వంటివి మనకు హాని చేయని పదార్థాలు. వాటితో తయారు చేసిన రంగులను ఉపయోగిద్దాం. హెచ్‌వైడీ గో గ్రీన్, డీడీఎస్ వంటి సంస్థలు సహజ రంగులను మార్కెట్‌లో అందుబాటులో ఉంచారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సహజ రంగుల వైపు మీరూ ఒక అడుగు వేసి చూడండి. హోలీ మరింత హ్యాపీ హోలీ అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement