ఈ వారం కథ: మసాన్‌ హోలీ | sakshi funday special story on Holi | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: మసాన్‌ హోలీ

Published Sun, Mar 16 2025 8:25 AM | Last Updated on Sun, Mar 16 2025 8:25 AM

sakshi funday special story on Holi

బ్లూసీ కేఫ్‌లో టీ తాగి బయటకొచ్చి నిలబడి, సిగరెట్‌ వెలిగించుకొని కాసేపు రోడ్డు అవతల కనిపిస్తోన్న సిటీ బస్టాపు వైపు, దాని పక్కనే ఉన్న మెట్రోస్టేషన్స్‌ వైపు చూస్తూ సిగరెట్‌ అంత్యక్రియల్లో చివరిదాకా పాల్గొని..పుట్‌పాత్‌ సందులోంచి తన యాభైఏళ్ల వయసు దాటుతోన్న పాదాలను ఆడించుకుంటూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్స్‌  కి చేరుకున్నాడు సత్యానంద్‌. ప్రయాణికుల్ని ఒరుసుకుంటూ డిసెంబర్‌ నెల చలికూడా రైల్వేస్టేషన్స్‌ లోకి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ‘మణుగూరు వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడవనెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ మీద...’లోయర్‌బెర్త్‌ మీద కూర్చొని విండోతెరిచి సెల్‌ఫోన్లో టైం చూశాడు. పదకొండున్నర.   మిడిల్‌బెర్త్‌ ప్రయాణికుడు ఇంకా వచ్చినట్టు లేడు. అప్పర్‌బెర్త్‌ మీద అప్పటికే దుప్పటి కప్పుకొని పడుకొన్న వ్యక్తి ఒక చెయ్యిని తలకింద పెట్టుకొని, మరోచేత్తో పట్టుకున్న సెల్‌ఫోన్స్‌  వెలుతురు ముఖం మీద పడుతుంటే రీల్స్‌ చూస్తూ పడీపడీ నవ్వుతున్నాడు. చెప్పులు విప్పి సీటు కిందకు నెట్టి బాసింపట్టు వేసుకుని కిటికీలోంచి బయటికి చూశాడు.

ప్లాట్‌ఫాం మీద మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. మీరందరూ వెళ్లిపోతే నేను కాసేపు కునుకు తీస్తాను అన్నట్లు అలసిన దేహంతో కనిపిస్తోంది రైల్వేస్టేషన్స్‌ .రైలు కదిలింది. చివరి నిమిషంలో పరుగెత్తుకుంటూ వచ్చి రైలెక్కినట్లున్నాడు ఆయాసపడుతూ మిడిల్‌బెర్త్‌ యువకుడు. బ్యాక్‌ప్యాక్‌ సీట్లో పెట్టి, పక్కన కూర్చొని షూస్‌ విప్పుకుంటూ ‘నాది మిడిల్‌బెర్త్‌ అంకుల్, మీరెక్కడిదాకా?’ అని అడిగాడు. ‘భద్రాచలం’ చెప్పాడు సత్యానంద్‌.‘మాది వరంగల్‌. మీకు నిద్రొచ్చినపుడు చెప్పండి బెర్త్‌ మీదకు వెళ్తాను’ అన్నాడా యువకుడు.‘థాంక్యూ... ఒక అరగంట’ అని తిరిగి కిటికీలోంచి బయటికి చూశాడు సత్యానంద్, కిటికీ అవతల ఒక్కో దృశ్యం వెనక్కి జారిపోతోంది. సికింద్రాబాద్‌ స్టేషన్స్‌  పరిసరాల నుండి అనుబంధం తెంచుకుంటోంది రైలు. రివ్వున కిటికీలోంచి వీచిన చల్లగాలికి అద్దం కిటికీ  కిందికి దించబోతుండగా రేపు ఉదయమెప్పుడో సికింద్రాబాద్‌ నుండి వారణాసి వైపు వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ పొగమంచులో తడుస్తూ కనిపించింది మసక మసగ్గా.

గోదావరి నదివైపుకీ, గుడికీ వెళ్లాల్సిన ప్రయాణికులు దిగే స్టాప్‌లో బస్సు దిగి, ఆటో ఎక్కి గోదావరి వద్ద దిగి ఇరవైదాకా ఉన్న కరకట్ట మెట్లెక్కి అలసట తీర్చుకోడానికి కాసేపు నిలబడి ఎదురుగా మెట్లకింద కొద్ది దూరంలో లేతసూర్యకాంతిలో ఆవిరవుతున్న పొగమంచులో నింపాదిగా ప్రవహిస్తోన్న నదివైపు చూశాడు సత్యానంద్‌.పూజాసామాగ్రి అమ్మే షాపులు ఒక్కొక్కటీ తెరుస్తున్నారు, పితరులకు తర్పణం అర్పించడానికి వచ్చిన కొందరు పూజారులతో కలిసి మెట్లు దిగుతున్నారు.వీపుకి తగిలించిన బ్యాక్‌ప్యాక్‌ సవరించుకుని తను కూడా నదివైపు వెళ్లడానికి మెట్లు దిగసాగాడు సత్యానంద్‌. వెనక కొంచెం దూరంలోని మైకులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రంలోంచి ‘ఏడనున్నాడో భద్రాద్రి వాసుడు’  కీర్తన వినిపిస్తోంది. ఏడనున్నాడో... అన్న శబ్దం వినగానే సత్యానంద్‌కి నలభై ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు. అతని జ్ఞాపకాల్లో గతం  ఇసుకలా రాలడం మొదలుపెట్టింది.

నలభై ఏళ్ల క్రితం సంగతి. సత్యానంద్‌కి పన్నెండు ఏళ్లుంటాయి. నమ్మిన స్నేహితుడు మోహన్స్‌ రావు వ్యాపారంలో సత్యానంద్‌ తండ్రి శివరాంను మోసం చేస్తే, ఖైరతాబాద్‌లో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి ముప్పాతిక భాగం అప్పులు తీర్చి అద్దె ఇంట్లోకి మారారు. ఇంక ఏ వ్యాపారం జోలికి పోకుండా చిన్న ప్రైవేటు కంపెనీలో జీతానికి కుదిరాడు శివరాం. బొటాబొటి సంపాదన దానికితోడు పావుభాగం అప్పులు శివరాం ఖాళీజేబులకీ, అతని భార్య లక్ష్మీకాంతం చెవులకీ గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంట్లో దంపతులిద్దరి మధ్యా చిన్నగా గొడవలు మొదలయ్యాయి.  బంధువుల సూటిపోటి మాటల దగ్గరి నుండి అద్దె ఇంటి ఓనరమ్మ కళ్లల్లో అప్పుడప్పుడూ కనిపించే చిన్నచూపు వరకూ లక్ష్మీ కాంతానికి చిరాకు తెప్పించేవి, తల్లిదండ్రుల మధ్య క్రమంగా పెరుగుతున్న గొడవ చూసి ఒకరోజు రాత్రి, ‘నేను స్కూల్‌ మానేసి ఏదైనా పనిలో చేరుతాను నాన్నా’ అన్నాడు ఏడవతరగతి చదువుతున్న సత్యానంద్‌.

కళ్లవెనుక తిరిగిన నీళ్లు బయటికి రాకుండా ఆపి ‘ఒద్దు బిడ్డా, నువ్వూ చెల్లాయి బాగా చదువుకొని బంధువుల్లో మన గౌరవం నిలబెట్టాలి’ అన్నాడు శివరాం కొడుకు సన్నని మెడపై ఉన్న తలను తన గుండెవైపుకు అద్దుకుంటూ. ఒకరోజు రాత్రి దంపతులిద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.‘‘దోస్తు దోస్తు అని వాడు చెప్పిన మాటలు విని దొరికిన కాడికి అప్పులు చేసి ఒక్కటి కాకుండా రెండు వ్యాపారాల్లో చేయిపెడితివి. అందులో ఒకటి సారా కాంట్రాక్టు. నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ మోహన్స్‌ రావుగాడు తెలివిగా డబ్బులన్నీ వాడి ఖాతాలో వేసుకొని నీకు నష్టాలు చూపెట్టాడు. చేతకాని వాడివి చేతకానివాడిలా ఉండాల్సింది. ఇవి నా మాటలు కాదు. మా అన్నదమ్ములు, బంధువులు అంటున్న మాటలు.’’ అన్న భార్య మాటలు గట్టిగా తగిలాయి శివరాం మనసుకి. వేరే ఎవరైనా అంటే ఏమోకానీ తన భార్య తనని ‘చేతకానివాడు’ అన్న మాట అతన్ని తీవ్రంగా వేధించింది. తనూ కుటుంబాన్ని పోషించడానికేగా వ్యాపారంలోకి దిగింది. కాకపోతే మోసపోయాడు.

ఏమనుకున్నాడో ఏమో తెల్లవారుఝామున ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.  అప్పట్నుండీ ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం శివరాం బావమరుదులు ఎన్ని చోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎక్కడోచోట ఏడుస్తూ ఉంటాడులే అక్కా’ అని   ఓదార్పు మాటలు, ‘నాకంట పడాలే కానీ’ అనే చిన్నతమ్ముడి ఆవేశపు మాటలు లక్ష్మీ కాంతం చెవుల వద్ద నెమ్మదిగా సెలవు తీసుకున్నాయి. క్రమంగా శివరాం ఆ కుటుంబానికి ఎప్పుడో కాని గుర్తు వచ్చేలా వాళ్ల  మనసులో ఒక మూల చీకట్లో ఉండిపోయాడు.

సత్యానంద్‌కి మాత్రం తండ్రి అప్పుడప్పుడూ కలలో కనిపించేవాడు. అమ్మానాన్న చెల్లాయిలతో కలిసి భద్రాచలం గోదావరిలో తుళ్లింతలు కొడుతూ బాల్యంలో తను స్నానం చేసిన దృశ్యం కలలో అతనికి ఏడాదికి రెండుసార్లయినా వచ్చేది. ముఖ్యంగా హోళీ పండుగనాడు తన తండ్రి భద్రాచలం తీసుకెళ్లేవాడు. ఏ రంగులూ వాడకుండా పసుపు కుంకుమలు రుద్దుకొని అమ్మనాన్న గోదావరి ఒడ్డున హోళీ ఆడుకునేవారు. శివరాం భార్య లక్ష్మీకాంతం కుటుంబంతో భోజనం చేసే సమయంలో ఎప్పుడో ఒకసారి భర్త గుర్తుకొచ్చి పిల్లల్తో, ‘ఆ రోజు రాత్రి నేను మీ నాన్నని... చేతకాకపోతే అని తిట్టి ఉండాల్సింది కాదు. నిజానికి అది నా మాట కూడా కాదు.

బంధువుల నోట్లోంచి వినీ వినీ విసుగొచ్చి తట్టుకోలేక అన్నమాట. అయినా ఆ మాట  అనకుండా ఉండాల్సింది’ అని గుడ్లనీరు కక్కుకుంటుంటే ‘ఏదో బాధ తట్టుకోలేక అంటే మాత్రం ఆయన ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోవాలా’ అని ఎదుగుతున్న కూతురు తండ్రిని కోపంగా గుర్తుచేసుకునేది.ఇంటర్‌ అర్హతతో సత్యానంద్‌కి రైల్వేలో ఉద్యోగం వచ్చాక చర్లపల్లిలో ఒక ప్లాటు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని శివరాంలేని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందా కుటుంబం. మరుసటి ఏడాదే చిన్నతమ్ముడికి తన కూతురినిచ్చి పెళ్లిచేసింది లక్ష్మీ కాంతం.నదుల అద్దాల్లో తమ ముఖాల్ని చూసుకుంటూ ముందుకు కదులుతోన్న మేఘాల్లాగా సాగిపోయింది కాలం.నాలుగురోజుల క్రితం ఆదివారపు న్యూస్‌పేపర్లో తన తండ్రిని వ్యాపారంలో మోసం చేసిన మోహన్‌రావు దశదిన కర్మ ప్రకటన కనిపించింది సత్యానంద్‌కి. ‘పాపి చిరాయువు అంటారు. నూరేళ్లు నిండకుండానే పోయాడన్న మాట మా కాపురంలో చిచ్చుపెట్టి’ అంది ఆ వార్త విని లక్ష్మీ కాంతం. సత్యానంద్‌కి కళ్లముందు తండ్రి మెదిలాడు. మోహన్స్‌ రావు చనిపోయిన వార్త తన తండ్రికి తెలుసోలేదో, అసలింతకీ తన తండ్రి బతికే ఉన్నాడో లేదో తెలియదు.

జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాడు సత్యానంద్‌. భద్రాచలం గోదావరి ఒడ్డున చివరిమెట్టు దిగాక కాళ్లకు ఇసుక మెత్తగా తగిలింది. నీళ్లుపాడిన పాటలో కరిగి కన్నీరైపోయిన రాళ్ల సూక్ష్మ అవశేషాల్లాంటి తీపిలేని చక్కెరచుక్కల ఇసుక రేణువులపై నడుచుకుంటూ గోదావరివైపు కదులుతుండగా మళ్లీ తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు.‘భద్రాచలం అంటే చాలా ఇష్టంరా సత్యానంద్‌. చిన్న ఊరు.. పెద్దగోదావరి.. ఆయనెవరో కంచర్ల గోపన్న కట్టిన గుడి. ప్రశాంతంగా అయిపోయే దర్శనం. చిన్నప్పుడు మా అయ్యశివయ్య ఎందుకోగానీ పండుగ రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లేవాడు. కాబట్టి ఎప్పుడూ మేం ఇబ్బంది పడిందిలేదు. మా అయ్యకు భద్రాచలం అంటే బాగా ఇష్టం, కానీ ఎందుకో కాశీ విశ్వేశ్వరుడి పేరు చెబితే చాలు కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. అందుకేనేమో నాకు శివరాం అని పేరు పెట్టాడు’ అని తన తండ్రి శివరాం వాళ్ల నాన్న శివయ్యను గుర్తుకు చేసుకునే సందర్భం ఎందుకో గుర్తుకొచ్చింది సత్యానంద్‌కి.

జనసంచారం లేని చోటికి వెళ్లాడు సత్యానంద్‌. ఇసుకలో బ్యాగ్‌పెట్టి, ప్యాంటూ షర్టూ విప్పి గోదావరిలోకి అడుగుపెట్టి నీళ్లల్లో కూర్చున్నాడు.అతని గొంతువరకూ వచ్చాయి నీళ్లు. భద్రాచలం ఊరి మీది నుండి పైకి లేస్తున్నాడు సూర్యుడు. కరకట్ట మీది నుండి గోదావరివైపుకు మెట్లుదిగుతున్న భక్తుల సంఖ్య పెరిగింది. ఒక మెట్టు అంచున అప్పుడే వచ్చినట్లున్న వృద్ధ కాషాయధారి అక్కడ కూర్చోడానికి అప్పుడే మెట్టుమీద గుడ్డ పరుచుకుంటున్నాడు.‘ఒకవేళ నాన్న ఇల్లువదిలిపెట్టి వెళ్లిపోయిన ఆ రాత్రి సరాసరి భద్రాచలం వచ్చి ఉంటాడా? ఆయన ఆచూకీ కోసం ఈ ఊరికి కూడా వెళ్లి వెదకమని అమ్మ మావయ్యలకు చెప్పి ఉంటుందా? తను అప్పుడు చాలా చిన్నవాడు. తనకి గుర్తొస్తే తను చెప్పేవాడేమో! ఒకవేళ ఇక్కడికి వచ్చి తన తండ్రి నలభై సంవత్సరాల నుండీ ఇక్కడే ఉండిపోయి ఉంటాడా?’ హఠాత్తుగా కలిగిన ఈ ఆలోచనకు ఒళ్లు ఝల్లుమంది సత్యానంద్‌కి.‘ఒక్క రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి తన తండ్రి కనిపిస్తాడేమో చూడాలి’ అనుకున్నాడు గోదావరిలో ఒక మునకవేస్తూ.. తర్వాత రెండో మునక.. మూడో మునక వేసి ఎందుకో.. నీళ్లలోనే కొన్నిక్షణాలు అలా ఉండిపోయి.. మనసులో ఇలా అనుకున్నాడు ‘మోహన్స్‌ రావు చనిపోయాడు నాన్నా’..(2025).

(1995)    
లలితాఘాట్, వారణాసి (కాశీ) (ఫాల్గుణశుక్ల ద్వాదశి) స్నానం చేయడానికి గంగానదిలో దిగి రెండు మునకలు వేసి మూడో మునక వేయగానే నలభైఏళ్ల శివరాంకు భవిష్యత్‌ కాలంలోంచి వినిపించినట్లు ఏవో మాటలు వినిపించాయి నీళ్లల్లోంచి.‘మోహన్స్‌ రావు చనిపోయాడు నాన్నా’ దిగ్గున నీళ్లలోంచి తలబయటికి తీశాడతను. ఈ అకస్మాత్‌ పరిణామానికి కొన్ని క్షణాలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెలియకుండా నోట్లోకి వెళ్ళిన నీళ్లను బయటికి వదిలి నోటితోనే గట్టిగా  గాలి పీల్చుకున్నాడు. కాలంలో ముందెక్కడో ఉన్న సుదూరతీరం నుండి పాములా నీళ్లలో పాక్కుంటూ వచ్చి చెవిదగ్గరికి రాగానే నీటిబుడగలా పేలిపోయిన శబ్దంలోంచి వచ్చినట్లుగా వినిపించాయా మాటలు .  ‘మోహన్స్‌ రావు చనిపోయాడు నాన్నా’ .

యాభైఏళ్లు దాటిన వ్యక్తి గొంతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయా మాటలు. గొంతులో ఇంకా ఎండిపోని లేతదనం, సన్నని జీరను బట్టి ఆ గొంతు తన కొడుకు సత్యానంద్‌ది అని శివరాం పోల్చుకున్నాడు. ‘తను వాడి పన్నెండవ ఏట ఇల్లువిడిచి పెట్టి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇరవై  ఏళ్లు దాటుంటాయి. మరి యాభై ఏళ్ల వయసున్న వ్యక్తి గొంతులోంచి వచ్చిన మాటల్లా ఉన్నాయేంటి. అంటే తన కొడుక్కి యాభైఏళ్లు దాటాక మోహన్‌ రావు చనిపోతాడా?ఈ భవిష్యత్‌వాణి ఇప్పుడెందుకు వినిపించిందో? ఇల్లు విడిచిపెట్టి వచ్చిన ఈ పదేళ్లలో ఇలాంటి అనుభవం నాకెప్పుడు కలుగలేదు. ఇదంతా తన భ్రమ అయి ఉంటుందా? నీళ్లలో వినిపించిన మాటల్లోని శబ్దతీవ్రత ఇది భ్రమకాదు అన్నట్లుగా ఉంది. కాశీలో ఇలాంటి అనుభవాలు సాధారణమేనా?’ శివరాం ఆలోచనల్ని తెంచివేస్తూ అతడు స్నానంచేస్తున్న లలితాఘాట్‌ పక్కనున్న విశ్వనాథ మందిరం అవతలనున్న మణికర్ణికా ఘాట్‌నుండి ఏవో శబ్దాలు వినిపించాయి.అక్కడ ‘మసాన్స్‌  హోలీ’ వేడుక  జరుగుతోంది. దహనక్రియలు జరిగిన వాళ్ళ చితాభస్మాన్ని  చల్లుకుంటూ అఘోరాలు, బైరాగులు, సన్యాసులు, భంగు సేవిస్తూ ఢమరుకం వాయిస్తూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నృత్యం చేస్తున్నారు. శవదహనం జరిగే మణికర్ణికా ఘాట్‌వద్ద ప్రతిఏటా ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు జరిగే వేడుక ‘మసాన్స్‌  హోలీ’. మసాన్స్‌  అంటే శ్మశానం, శ్మశానంలో జరిగే హోలీ.

కాశీలో ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం పార్వతీపరమేశ్వరుల వివాహానంతరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినాడు పార్వతిని పరమేశ్వరుడి చిరునామా అయిన కాశీలోని విశ్వనాథ మందిరానికి తీసుకొచ్చారు. ఆ వేడుకని పురస్కరించుకొని శివుడు దేవతలు, గంధర్వులతో కలసి ఉల్లాసంగా హోలీ ఆడాడు. ఆ హోలీయే రంగోభరీ ఏకాదశి. ఆ వేడుకలో పాల్గొనలేకపోయిన భూత ప్రేత పిశాచాలు శివగణాలు, అఘోరాల కోసం మరుసటి రోజైన ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు శివుడు సతీసమేతంగా మణికర్ణికాఘాట్‌కి వచ్చి వీరితో కలిసి భస్మ హోలీ ఆడాడు.ఆ సంప్రదాయమే కాశీలోని మణికర్ణికాఘాట్‌ వద్ద ఏటా కొనసాగుతోంది.గంగలో స్నానం పూర్తిచేసుకొని ఒడ్డున ఉన్న మెట్లవైపు కదులుతుండగా శివరాంకు మళ్లీ నీళ్లల్లో  వినిపించిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనించాయి. ‘మోహన్స్‌ రావు చనిపో.......’అప్రయత్నంగా మణికర్ణికాఘాట్‌వైపు చూశాడు. మసాన్స్‌  హోలీ దద్దరిల్లుతోంది అక్కడ, చితాభస్మం గాల్లోకి లేస్తోంది. సన్యాసుల, బైరాగుల, అఘోరాల నృత్యకేళి చిందులేస్తోంది.

‘మోహన్స్‌ రావు చనిపోయిన వార్త, చితాభస్మలేపన మసాన్స్‌  హోలీ హేల ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? రెండు విషయాలు ఒకే రోజున జరగడంలో అంతరార్థం ఏదైనా ఉందా.. ఎవరు చెబుతారు?’ అనుకుంటూ మెట్లమీద అడుగులు వేశాడు శివరాం.‘ఎల్లుండి పౌర్ణమిరోజు రాత్రి గంగఒడ్డున కూర్చొని చంద్రున్ని చూడు’ అని వృద్ధ్ద సన్యాసిని ఒక యువ సన్యాసినితో చెబుతున్న మాటల పక్కనుండి నడిచి మెట్ల పైకి వచ్చి తల తుడుచుకొని బట్టలు  మార్చుకుంటుండగా శివరాంకి తన కుటుంబం గుర్తుకొచ్చింది.‘పిల్లలేం చేస్తున్నారో? కొడుకు సత్యానంద్‌కి ఇరవైయేళ్లు దాటి ఉంటాయి. కూతురు ఏం చదువుతోందో? అది వాళ్లమ్మతో కలిసి నన్ను తిట్టుకునే ఉంటుంది. లక్ష్మీకాంతం.. ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనని ఇంకా..భార్య గుర్తుకురాగానే తను కాశీకి వచ్చిన కొత్తలో తనలాగే ఇల్లువిడిచి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి చేరి ఒక సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో తెలుగులో ఏదో గొణుక్కుంటూ తనకి పరిచయమైన సుందర్రావు గుర్తుకొచ్చాడు శివరాంకు. అతనిది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు. గయ్యాళి భార్య నోటికి వేగలేక ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరి ఎందుకో మనసు మార్చుకొని ఎక్కడెక్కడో తిరిగి చివరికి కాశీకి వచ్చిచేరాడు.

ఆ పరిచయంతో అప్పుడప్పుడు సాయంత్రాల్లో గంగాఘాట్ల వద్ద కలుస్తూ  ఉండేవాడు.‘చచ్చినా తిరిగి ఇంటికి వెళ్లను’ అనేవాడు తరచుగా తన భార్య ప్రస్తావన వచ్చినపుడు. ‘చస్తే ఇంకేం వెళ్తావులే’ అని తనంటే పెదాల్ని చెవులదాకా సాగదీసి శబ్దంలేకుండా నవ్వేవాడు. ఆ నవ్వులో అమాయకత్వానికి పుట్టిన బిడ్డలాంటి ఏదో అందం ఉండేది.  ఉన్నట్లుండి ఒకరోజు సాయంత్రం హరిశ్చంద్రఘాట్‌ దగ్గర కనిపించి ‘రేపుదయం ఇంటికి బయలుదేరుతున్నాను’ అన్నాడు. ‘అదేంటీ చచ్చినా ఇంటికి వెళ్లనని పదేపదే చెప్పేవాడివి కదా.. హఠాత్తుగా ఏంటీ మార్పు. 

ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?’ అని తను అడిగితే,‘ఈ కాశీలో ఉండడం కష్టమైపోతోంది శివరాం. నా భార్యపేరు అన్నపూర్ణ. ఆ పేరు ఇక్కడ ఎవరో ఒకరి నోటినుండి రోజూ వినబడుతూనే ఉంటుంది. ‘అన్నపూర్ణ మాతాకీ జై’అంటూ. వినపడకపోయినా ఏదో ఒక బోర్డుమీద ఆ పేరు కనబడుతూనే ఉంటుంది.కాశీకి వచ్చినప్పటి నుండీ అన్నం తింటున్నప్పుడల్లా నా భార్య అన్నపూర్ణే గుర్తుకొస్తోంది. ఇక ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనని అర్థమైంది. నా పెళ్లాం గయ్యాళిదే కావొచ్చు. కానీ లౌక్యం తెలియని వెర్రిమాలోకం. అడుక్కునే బిచ్చగాడికి కూడా ఆమె వాలకం చూస్తే మోసం చేయాలనిపిస్తుంది.

ఇంటికి వెళ్లి చూస్తాను. రానిచ్చిందా  ఉండిపోతాను. మళ్లీ గయ్యాళి గంగమ్మ వేషం వేసిందా..’ అని గంగానది వైపు చూసి, ‘భరిస్తాను.. ఉండిపోతాను.. పాపం దానికి పిల్లలు కూడా పుట్టలేదు’ అని తన దగ్గర సెలవు తీసుకొని మెట్లెక్కి వెళ్లిపోయాడు.  అతని వెనుకే మిగిలిన ఆ సాయంత్రపు నిశ్శబ్దంలో తనకి తన భార్య లక్ష్మీకాంతం గుర్తుకొచ్చింది.‘తన భార్య పేరు కూడా అన్నపూర్ణో, విశాలాక్షో అయితే సుందర్రావులా తనూ ఇంటికి బయలుదేరి వెళ్లేవాడా?’ అనుకున్నాడు ఆ నది ముందు నిల్చొని.వెంటనే ఆరోజు రాత్రి తన భార్య అన్నమాటలే మళ్లీ మెదిలాయి మనసులో.

ఒకవేళ మనస్సు మార్చుకొని ఇల్లు విడిచిపెట్టివచ్చిన ఈ పదేళ్ల తర్వాత తను కూడా అతడిలా తిరిగి  ఇంటికి వెళ్తే తన భార్యపిల్లలు ఇంట్లోకి రానిస్తారా? ‘ఎక్కడ చచ్చావ్‌ ఇంతకాలం’ అంటారా? ముఖ్యంగా తన చిన్న బావమరిది ముందు మెడపట్టుకొని బయటికి నెట్టేస్తాడు. వాడిదసలే దుడుకు స్వభావం. వాళ్ల చేతుల్లో అలాంటి అవమానం పొందేకంటే ఈ కట్టె కాశీలో కాలిపోవలసిందే’ అనుకున్నాడు ఆ రాత్రి సుందర్రావు వెళ్లిపోయిన వైపు మరోసారి చూసి.గత స్మృతుల్లోంచి బయటికొచ్చాడు శివరాం. అతనికి ఎందుకో టిఫిన్స్‌   చేయాలనిపించలేదు. మెట్లపైకి వెళ్లి టీ తాగి వచ్చి ఎండ పెరుగుతున్నా పట్టించుకోకుండా ఘాట్‌వద్దే కూర్చొని మసాన్స్‌ హోలీ వేడుకనే చూడసాగాడు. మధ్యాహ్నం పన్నెండవుతోంది. మణికర్ణికాఘాట్‌ వద్ద మసాన్స్‌ హోలీ ఆడుతున్న వాళ్లంతా నృత్యం చేస్తూనే ఎందుకో గంగానది వైపు చూడసాగారు.

(2030)ఊరుచివరి శ్మశానం:
చితిమీద ఎనభైఏళ్ల వృద్ధుడి భౌతిక కాయానికి నిప్పంటించి మేఘాలు దట్టంగా కమ్మిన ఆకాశం కింద మిగిలిన కార్యక్రమాలన్నీ చకచకా కానిచ్చేసి మృతుడి తాలూకు వాళ్లంతా ఇళ్లవైపు బయలుదేరాక భోరున వర్షం మొదలైంది.అంచుల్లో పెచ్చులూడిపోయి బాగా మసిపట్టిన సిమెంటురేకుల షెడ్డుకింద కాలుతున్న చితి మంటని కర్రతో సవరించి ఆ షెడ్డుకి కొంత దూరంలో ఉన్న మరొక షెడ్డువైపు వానలో తడుచుకుంటూనే  పరుగెత్తాడు కాటికాపరి బహుశా సారాతాగి మళ్లీ వద్దామని.అంత వర్షంలోనూ చితికి కొద్దిదూరంలో ఆకాశం కింద నిలబడి వానను పట్టించుకోకుండా ఆ షెడ్డుకింద శివరాం చితివైపు చూస్తోంది లక్ష్మీకాంతం.

భర్తతో గడిపిన మధురక్షణాలన్నీ ఆమె కళ్లముందు మెదిలాయి.వంటగదిలో గచ్చునేలమీద నూనెచుక్కపై తాను చూసుకోకుండా కాలువేసి జారి పడబోతుంటే కూరగాయలు కోస్తున్నవాడల్లా దిగ్గునలేచి కిందపడకుండా నడుంపట్టుకొని ఆపిన శివరాం చేతులు, పదిరోజుల దాకా తనకి జ్వరం తగ్గకపోతే సేవలు చేస్తూనే చిన్నపిల్లాడిలా ఏడ్చిన భర్త కళ్లు, ‘నీచేతుల్లో గోరింటాకు బాగా పండుతుంది లక్ష్మీ’ అని తన చేతుల్ని ముదు ్దపెట్టుకున్న ఆయన పెదాలు, ‘వెళ్లొస్తాను లక్ష్మీ’ అని బతుకుదెరువు కోసం బయలుదేరే ఆయన పాదాలు, రాత్రుల్లో తనని నిశ్చింతగా నిద్రపుచ్చిన ఆయన ఛాతీ..అన్ని దృశ్యాలూ ఆమె కళ్లముందు గిర్రున తిరిగాయి. ఆ చేతులు, కాళ్లు, ఛాతీ, పెదాలు అన్నీ ఎదురుగా చితిలో కాలిపోతున్నాయి అనిపించగానే ఆమె కళ్లలోంచి దుఃఖం కట్టలు తెంచుకుంది.ఆమె నోట్లోంచి మూడు అక్షరాల మాట ఒకటి బయటికి వెలువడబోతుండగానే చప్పున అక్కడి దృశ్యం మారింది.

ఈసారి అదే చితిమీద డెబ్భైఅయిదేళ్ల లక్ష్మీకాంతం భౌతికకాయం కాలుతోంది. అదే బోరున వర్షం, అప్పటిదాకా లక్ష్మీకాంతం నిలుచున్న చోట నిల్చొని..ఇల్లు విడిచి వెళ్లిపోయిన నలభైఏళ్ల తర్వాత ఆ రోజే తిరిగివచ్చిన శివరాం.. పావుభాగం వంగిపోయిన దేహంతో భార్య చితివైపు చూస్తున్నాడు. ‘తల్లిలేని పిల్లనయ్యా.. నన్ను బాగా చూసుకుంటావు కదూ’ అని పెళ్లయిన కొత్తలో బేలకళ్లతో నవ్వుతూ తనని అడిగే భార్య శరీరం ఆకాశం కింద నేలకు పైన కాలి బూడిదవుతోంది. అతడి కళ్లలోంచి రెండు జలపాతాలు దుముకుతున్నాయి.ఉన్నచోటే కూలబడి భార్య చితివైపు చూస్తూ అతను కూడా మూడు అక్షరాల పదాన్ని గట్టిగా రోదిస్తూ పలికాడు.ఎక్కడో పిడుగుపడ్డ శబ్దానికి లక్ష్మీకాంతానికి కలచెదిరింది. మెల్లిగా కళ్లుతెరిచింది. చెంపలకు తడిగా  దిండుతగిలింది. మూసి ఉన్న గది కిటికీల బయట పెద్ద చప్పుడుతో రాత్రి ఎప్పుడు మొదలైందో..

వాన కురుస్తోంది. కరెంట్‌ పోయినా ఇన్వర్టర్‌ సాయంతో తక్కువ స్పీడులో ఫ్యాను తిరుగుతోంది. బెడ్‌లైట్‌ వెలుతురులో గడియారంలో మూడుగంటల ముల్లుని ముట్టుకొని ముందుకి కదిలింది సెకెన్ల ముల్లు. ఢెబ్భై అయిదేళ్ల వయస్సున్న శరీరాన్ని నెమ్మదిగాలేపి మంచం అంచున కూర్చోబెట్టి కొంగుతో కన్నీళ్లు్ల తుడుచుకుంది. వాన మరింత జోరు అందుకున్న శబ్దం వినిపిస్తోంది.ఆమెకెందుకో దగ్గరయిన వాళ్లు కాస్తా ఒకరి నుండి మరొకరు వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ దూరంగా వెళ్లిపోతున్న ప్రపంచంలోని కొందరు స్త్రీ పురుషులు ఒక్క క్షణం కళ్ల ముందు మెదిలారు.గది కిటికీలకు ఇవతల మరో వర్షం మొదలైంది. తెల్లవారు జామున ఎప్పటికో వాన వెలిసింది. లక్ష్మీకాంతానికి ఎందుకో జీవితంలో మొదటిసారి కాశీకి వెళ్ళాలనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement