
మీది ఏ పార్టీ?
రాజకీయ పార్టీలు ఎందుకు ఏర్పడతాయి? మనుషులు వేగిరపాటును కలిగి ఉంటారు.
రాజకీయ పార్టీలు ఎందుకు ఏర్పడతాయి? మనుషులు వేగిరపాటును కలిగి ఉంటారు. పూర్వాపరాలు తెలియకుండానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఒకే అభిప్రాయాన్ని కలిగిన వ్యక్తులు ఒకరినొకరు కలుసుకుంటారు. ఒక పార్టీని స్థాపిస్తారు. ఒక్కసారి అందులో చేరారో... ఆ వర్ణపటకంలోంచే చూస్తారు. నిష్పాక్షికత, నిజాయితీ, సమభావన అన్నీ పార్టీ వర్ణపటకపు కార్యాకారణ సంబంధాలలోంచే ద ర్శిస్తారు. రాజకీయ పార్టీలు ఎందుకు పాపులర్ అవుతాయి? ప్రజలు తమ గురించి తాము ఆలోచించాల్సిన శ్రమను రాజకీయ పార్టీలు తప్పిస్తాయి. ఆలోచించడం అనే కఠినతరమైన పనిని ప్రజలు ఇతరులకు అప్పజెప్పేస్తారు. ఏదో ఒక రాజకీయ పార్టీ నీకేం కావాలో ఆలోచిస్తుంది. ఒక అభిప్రాయాన్ని సిద్ధం చేస్తుంది. అది నీ అభిప్రాయమే, నీ గుండె లోతులలోంచి వచ్చినదే అని నమ్మిస్తుంది. నీ కలను మేం నిజం చేస్తాం అంటే ఎంత సంతోషం!!
ఎదుటి వారిలో మంచా!
తాత్వికులకు ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. రాజకీయ పార్టీలకు ప్రతి పరిష్కారానికి ఒక సమస్య ఉంటుంది! వెళ్లాల్సిన చోటుకు సాదాసీదా మార్గం కళ్లకు స్పష్టంగా కనపడుతున్నా, పార్టీలు తెలియని ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోరాడతాయి. విశ్వాసులలో విశ్వాసాలకు అనుగుణంగా భగవంతుడుంటాడు. సగుణుడు, నిర్గుణుడు, చరాచరుడు, ఒకే ఒక్కడు, అనేకులు, ఇలా... పార్టీలవారు ఏ విశ్వాసులైనప్పటికీ వారి భగవంతునికి ఒకే రూపం. అది వారి అధినాయకత్వం. సత్యం ఏమిటి? అధినాయకత్వపు ఉవాచే అయినప్పుడు అంతా సరళంగా జరిగిపోవాలి కదా! పార్టీలకు సమస్యలు రాకూడదు కదా? వస్తాయి.. ఒకోసారి! పార్టీల సమస్య ఏమిటంటే అంతరాత్మ ఉన్నవారు, కర్తవ్య నిష్ట కలిగినవారు, ఒకోసారి ఆయా పార్టీల్లో చేరడమే. ఈ తరహా జీవులు ఎదుటి పార్టీకి సంబంధించిన వారు చెప్పేదాంట్లో కూడా సత్యం ఉండవచ్చు అని ‘సంశయిస్తారు’. లేదా పార్టీ చెబుతున్న దాంట్లో ఔచిత్యం ఎంతని ఆలోచిస్తారు. పార్టీ పటకం దాటి ఆలోచించే ఇలాంటి సంశయ జీవులకు రాజకీయ పార్టీల్లో స్థానం ఉండదు. పార్టీ ‘సంశయ జీవులను’ అనుమానిస్తుంది. అటువంటి వారిని పార్టీ భరించలేదు. తాము ఎప్పుడూ కరెక్టే అనే నిశ్చితాభిప్రాయం పార్టీ వ్యక్తుల్లో ఉండాలి. ఇప్పుడు పార్టీ ఏమంటుందో దానికి సరిగ్గా వ్యతిరేకంగా భవిష్యత్తులో పార్టీ అవసరాల మేరకు చెప్పగలిగే సామర్ధ్యాన్ని పార్టీ జీవులు కలిగి ఉండాలి. దాన్నే ‘నిబద్ధత’ అంటారు. పార్టీలు మారినప్పుడు ఆయా పటకాలకు అనుగుణంగా మారడం రాజకీయ జీవులకు తప్పనిసరి!
లింకనూ ఒపీనియన్స్ మార్చాడు...
ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ ఎలా అవుతారు? లింకన్ కూడా ఇందుకు అతీతుడు కాడు! అమెరికా అధ్యక్షుడు కాక మునుపు, పొలిటీషియన్ కాక మునుపు, అబ్రహాం లింకన్ న్యాయవాది. యువ న్యాయవాది లింకన్ ఒక రోజు ఉదయం ఒక కేసును వాదించాడు. తన వాదనతో జడ్జిని మెప్పించి కేసును గెలిచాడు. మధ్యాహ్నం పూట అదే కోర్టులో మరో కేసు అదే జడ్జి సమక్షంలో వాదించాడు. ఉదయం పూట వినిపించిన వాదనకు పూర్తి వ్యతిరేకంగా కొత్త కేసును వాదించాడు. న్యాయమూర్తి నవ్వుతూ ‘మిస్టర్ లింకన్... ఉదయం నీ వాదనలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు వాదించావు. ఇంతకీ ఏది కరెక్ట్’ అని ప్రశ్నించారు.‘యువరానర్, ఉదయం నేను తప్పుగా వాదించి ఉండవచ్చు. ఇది మధ్యాహ్నం. ఇప్పుడు నేను వాదిస్తోంది కచ్చితంగా ఒప్పే’ అన్నాడు లింకన్! ఈ కేసూ లింకనే గెలిచాడు! రాజకీయాలు, వ్యాపారాల్లో లాగా న్యాయవాదృ వృత్తిలోనూ ‘పార్టీలు’ ఉంటాయి. ఒక రకంగా పార్టీల్లో ఈ మూడూ కలగలసి ఉంటాయి. ఇది రాజకీయపార్టీల ‘ఘన’ స్వభావం!
రెండో రకం పార్టీలది ‘ద్రవ’ స్వభావం! కాక్‌టైల్స్‌గా విశ్వవిఖ్యాతం! సాంఘిక జంతువు అయిన మనిషి చేసుకునే ఈ పార్టీలకు ఇతర జంతుజాలానికీ సంబంధం లేదు! ఇందులో మానవ జీవులే ఉంటాయి. మగా-ఆడా! (లేడీస్ ఫస్ట్ అనడం ఈ సందర్భంలో నాకు ఇష్టం లేదు). ఈ పార్టీలు లోకంలో లోకుల మధ్య అనాదిగా జరుగుతున్నాయి. కాక్‌టైల్స్‌లో నేను విన్నవీ, కన్నవీ వచ్చేవారం సిప్ చేద్దాం!
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి