సిటీ రాకెట్ | Rocket City | Sakshi
Sakshi News home page

సిటీ రాకెట్

Published Sat, Mar 28 2015 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

సిటీ  రాకెట్

సిటీ రాకెట్

అందరిలా కాదు శివాని. ఏడేళ్ల వయసులోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాకెట్ పట్టి...  కోర్టులోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. అమ్మానాన్నల ప్రోత్సాహం... కోచ్ సహకారం... వెరసి అద్వితీయ ప్రదర్శనతో అంతర్జాతీయ వేదికలపై నగర కీర్తిని ఘనంగా చాటుతోంది. ఆమె ఆటకు ముచ్చటపడ్డ ఎంపవర్ స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్ అందిస్తోంది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నీలో మంచి ప్రతిభ కనబరిచి సిటీకి  తిరిగి వచ్చిన ఈ ‘జూనియర్ రాకెట్’ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది.   
 
మేం సిటీకి వచ్చి సెటిలయ్యే నాటికి నా వయసు ఆరేళ్లు. నాన్న శ్రీనివాస్ పోలీస్ ఉద్యోగి కావడంతో మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి ఇక్కడికి
 బదిలీపై వచ్చాం. అమ్మ సత్యవతి గృహిణి.
 
 
సిటీకి వచ్చిన తరువాత నా ధ్యాసంతా టెన్నిస్‌పైకి మళ్లింది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఏడేళ్లప్పుడు బేగంపేట్ ఏస్ టెన్నిస్ అకాడమీలో తొలిసారి రాకెట్ పట్టా. కోచ్ ప్రవీణ్ భార్గవ్ శిక్షణలో ప్రావీణ్యం సంపాదించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టా. నా ప్రతిభను గుర్తించిన ఎంపవర్ స్పోర్ట్స్ చేయూతనిచ్చింది. విదేశాల్లో ఆడే టోర్నీలకు దొడ్లా డెయిరీ ప్రయాణపు ఖర్చులు, ట్రైనింగ్‌కు నిధులు సమకూరుస్తోంది.
 
సక్సెస్ మంత్ర...

క్రీడల్లో రాణించాలంటే ఫిట్‌నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయామంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవల్సి ఉంటుంది. డ్రైఫ్రూట్స్, ఎనర్జిటిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యమిస్తా. రోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు ప్రాక్టీసు చేస్తాను. ఉదయం వేళలో ఒక గంట ఫిట్‌నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీసు, మళ్లీ సాయంత్రం వేళలో గంట ఫిట్‌నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీస్. టోర్నీ సమయాల్లో ప్రత్యర్థుల బలబలాలు, ఆటతీరు
 ఆధారంగా నా శైలిని మార్చుకుంటాను.
 
సిటీలో విక్టరీ...

తొలినాళ్లలో సిటీలో జరిగిన వివిధ టోర్నీల్లో పాల్గొన్నా. ఎన్నో సవాళ్లు. అన్నింటినీ అధిగమించి విజయాలు సాధించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో పాల్గొనే అర్హత సాధించా. 2014 ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో జరిగిన అండర్ 14 సూపర్ సిరీస్ సింగిల్స్, డబుల్స్ విజేతనయ్యా. సిటీతో పాటు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లో సత్తాచాటా. అహ్మదాబాద్‌లో అండర్-14 నేషనల్స్ టోర్నీ రన్నర్‌గా నిలవడం లైఫ్‌లో మర్చిపోలేనిది. గతేడాది అండర్ -18 టాటా సిరీస్ నెగ్గా. ఇదేకాదు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచా. దీంతో అండర్ -14 ఇండియా టీమ్‌లో ఆడే అవకాశం దక్కింది. నాతో పాటు

చండీఘర్ నుంచి ప్రింకుల్ సింగ్, మహారాష్ట్ర నుంచి మెహత్ జైన్‌కు అవకాశమొచ్చింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నమెంట్‌లో భారత్ తరఫునా ఆడాం. సింగిల్స్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లా. తద్వారా ఆసియా జూనియర్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరా. గతంలో దిల్లీలో జరిగిన రోడ్ టూ వింబుల్డన్‌లో ఎంపికైన 16 మందిలో నేను ఒకదాన్ని. త్వరలోనే మళ్లీ దిల్లీలో జరిగే ఇదే టోర్నీలో సత్తా చాటితే వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ జూనియర్ విభాగంలో ఆడే అవకాశం వస్తుంది. దీన్ని అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా.  
 
ఐ లైక్ చార్మినార్...  


టైమ్ దొరికితే పుస్తకాలు చదువుతా. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటా. ఫెదరర్, కిమ్ క్లియ్‌స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నా. చార్మినార్ నచ్చిన స్పాట్.  
  వీఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement