సమర మే చేద్దామిలా..
సూర్య@42.9
నిన్నా మొన్నటి దాకా కాస్త చూసీ చూడనట్టు ఉన్న సూరీడు.. ‘మే’ నెల, రోహిణీ కార్తె రోజుల్లో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు.. నగరవాసిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలను ఎదుర్కోవడంలో మనకి తోడ్పడేందుకు వైద్యులు, ఫిట్‌నెస్ ట్రైనర్లు విలువైన సూచనలు అందిస్తున్నారు.
- సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
గ్రీష్మ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రెండు రోజులుగా నగరంపై విరుచుకు పడుతున్నాడు. ఉదయం నుంచే తన విశ్వరూపం చూపుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో సిటీజనులు అల్లాడుతున్నారు. నీడ లేకుండా క్షణం నిలవలేకపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా గొంతు తడుపుకొనే మార్గం కోసం వెదుకుతున్నారు. బుధవారం ఎండకు తట్టుకోలేక ప్రజలు పడే పాట్లు ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.
దాహమేస్తే ఇలా..
మూలు రోజులకన్నా ఈ సీజన్‌లో కనీసం 3 రెట్లు నీళ్లు అధికంగా తీసుకోవాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమైన ద్రవాహారాన్ని అందించేవే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకూ ఆగకుండా ఈ సీజన్‌లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటుండాలి.
సహజాహారమే సరైంది..
వేసవికాలం రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్‌కి విడిది. యాంటీ ఆక్సిడెంట్స్ నిండిన తాజా పండ్లు, కూరగాయలు దేహాన్ని చల్లబరచడంలో, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఉపకరిస్తాయి. వీటిలో.. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి.. వంటివి విరివిగా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకరకాయ, క్యాబేజి, కాలిఫ్లవర్, బ్రాక్కొలి, దోస, గ్రీన్‌బీన్స్, ఆస్పారెగస్, అల్ఫా అల్ఫా, పెద్ద వంకాయ, ఐస్‌బర్గ్, పుదీనా... వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. చెమట కారణంగా కోల్పోయే శక్తిని సులభంగా పొందేందుకు ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు. ఓట్‌మీల్, బ్రౌన్ రైస్, తియ్యటి బంగాళ దుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంతో ఓ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్‌ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి.
స్నానమే పరిష్కారం..
చమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా వీలైతే 3 సార్లు స్నానం, దీనికి వినియోగించే నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపడం మేలు. ఉదయపు స్నానం వంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్ర కు తోడ్పడుతుంది. మంచి నిద్ర మజిల్ పునరుత్తేజానికి అవసరం. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు కేర్ క్లినిక్స్‌కు చెందిన ‘ఫిజియో’ శశిశేఖర్.
మేలైన మార్గం యోగా
వేసవిలో యోగా చాలా మంచిదని కపిలమహర్షి యోగా రీసోర్స్ సెంటర్‌కు చెందిన యోగా నిపుణులు సి.ఎస్.రావు చెబుతున్నారు. సూర్య నమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకన్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషం సమయంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్య నమస్కారాలను రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ట్రాసనం, భద్రాసనం, ఏకన్ముక్తాసనం, శశాంకాసనం, అర్ధకోణాసనం, ప్రశాంతాసనం, యోగనిద్ర, షణ్ముఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. నేలపై కూర్చుని, పడుకుని చేస్తూ ఒక ఆసనం లోంచి మరో ఆసనంలోకి మారేటప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ రెండు శ్వాసల వ్యవధి ఉండేలా చూడాలి. శీతలి, ఉజ్జయి, చంద్రఖేధిని, నాడిశోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీర క ఇబ్బందులన్నింటినీ అధిగమించవచ్చు.