
రెబల్ అభ్యర్థిగా.. పార్టీకి తలనొప్పిగా మారిన భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఎన్డీయే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
వాస్తవానికి.. లోక్‌సభ ఎన్నికల కోసం 200 మందితో కూడిన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది బీజేపీ. కానీ, పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేని పవన్ సింగ్.. బీజేపీకి క్షమాపణలు చెప్పారు. అయితే సొంత రాష్ట్రంలో పోటీ చేసేందుకు మాత్రం ఆయన ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో..
బీజేపీ తరఫున బీహార్‌లో పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఆర్జేడీ తరఫున టికెట్ కోసం కూడా యత్నించారు. రెండు వైపుల నుంచి ఆయన సానుకూలత దక్కలేదు. చివరకు.. కారాకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయడమే కాకుండా.. తన తల్లితోనూ ముందు జాగ్రత్తగా మరో నామినేషన్ వేయించారు. చివరకు ఉపసంహరణ గడువు ముగిసేనాడు.. తన తల్లితో నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. ఈ పరిణామాలన్నింటిని బీజేపీ తీవ్రంగా పరిగణించింది.
మరోవైపు పవన్ సింగ్‌ను కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయని బీజేపీ.. చివరకు పవన్‌పై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కారాకాట్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌ఎల్‌ఎం నేత ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి తరఫున సీపీఐ(ఎంఎల్)ఎల్ తరఫున రాజా రామ్ సింగ్ కుష్వాహా బరిలో ఉన్నారు. జూన్ 1వ తేదీన కారాకాట్‌కు పోలింగ్ జరగనుంది.