మురసోలి సెల్వం కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

మురసోలి సెల్వం కన్నుమూత

Published Fri, Oct 11 2024 1:24 AM | Last Updated on Fri, Oct 11 2024 4:40 PM

తీవ్ర విషాదంతో సీఎం స్టాలిన్‌

తీవ్ర విషాదంతో సీఎం స్టాలిన్‌

సీఎం స్టాలిన్‌ కుటుంబంలో విషాదం 

గోపాలపురం ఇంట్లో భౌతిక కాయానికి నివాళులు 

డీఎంకేలో మూడురోజుల సంతాప దినాలు

సాక్షి, చైన్నె: దివంగత డీఎంకే అధినేత కరుణానిధి అల్లుడు, సీఎం స్టాలిన్‌ సోదరి సెల్వి భర్త మురసోలి సెల్వం (85) గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో చైన్నెకు సాయంత్రం ఆరు గంటలకు తీసుకొచ్చారు. గోపాలపురంలోని నివాసంలో ఆప్తులు సందర్శనార్థం ఉంచారు. మురసోలి సెల్వం మరణ సమాచారం హృదయంలో పిడుగు తాకినట్టు అయిందని, తాను తల వాల్చేందుకు ఉన్న ఒక్క భుజం కూడా కనుమరుగైందని సీఎం స్టాలిన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. వివరాలు.. డీఎంకే దివంగత అధినేత కరుణానిధికి అప్పట్లో వెన్నుదన్నుగా ఉన్న వారిలో మేనళ్లులు మురసోలి మారన్‌. మురసోలి సెల్వం ముఖ్యులు. మురసోలి మారన్‌ను రాజకీయంగా పైకి తీసుకొచ్చి కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి కరుణానిధి తీసుకొచ్చారు. మురసోలి సెల్వంకు తన కుమార్తె సెల్విని ఇచ్చి వివాహం చేసి ముద్దుల అల్లుడిగా వెన్నంటే ఉంచుకున్నారు. కరుణానిధి మెచ్చిన డీఎంకే పత్రిక మురసోలికి ఐదు దశాబ్దాల కాలం సిలంది పేరిట సంపాదకీయాలతో మురసోలి సెల్వం సంపాదకులుగా పనిచేశారు. డీఎంకేలోనూ కీలకంగా అప్పట్లో వ్యవహరించిన మురసోలి సెల్వం అంటే సీఎం స్టాలిన్‌కు ఎనలేని అభిమానం. తండ్రి కరుణానిధి తర్వాత తనకు బావే అంతా అన్నట్టుగా మెలిగారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ వచ్చిన సెల్వం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో గుండె పోటు రావడంతో గురువారం ఉదయం మరణించారు.

విషాదంలో కుటుంబం

మురసోలి సెల్వం మరణ సమాచారంతో సీఎంస్టాలిన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. గోపాలపురంలోని తల్లి దయాళు అమ్మాల్‌కు సహకారంగా వెన్నంటి సెల్వి ఉంటూ వచ్చారు. ఈ సమాచారంతో సెల్వి తీవ్ర విషాదంలో మునిగారు. అన్నిపనులను పక్కన పెట్టిన సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధితో పాటు మంత్రులు, మురసోలిమారన్‌ కుమారుడు, ఎంపీ దయానిధి మారన్‌ తదితరులు గోపాలపురానికి చేరుకున్నారు. కరుణానిధి కుటుంబానికి చెందిన వారందరూ గోపాలపురానికి వచ్చేశారు. సీఎం స్టాలిన్‌ అయితే తీవ్ర విషాదంతో కనిపించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో చైన్నెకు సాయంత్రం మురసోలిసెల్వం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం 6.30 గంటల తరువాత గోపాలపురం ఇంట్లో ఆప్తుల సందర్శనార్థం ఉంచారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, ఎండీఎంకే నేత వైగో, పుదియ నీతి కట్చి నేత ఏసీ షణ్ముగంతో పాటు పలువురు ప్రముఖులు తరలి వచ్చి నివాళులు అర్పించారు. మురసోలి సెల్వం మరణ సమాచారం తన హృదయంలో పిడుగు పడినట్లయ్యిందని సీఎం స్టాలిన్‌ ఆవేదనను వ్యక్తం చేశారు. అదిగో... పార్టీకి సిద్ధాంతాల ఆయుధంగా ఉన్న మురసోలి మనల్ని వదలి పెట్టి వెళ్లారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తర్వాత తాను తల వాల్చేందుకు ఉన్న ఒక్కగా నొక్క భుజం కూడా కనుమరుగైందని విషణ్ణవదనంతో వ్యాఖ్యలు చేశారు.

మూడు రోజుల సంతాప దినాలు

మురసోలి మారన్‌ మరణంతో డీఎంకేలో మూడురోజుల సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ ప్రకటన చేశారు. పార్టీ కార్యాలయాలు, వాడవాడలలోని స్తూపాలలలో పార్టీ జెండాను అవనతం చేయాలని, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశించారు. మురసోలి సెల్వం మరణ సమాచారంతో ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ, ఈ సమాచారం సెల్వి ఎలా తట్టుకో గలదోఅని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వం లేదన్న సమాచారంతో సీఎం స్టాలిన్‌ తీవ్ర విషాదంలో ఉన్నారని మనో ధైర్యంతో ఆయన ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, ఎండీఎంకే నేత వైగో1
1/1

మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, ఎండీఎంకే నేత వైగో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement