చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్రజేశారు. అదే పనిగా భారత జాలర్లపై దాడులు, అరెస్టులకు ముగింపు పలికేందుకు శ్రీలంక ప్రభుత్వంతో కఠినంగా వ్యవహరించాలని కోరారు. శ్రీలంక నేవీ ఇటీవల పెద్ద ఎత్తున భారత జాలర్లను అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిలో తమిళనాడు జాలర్లే ఎక్కువ. ఈ నేపథ్యలో జయ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. దాన్ని మంగళవారం మీడియాకు విడుదల చేశారు. అడ్డూ అదుపూ లేకుండా శ్రీలంక చేస్తున్న దాడుల వల్ల.. వచ్చే నెల 28న చెన్నైలో రెండు దేశాల జాలర్ల ప్రతినిధుల మధ్య జరగనున్న చర్చలకు తగిన సానుకూల వాతావరణం ఏర్పడదని జయ అభిప్రాయపడ్డారు.
ఇరుదేశాల జాలర్ల మధ్య చర్చలకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో.. శ్రీలంక ప్రభుత్వం అదేపనిగా తమిళనాడు జాలర్లను నిర్బంధించడం దురదష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కఠినంగా వ్యవహరించడం ద్వారా అరెస్టులను నిరోధించాలని కోరారు. డిసెంబర్ 28, 29 తేదీలలో శ్రీలంక నేవీ తమిళనాడులోని పుదుకొట్టాయ్, రామనాథపురం జిల్లాలకు చెందిన 40 మంది జాలర్లను అరెస్ట్ చేయడం ఆ వర్గం వారిని షాక్‌కు గురిచేసిందన్నారు. పాక్ జలసంధిలో చేపలు పట్టేందుకు భారత జాలర్లకు ఉన్న సంప్రదాయ హక్కులను శ్రీలంక ఉల్లంఘిస్తోందని తెలిపారు.